Sunday, 7 August 2016

దుఃఖాలకు తెరతీసే మౌనాలని కోరుకోను ||
కన్నీళ్ళే వర్షమైతె తడవాలని కోరుకోను ||

.
సంతోషపు సామ్రాజ్యం ఏలాలని ఉందినాకు
వేదనలకు స్వాగతాలు పలకాలని కోరుకోను ||

.
కష్టాలను ఇష్టంగా రమ్మంటూ పిలవాలా
జీవితాన్ని చీకటితో నింపాలని కోరుకోను ||

.
జాలిలేని ఆ దేవుడు శిక్షలెన్నొ వేస్తుంటే
విధిరాతకు తలవంచుతు బతకాలని కోరుకోను ||

.
మధురమైన భావాలను మౌనవాణి గెలవాలీ
శాంతిలేని అడుగులతో సాగాలని కోరుకోను ||

.
నిశ్శబ్దం బద్దలైతె మాధుర్యపు రాగాలే
స్వప్నాలకు వీడుకోలు చెప్పాలని కోరుకోను ||

.
వాణి, 6 August 16
నవ్వుల సవ్వడి మనసును తాకే వెన్నెల ధారా ||
బీడుగ మారిన మదిలో కురిసే వెన్నెల ధారా ||

.
నిలిచిన నీడలు కాంతులవైపుకు తరలే సమయం
మౌనం ఓడుతు వాణిని గెలిచే వెన్నెల ధారా ||

.
కన్నుల ముందుకు చూపులు వెతకని ఆశ్చర్యాలే
ఊహల తెమ్మెర బొమ్మై నిలిచే వెన్నెల ధారా ||

.
నడిచే దారికి వెలుగుపువ్వులే స్వాగత మన్నవి
నిశలే చేరని హాసం  చిలికే వెన్నెల ధారా ||

.
వేదన మనసే సుఖాల తీరం చేరిందిపుడే
ఆశలు శిఖరం అంచున కులికే వెన్నెల ధారా ||

.
చినుకులు తడిపితె ఙ్ఞాపకమౌతు బాల్యపు తళుకులు
తియ్యని భావం  కవితై ఒలికే వెన్నెల ధారా ||

.
.......వాణి, 7 August 16