Tuesday, 3 January 2017

ముగిసిపోయిన జీవచరితలు మౌనభాష్పం రాల్చుతున్నవి ||
కరుణనిండిన చూపులన్నీ బాధకర్ధం తెలుపుతున్నవి ||

గోడపైననె గాధలెన్నో చిత్రమైనవి సాక్షమౌతూ
ఙ్ఞాపకాలలొ మరకలేఅవి గతిని గాయం చేయుచున్నవి ||

వెల్లివిరిసిన లాస్యమేదని మూగమనసులు ఘోషపెడుతూ
కలసినడచిన అడుగులన్నీ శూన్య గమనం చాటుతున్నవి ||

ఏది ఏదని వెతుకుతున్నది మనసు తాపం వీడిపోదేం
హృదయభారం ఓపలేకనె కలలు భాష్యం పలుకుతున్నవి ||

మధురహాసం మాయమయ్యెను చెమ్మగిల్లిన రూపమౌతూ
తిమిరతరగలు చెరిగిపోకనె శిశిర రాగం పాడుతున్నవి ||

శిధిలమైనవి ఆశలన్నీ పెదవిదాటవు నవ్వులేవీ
మధురవాణివి తప్పటడుగులు చిద్విలాసం వెతుకుతున్నవి ||

ఊపిరాగదు ఉనికిమరవదు చిత్రమైనవి క్షణములన్నీ
ఊహమరచిన కంటిపాపలు కాంతి వర్ణం కోరుతున్నవి ||

........వాణి, 03 Jan 17

No comments:

Post a Comment