Wednesday, 14 October 2015

గజల్ ...............
ఎదచాటున చింతఏదొ చెప్పలేని జీవితం ||
మౌనంలో అలజడులను విప్పలేని జీవితం ||
స్వప్నంలో నవ్వులన్ని కవ్వింతగ మిగులుతూ
వేకువలో హసితాలను గెలవలేని జీవితం ||
ఊహలలో మెదులుతున్న మెరుస్తున్న నీ రూపం
సడలిపోయి కలలన్నీ అందలేని జీవితం ||
శ్వేతమబ్బు తరగలలో విహరిస్తూ వుంటావు
కనులముందు కదలాడిన చేరలేని జీవితం ||
నీ ఆలాపన 'వాణి'తొ తన్మయమై పోతున్నా
ఆశగానె మిగిలిపోయే పలుకులేని జీవితం ||
…...................వాణి 6 sep 15
గజల్ ............
వేగిరమే రావయ్యా చిట్లి పోయె ధరణిచూడు ||
వరుణుదేవ పలుకరించు పగిలిపోయె పుడమిచూడు ||
కలుపుమొక్క కరువాయెను జంతుజాతి ఎండుతూ
తడిస్పర్శకు తొందరాయె చీలిపోయె నేలచూడు ||
కనులు తెరచి నేలతల్లి చూస్తున్నది నింగివైపు
చితికిపోయి బతుకులెన్నొ వలసపోయె దారిచూడు ||
మొలకెత్తగ విత్తులనే అవనికెంత ఆత్రమో
ఆలస్యము భారమౌతు తరలిపోయె రైతుచూడు ||
పాలుకారు పసి పిల్లలు బతుకువేట మొదలెట్టిరి
ఏలికలకు కానరాని తరలిపోయె జీవిచూడు ||
...…..వాణి, 14 oct 15
గజల్ ...........
చేజారిన కాలంలో కలతలెన్నొ దాగున్నవి ||
చెంపలపై చారికలలొ బాధలెన్నొ దాగున్నవి ||
స్వర్గ మైన బాల్యాలే జ్ఞాపకాల మాధుర్యం
అనుబంధపు ఆనవాళ్ళ గుర్తులెన్నొ దాగున్నవి ||
స్పర్శించే ప్రేమలకై తపియించే తనువులెన్నొ
ఎదలోతుల వేదనలో వ్యధలెన్నో దాగున్నవి ||
మదిలోతుల చిలుకుతున్న ఒలుకుతున్న గేయాలే
ఆంతర్యపు అక్షరాల్లొ విలువలెన్నొ దాగున్నవి ||
తీగతెగిన మదివీణియ పలుకుతున్న స్వరాలే
గాయపడ్డ గుండెలోతు స్పర్శలెన్నొ దాగున్నవి ||
చెమ్మగిల్లి కనులలోన దృష్టి అంద కున్నదీ
తడి చూపుల తడబాటులో చింతలెన్నొ దాగున్నవి ||
మౌన’వాణి’ ప్రకటించే స్పర్శించే భావాలు
తరలిపోయి క్షణాలలొ తపనలెన్నొ దాగున్నవి ||
.................వాణి,15 oct 15

Monday, 5 October 2015

గజల్ .............
వేచి వుండు చూపులన్ని శున్యానికి సొంతమే ॥
నింగిజార్చు చినుకులన్ని భూమాతకి సొంతమే ॥
పగిలిపోయి మట్టిలోన పరిమళమే లేదులే
వానకురిసి సువాసనలు ఎల్లరికీ సొంతమే ॥
ఎదురుచూచు కన్నులలో కురుస్తున్న నీళ్ళెన్నో
వానలేని వ్యతలన్ని కర్షకునికి సొంతమే ॥
విత్తులన్ని సమకూర్చి ఆశలెన్నో నాటాలని
మొలకెత్తితె పాడిపంట రైతన్నకి సొంతమే ॥
చేనులోన మట్టికణం నోరుతెరిచి వేచివుండె
తడిచూడని నేలస్పర్శ పాలేరుకి సొంతమే ॥
జల్లులలో తడవాలని నింగివైపు చూపులన్ని
తరువులన్ని తపియించే తాపానికి సొంతమే ॥
వాణి, 10 సెప్టెంబర్ 15
గజల్.............
వరుణుడిలా దయచేసే వరం ఒకటి కావాలీ ||
పరిమళించు మట్టి తడుపు జల్లు ఒకటి కావాలీ ||
రైతుగుండె వేసారెను కన్నీటిని మోయలేక
ప్రాణమిచ్చి నిలువరించ వానఒకటి కావాలి ||
వేలాడెను తరువులన్ని వేరుతడిసె తడిలేక
చిరుగాలితొ పలుకరించ సోన ఒకటి కావాలీ ||
పగిలిపోయె నేలంతా కరువుకు రుజువౌతూ
మేఘమైన జాలిచూపి వర్షమొకటి కావాలి ||
కాలమంత ఒకటౌతూ నిత్య గ్రీష్మమౌతుంటె
తడితనముతొ మేల్కొల్పే ఉదయమొకటి కావాలీ ||
కర్షకునికి సాగుబడే వ్యదాభరితమైపోయె
పొలంతడిసె దారి చూపు మార్గమొకటి కావాలీ ||
..................వాణి కొరటమద్ది,11సెప్టెంబర్ 15
గజల్ ......................
నీ కంటి చూపులో ఆశేదొ ఉంది
ఆ కనుల వల్లించు దిగులేదొ ఉంది ||
నీ మదిన దాగున్న భావాలు ఎన్నో
ఓ చెలిమి కాంక్షిoచు పిలుపేదొ ఉంది ||
మనసంత నిండున్న నీ ప్రేమ దీపం
బతుకంత గెలిచేటి బలమేదొ ఉంది ||
సాక్ష్యoగ మిగిలున్న మనస్నేహ లేఖలు
చిరునవ్వు మెరుపుల్ల రాతేదో ఉంది ||
అలనాటి నీ నవ్వు చిగురించ కుంది
వేలాడె కొమ్మకు ఆశేదో ఉంది
ఏమాయ ఏమోలె నీ కలత తెలియదు
తడిచూపు చెప్పేటి తపనేదొ ఉంది ||
మౌనించి నీ 'వాణి' పెదవుల్ని విప్పక ||
కావ్యoలొ నిండిన గురుతేదొ ఉంది ||
....... వాణి, 15 sep 15
ఓటములని అనుభవమని గుర్తించుట తెలియాలి
సాధించిన విజయాలను నిలుపుంచుట తెలియాలి
అనుబంధపు ఆనవాళ్ళు కరిగిపోతూ మంచువలె
తుడిచేస్తూ కలతలన్ని ప్రేమించుట తెలియాలి
గతాలలో గమనాలలొ బాధలెన్ని నొప్పించిన
ఊరడించు మనసువుండి ఓదార్చుట తెలియాలి
మానలేని మదిగాయం జీవితగతి మార్సునేమో
అనుభవమే తోడనుకొని మరిపించుట తెలియాలి
బందాలెన్నున్నగాని స్నేహబంధం గోప్పదోయి
సహకరించి ఇడుములలొ నడిపించుట తెలియాలి
తప్పనపుడు రేయంతా రెప్పమూయని చింతలే
వేకువలో బాధ్యతలను భరియించుట తెలియాలి
........వాణి., 24 sepసెప్టెంబర్ 15
గజల్ ..........
మౌనాలను పలికించే మాటిమ్మని కోరుతోంది
చెక్కిలిపై చిరునవ్వుల విరులిమ్మని కోరుతోంది ||
అలవాటుగ మారిపోయి నీ ఊసుల కలవరింత
మెలుకువలో నీ పెదవిని పలుకిమ్మని కోరుతోంది ||
సంద్రంలా మదినిండుగ ఆటుపోటు అలజడులే
హాయినిచ్చు బాందవ్యపు తోడిమ్మని కోరుతోంది ||
వ్యవసాయికి చినుకులకై తడికన్నుల ఆరాటం
ధరణి మాత వరుణిడినే జల్లిమ్మని కోరుతోంది ||
చిరునవ్వుల తీరాలూ దూరంగా పోతుంటే
ఆ దేవుని హసితాలను వరమిమ్మని కోరుతోంది ||
త్యాగమంత స్త్రీదైనా అణచివేత తప్పలేదు
శీలాన్నీ దోచేయని గెలుపిమ్మని కోరుతోంది ||
.........వాణి, 3 sep 15
గజల్ ...
మనసులోని మౌనాలను తొలగించగ రావా ||
నవ్వునింపి జీవితాన్ని వెలిగించగ రావా ||
కన్నీటిని మోయలేక భారమౌతు ఉన్నాను
సిరివెన్నెల జల్లులను కురిపించగ రావా ||
చిరుచీకటి మేఘాలూ కమ్ముకున్న దు:ఖాలు
చిరునవ్వుల తెమ్మెరలను విదిలించగ రావా ||
దూరమయ్యి మమతలన్ని చింతలెన్నొ చేరాయి
ఆత్మీయత గెలుచుకునే వరమివ్వగ రావా ||
మనసులోని భావాలను నీ శిలకే చెప్పుకుంటు
మౌనశిలను నీ 'వాణి'తొ దీవించగ రావా ||
……వాణి,3 sep 15