Tuesday, 8 November 2016

మౌనంలో పయనించే మనసెరిగిన ఊహలూ ll
కన్నీటిని ఊరడించు కలలెరిగిన ఊహలూ ll

మూసివున్న కన్నుల్లో మధురమైన దృశ్యాలు
భావానికి రూపమిచ్చు గుర్తెరిగిన ఊహలూ ll

కలవరాల హృదయంలో ఆత్మీయపు సంతకాలు
గుండెగుచ్చు ఙ్ఞాపకాల కలతెరిగిన ఊహలూ ll

అలనాటివి అనుభూతులు అలకలలో సరదాలు
మదితాకే గిలిగింతల స్పర్శెరిగిన ఊహలూ ll

తలపంతా పులకింతలు పెదవులపై చిరునవ్వులు
చిలిపితనం చిగురించే మమతెరిగిన ఊహలూ ll

కడతేరిన స్వప్నాలే మౌనవాణి కవనాలు
తడిఆరని అక్షరాల చరితెరిగిన ఊహలూ ll

చీకటితో మాటాడే చూపుల్లో మెరుపులవి
శూన్యంలో తచ్చాడే గెలుపెరిగిన ఊహలూ ll

..........వాణి , 21 Oct 16

No comments:

Post a Comment