Tuesday, 3 January 2017

ఆరిపోవక కలలగూటిలొ కదులుతున్నది దుఃఖమే ||
వెతలమనసును వీడలేకనె వేగుతున్నది దుఃఖమే ||

జాలిచూపులు గాయమౌతు గుండెనిండిన మౌనఘోష
కలవరాలను కంటిఇంటిలొ మోయుచున్నది దుఃఖమే ||

చీకటైనది బాటఅంతా తోవతెలియక సాగుతూ
మిణుకువైనా కానరాకనే మసలుతున్నది దుఃఖమే ||

తప్పిపోవవి గతమునీడలు ఈదుతున్నవి ఉప్పునీటిలొ
నిశలునిండిన హృదయగదులను ఏలుతున్నది దుఃఖమే ||

తలపులేవో తట్టిలేపెను మనసుతడితొ మసకబారెను
ఓపలేకనె ఙ్ఞాపకాలను తాగుతున్నది దుఃఖమే ||

కానరాదేం స్వప్నలోకం నిదురకడుగులు దూరమమైనవి
వెలుగుతీరం జాడవెతుకుతు సాగుతున్నది దుఃఖమే ||

మధురవాణిది మౌనఘర్షణ మనసుయుద్ధం ఆగిపోనిది
కంటిచెలమలు ఎండిపోకనె కరుగుతున్నది దుఃఖమే ||

.......వాణి,  29 Dec 16
కరుగుతున్న కాలాలను నిలపాలని ఉన్నదిలే ||
ఙ్ఞాపకాల గమనంలో నిలవాలని ఉన్నదిలే ||

భావాలను వెలిగిస్తూ దుఃఖాలను వెలివేస్తూ
మందస్మిత మాధుర్యం గెలవాలని ఉన్నదిలే ||

నిలదీయని నిన్నల్లో గాయాలే మిగిలాయా
చిరునవ్వుల వర్ణాలను అద్దాలని ఉన్నదిలే ||

అద్దంలో అందాలను చూడలేని ఓటములే
ఆనందపు అంకురాలు నాటాలని ఉన్నదిలే ||

దిగులుపడే కనుపాపల కన్నీళ్ళను దాచేస్తూ
దరహాసపు దర్బారును ఏలాలని ఉన్నదిలే ||

మౌనవాణి మదిభావం మధురమైన ఓ కావ్యం
చీకటులను చిరునవ్వుతొ తరమాలని ఉన్నదిలే ||

........వాణి,  30 Dec 16
ముగిసిపోయిన జీవచరితలు మౌనభాష్పం రాల్చుతున్నవి ||
కరుణనిండిన చూపులన్నీ బాధకర్ధం తెలుపుతున్నవి ||

గోడపైననె గాధలెన్నో చిత్రమైనవి సాక్షమౌతూ
ఙ్ఞాపకాలలొ మరకలేఅవి గతిని గాయం చేయుచున్నవి ||

వెల్లివిరిసిన లాస్యమేదని మూగమనసులు ఘోషపెడుతూ
కలసినడచిన అడుగులన్నీ శూన్య గమనం చాటుతున్నవి ||

ఏది ఏదని వెతుకుతున్నది మనసు తాపం వీడిపోదేం
హృదయభారం ఓపలేకనె కలలు భాష్యం పలుకుతున్నవి ||

మధురహాసం మాయమయ్యెను చెమ్మగిల్లిన రూపమౌతూ
తిమిరతరగలు చెరిగిపోకనె శిశిర రాగం పాడుతున్నవి ||

శిధిలమైనవి ఆశలన్నీ పెదవిదాటవు నవ్వులేవీ
మధురవాణివి తప్పటడుగులు చిద్విలాసం వెతుకుతున్నవి ||

ఊపిరాగదు ఉనికిమరవదు చిత్రమైనవి క్షణములన్నీ
ఊహమరచిన కంటిపాపలు కాంతి వర్ణం కోరుతున్నవి ||

........వాణి, 03 Jan 17