Monday, 16 April 2018

ఆనందం నాదేనని చెప్పాలని ఉంటుంది ||
సముద్రాన్ని సంబరంగ ఈదాలని ఉంటుంది ||
నవ్వులలో నా అందం కొలవలేరు ఎవరైనా
ఆహ్లాదపు మర్మాలను పంచాలని ఉంటుంది ||
మనసైనది సొంతమయ్యి నన్ను నేను గెలిచానే
నా విజయపు రహస్యాన్ని విప్పాలని ఉంటుంది ||
మానసమే హాసాలను దాచలేక పోతున్నది
విహంగమే నేనౌతూ ఎగరాలని ఉంటుంది ||
మదిదాచిన భావాలకు మందస్మిత సందడిదీ
నవ్వుతూనె బ్రతుకంతా గడపాలని ఉంటుంది ||
గుండెల్లో దాగుండిన నిశ్శబ్దపు ఊహలెన్నొ
మనసు విప్పి కోయిలనై పాడాలని ఉంటుంది ||
మౌనవాణి గమనంలో మాధుర్యం సాధ్యమౌన
చిరునవ్వుల గమ్యాలను చేరాలని ఉంటుంది ||
అంబరాన్ని అంబుధినీ దీవించమంటున్నా
ముత్యంలా స్వచ్ఛంగా గడపాలని ఉంటుంది ||
వేదనకు భావాన్ని వెతకడం నేర్చుకో ...||
గాయాన్ని గరళాన్ని గెలవడం నేర్చుకో ...||
రాలింది ఓ పువ్వు స్వప్నాలు ఏమార్చి
మౌనాన్ని మధురంగ మలచడం నేర్చుకో...||
దిశలన్ని తారాడి ధైన్యాన్ని ఓడించు
కష్టాన్ని మలుపుగా మార్చడం నేర్చుకో...||
గుండెల్లొ దుఃఖాలు చెమరించుతున్నాయి
కన్నీటి కథలల్లి చెరపడం నేర్చుకో.....||
ఓ వాణీ మనసంత మౌనాల గేయాలు
భావాల రాగాలు పలకడం నేర్చుకో....||
ఎడారిలొ దాహాలు గుండెలో వేదనలు
కన్నీటి సంద్రాన్ని ఈదడం నేర్చుకో...||
......వాణి కొరటమద్ది