Friday, 8 January 2016

గజల్...................

కనులెదురుగ నువ్వుంటే మౌననిధులు నాకెందుకు ||
స్మరదీపిక నీదయితే జ్ఞాపకాలు నాకెందుకు ||

మునుపటివే అనుభవాలు నీడలుగా మెదిలాయీ
కాలమంత చిరునవ్వైతె మనసుతడులు నాకెందుకు ||

విషాదాల నెలవులోన కాంతిలేక నడుస్తున్నా
నిశలబాట నిషిద్దమే అమావసలు నాకెందుకు ||

చూపులోన కన్నీళ్ళే దాటివెళ్ళ కున్నాయీ
నిశబ్దంలొ నిలచుంటే మౌనసడులు నాకెందుకు ||

అనునిత్యం అమ్మప్రేమ గెలుపువెలుగె నడిచొస్తుంది
బతుకంతా వాచ్చల్యం గుప్తనిధులు నాకెందుకు ||

మౌనవాణి వాక్కులన్ని అక్షరమై మాటాడెను
ఆంతర్యం తెలిసుంటే పలుకుసిరులు నాకెందుకు ||

మమతపూల వనంలోన విహరించాలనివున్నది
బంధాలు ఆనందాలె విరోధాలు నాకెందుకు ||
...............వాణి, 7 jan 16
గజల్ కాన్వాస్ .....39
మోమునలా దాచకలా చూపలేవ నేస్తమా ||
తలవంపుకు కారణమే చెప్పలేవ నేస్తమా ||
ఆవేదన మదిలోతున ఏమున్నదొ ఏమిటో
భారమైన గుండెగాధ విప్పలేవ నేస్తమా ||
తరాలుగా తప్పలేదు కలకంఠికి కన్నీళ్ళు
తలవాల్చక బేలవవక గెలవలేవ నేస్తమా ||
చతికిలపడి పోకుఅలా శాంతినిచ్చు కపోతమ
కాంతిలతగ అల్లుకుంటు ఎదగలేవ నేస్తమా||
జన్మనిచ్చు వెలుగుపువ్వు మమతపంచు దేవతవె
నిన్నునీవు రాల్చుకోక ఎగరలేవ నేస్తమా ||
మౌనమైన మాటాడిన నిందవేయు సమాజమే
దృష్టంతా లక్ష్యమౌతు సాగలేవ నేస్తమా ||
వదనాన్ని నీవాణిని దాచుకోకు నెచ్చెలీ
ఈదుతున్న బాధలన్ని ఒలకలేవ నేస్తమా ||
...........వాణి, 5 jan 16
గజల్............
రేయంతా కనురెప్పలు కలవలేదు ఎందుకనో ||
ఆశించిన స్వప్నాలే గెలవలేదు ఎందుకనో
మనసులోని నిర్లిప్తత సడిచేయని స్తబ్దత
కలతలన్ని కంటిలోన కురవలేదు ఎందుకనో ||
చూపుతాకు వెలుగులలో నీడలెన్నొ తోడయ్యెను
కాంతిస్పర్స కనుపాపను తాకలేదు ఎందుకనో ||
పెదవులలో ఆరాటం పలుకులెన్నొ ఒలకాలని
గుండెతడితొ మాటలన్ని పెగలలేదు ఎందుకనో ||
మరిలిపోయే వత్సరాలు చెదిరిపోతు బంధాలు
ఆత్మీయపు పలుకరింపు అందలేదు ఎందుకనో ||
నవ్వులతో అలలెన్నో కనులముందు తారాడెను
మధురస్మృతులు మదిలోన మెరవలేదు ఎందుకనో ||
…………..వాణి, 4 jan 16
గజల్..................
పువ్వులలో పరిమళాలు ముదముగానె మారుతోంది ||
పరిసరాలు దోచుకుంటు గాలిలాగ మారుతోంది ||

అలలెన్నో ఎగసిపడుతు అందుకొనగ ఆకశాన్ని
నిత్యమైన పోరాటం ఓర్పుగానె మారుతోంది ||

మనసుకడలి మోయలేక కన్నీళ్ళుగ ప్రవహిస్తు
జ్ఞాపకాల గాధలన్ని గజలుగానె మారుతోంది ||

అందలేని విజయాలకు తల్లడిల్లు మనసుల్లో
అనుభవమే పాఠమౌతు గెలుపుగానె మారుతోంది ||

నిన్నలన్నీ కలగలసిన గతములోకి చేరిపోయె
నేటలోని ప్రతిక్షణం చూపుగానె మారుతోంది||

మనుగడనే భారమౌతు మగువమోయు నిందలెన్నొ
మార్పులేని సమాజంలో బరువుగానె మారుతోంది||

రెప్పపడని రాత్రులలో తలపులతో పోరాటం
కొత్తదనపు ప్రొద్దుపొడుపు ఆశగానె మారుతోంది ||

మౌనవాణి స్వప్నాలే చెదిరిపోయి అలసిపోయె
మదిలోతుల చింతలెన్నో మసకగానె మారుతోంది ||

గజల్.........

కాలానికి కన్నీళ్ళే సంకెలలుగ మిగిలాయి ||
గాయానికి జ్ఞాపకాలు రుజువులుగా మిగిలాయి ||

తడికన్నులు చెపుతున్నవి ఎన్నెన్నో భాష్యాలు
రెప్పచాటు వేదనలే గాధలుగా మిగిలాయి ||

నిదురలేని రాత్రులెన్నొ అలసటెంతొ చూపులలొ
నొప్పిపడ్డ ఘడియలన్నికలతలుగా మిగిలాయి ||

కంటికింది లోతులలో కుంగుబాటు ఛాయలలొ
మనసులోని మర్మాలే మౌనంగా మిగిలాయి ||

మౌనవాణి కనురెప్పల కదలికలో భావాలు
లాలిత్యపు లాస్యాలే గురుతులుగా మిగిలాయి ||

మెరుపులెన్నొ కురిపించిన గతవైభవ గుర్తులే
ఆ కన్నుల ఆనవాళ్ళు అలసటగా మిగిలాయి ||
....................వాణి , 21 dec 15
గజల్...................

మౌనంలో ఆంతర్యపు భావమెవరు చెప్పాలట ||
చేజారిన చిరునవ్వుల తీరమెవరు చేర్చాలట ||

అందలేని ప్రేమేదో దోబూచులు ఆడుతోంది
మానసాన్ని హత్తుకునే దారిఎవరు చూపాలట ||

గుండెలోన దిగులేదో నన్ను వీడి పోన్నన్నది
ఆదరింపు ఆత్మీయపు కౌగిలెవరు ఇవ్వాలట ||

చిన్ననాటి స్మృతిఏదొ జ్ఞాపకంలొ మెరిసింది
బాల్యానికి తరలివెళ్ళు భాగ్యమెవరు ఇస్తారట ||

వెన్నెలలో వన్నెలెన్నో మనసుచెప్పు ఊసులెన్నొ
మధురూహల మురిపాలకు తోడుఎవరు వస్తారట ||

మౌనవాణి సాధించిన స్వప్నమేమో పగిలిపోయే
ఉప్పొంగే వేదనలకు అండఎవరు ఉంటారట ||

దాహంతో ధరణిమాత తల్లడిల్లె తడి స్పర్శకు
మబ్బులన్ని అలిగివుంటె చినుకులెవరు రాల్చాలట ||

చీకటంత చుట్టుకుంది జాబిలేమో దాగుంది
నిశలుచీల్చ నెలరాజుకి తోవ ఎవరు చూపాలట ||

......................వాణి, 20 dec 15
గజల్,,,,,,,,,,,,,,,,,,,,

వేదన మనసుకు తిమిరపు జాడలు తొలగేదెపుడో ॥
దిగులే పోవుచు మిణుకుల జ్యోతులు చేరేదెపుడో ॥

నింగిలొ కనులకు విందును చేసే పున్నమివెన్నెల
చీకటి తొలగుతు మనసుకు వెలుగులు పంచేదెపుడో ॥

అందెలు పలికే రవళులు వీనుల విందే కాదా
నాదరి చేరుత శబ్దపు అడుగులు మురిసేదెపుడో ॥

విరిసే పెదవులు దరహాసంతో మౌనము మాయం
వీడిన బంధం 'వాణి'ని చేరుతు మాటలు పలికేదెపుడో ॥

గెలుపోటములకు అలలే చెప్పెడి పాఠం చూడు
విజయం వరమే అవుతూ ఆశలు తీరేదెపుడో ॥

కలలో ఇలలో కలతలు లేనీ జీవన యానం కావాలి
నిత్యం హసితం పంచుతు నవ్వులు కురిసేదెపుడో ॥

......... వాణి ,18 dec 15
గజల్ కాన్వాస్ ……36

నీ కిల కిల నవ్వులన్ని గుప్తంగా మారిపోయె ||
నీ అందం పత్రముపై చిత్రంగా మారిపోయె ||

కురుస్తున్న చినుకులుగా నీ ధ్యాసల తలపులులే
మనసులోని మాటలన్ని కావ్యంగా మారిపోయె ||

నీ స్పర్శే దూరమైన ఎదనిండుగ నీవేగా
ఎడబాటుల సమయమంత మౌనంగా మారిపోయె ||

కంటిలోన నీ రూపం గుండెలోన తొలి కాలం
ఎదురుచూపు క్షణాలన్నిఇష్టంగా మారిపోయె ||

మనప్రేమల మందిరంలొ ఆలాపన సమీరాలు
మధురమైన అనుభూతుల సాక్ష్యంగా మారిపోయె ||

మహలులోన అడుగడుగున నీ శిల్పం నిలిపాను
జన్మంతా నీస్మృతులె లోకంగా మారిపోయె ||

కరిగిపోని నిధులుగా దరహాసపు వెలుగులెన్నో
తనివితీర జీవించగ ప్రాణంగా మారిపోయె ||

..........వాణి ,15 dec 15