Tuesday, 8 November 2016

అంతరంగ ఆంతర్యం అద్దమెలా చెప్పగలదు ||
ఆవేదన హేతువేదొ కాలమెలా చెప్పగలదు ||

గమనాలను ఆపలేవు ఉప్పెనలే ఎదురయినా
మరునిమిషపు మార్పులనే జీవమెలా చెప్పగలదు ||

వెన్నెలలను వేదనలను బంధించుట సాధ్యమౌన
కల్లోలపు మదిలోతులు లోకమెలా చెప్పగలదు ||

అక్షరమే ప్రపంచమై భావానికి బానిసనే
చిరునవ్వుల భాష్యాలను గాయమెలా చెప్పగలదు ||

ప్రమిదలోని వత్తికూడ వెలుగుకొరకు వెతుకుకదా
దాగుండిన ఆనందపు మార్గమెలా చెప్పగలదు ||

తలగడకే తలపోతలు మనసుకెన్ని మర్మాలో
నలుగుతున్న కథలెన్నో తిమిరమెలా చెప్పగలదు ||

మౌనవాణి మాధుర్యం కవనానికి తెలియునులే
రెప్పచాటు దృశ్యాలకు మూలమెలా చెప్పగలదు ||

...........వాణి, 18 Oc t 16

No comments:

Post a Comment