Monday, 24 August 2015

గజల్ ............
చిగురాకుల తరువుగానె వెలగాలని ఉన్నది ॥
పచ్చదనం పరిమళాన్ని పంచాలని ఉన్నది ॥

చినుకులను బంధించెను వరుణుడేల అలిగెనో
మేఘాలని మోసుకొచ్చి కురవాలని ఉన్నది ॥

ఎండిపోతు వృక్షశిలగ కూలిపోక తప్పదేమో
చిరుజల్లుల సంతసాలు కావాలని ఉన్నది ॥

ఆమనిలో అందమంత నాసొంతం కావాలని
కోయిలలకి నెలవుగానె మిగలానని ఉన్నది ॥

హత్తుకున్న లతలన్నీ చిట్లిపోతు ఉన్నాయి
వేగముగా తొలకరిలో తడవాలని ఉన్నది ॥

ప్రకృతిదే మౌన'వాణి' సంజ్ఞలతో స్పందనలె
చిరునవ్వుల చిరుగాలులు వీయాలని ఉన్నది ॥

.......వాణి, 25 Aug 15

Sunday, 23 August 2015

గజల్............. 

అలలహోరుతొ కడలితీరం పొంగిపోతూ మురుస్తున్నది ॥  
మనసుపలికే అశ్రుగీతం కుమిలిపోతూ కురుస్తున్నది  ॥ 

నదులనీటిని ప్రేమపంచుతు జలధినీటితొ ఆదరిస్తూ 
పరిధిపెంచీ  పరవశంతో ఇమిడిపోతూ కలుస్తున్నది ॥ 

చింతలన్నీ చేరువౌతూ  నవ్వులన్నీ ఎగిరి పోయెను 
దూరమయ్యెను పలుకుయేదో  పగిలిపొతూ మరుస్తున్నది  ॥ 

కరువులేనీ కంటనీరుని కలుపుకున్నది సంద్రమే 
గాయ శిలనే హత్తుకుంటూ కరిగిపోతూ తుడుస్తున్నది   ॥ 

ఉనికిసైతం మాసిపోయెను దు:ఖనీడలు కమ్ముకొనగా  
తోడువదిలెను బంధమొకటి మరచి పోతూ విడుస్తున్నది  ॥ 

అందలేదూ  ఆత్మీయహస్తం విరుపుకుంపటి రగులుతూ 
మౌన 'వాణీ' కనులనీటిలొ తడిసిపోతూ వచిస్తున్నది ॥ 



......వాణి 

Friday, 21 August 2015



HAPPY INDIPENDENCEDAY FRIENDS
దేశభక్తి అంటే మొదటగా సైనికులు గుర్తొస్తారు వారిపై ఒక గజల్.ప్రయత్నం ....
||సైనికులు ||
మౌనంలో ఆవేశం సైనికునికి సొంతము ||
గాయమైన గాంభీర్యం సైనికునికి సాధ్యము ||
నియంత్రణ రేఖదాటి దాడిచేయు ముష్కరులు
గాయపడ్డ గురిపెట్టుట సైనికునికి సౌర్యము ||
తలనిమిరే కన్నప్రేమ కావాలనిపించినా
అదుపుచేయ అవసరంగ సైనికునికి శక్యము ||
నాన్నంటే ప్రేమపంచు నిరూపించ ఆరాటం
దేశాన్నీ రక్షించగ సైనికునికి సంభవము ||
మమకారము ఒలకలేని పేదమనసు వారిదిలే
బలవంతపు కఠినత్వం సైనికునికి అవశ్యము ||
పగలైనా రేతిరైనా ఓకటేగా వారికీ
మేల్కొల్పుల జాగ్రత్తలు సైనికునికి అవసరము||
జైహిందని అంటూన్న సిసలు దేశభక్తుడవు
దేశభక్తి గౌరవించ సైనికునికి సలాము ||
.................వాణి కొరటమద్ది ,


గజల్ ............
నీ కోసం పిలిచి పిలిచి అలసి పోతాను ॥
నినుచేరగ వెతికి వెతికి సొలసి పోతాను ॥
వడలిపోయి పువ్వుగా రాలిపోయి ఆకులా
చేజారిన నీరూపులొ ఇమిడి పోతాను ॥
తన్మయమై తాకాలని ఎంతో తపనపడుతు
నీ స్పర్శను చేరి మట్టిలొ కలసి పోతాను ॥
నీ చూపులు కానరాక దాటి పోయాయి
ఆకురాలి చెట్టుగానె ఎండి పోతాను ॥
నిన్నుచేరె దారులన్ని మూసుకున్నాయి
నవ్వు ఎండి గుండెతడితో నలిగి పోతాను ॥
రెప్పమూయ లేనె లేను నీ దరి చేరగా
విప్పలేని 'వాణి'గానే మిగిలి పోతాను ॥
......... వాణి , 18 Aug 15


గజల్.............
కంటితడులే మౌనభాషగ మిగులుతూనే ఉన్నవీ ॥
నవ్వులన్నీ చూపుఎదురుగ చెదురుతూనే ఉన్నవీ ॥
కలతమనసున కలవరములే హృదినితడితొ నింపుతుంటే
మౌనగాయపు గురుతులన్నీ రేగుతూనే ఉన్నవీ ॥
అడుగుఅంటిన ఆశలేగా అందలేని నీదుస్పర్శలు
నిరాశలతో ఎదలోతులు నిండుతూనే ఉన్నవీ ॥
మరువలేనివి నాటినవ్వులు మరలమరలా మెదులుతూ
జ్ఞాపకాలే కంటితడులను ఒలుకుతూనే ఉన్నవీ ॥
చెదిరిపోయెను తీపిస్వప్నం వేదనేగా బతుకుసాంతం
మిగిలివున్నవి ఆనవాళ్ళే తడుముతూనే ఉన్నవీ ॥
మసకబారిన క్షణాలెన్నో మధుర'వాణీ' మనసుగదిలో
మనసునోచ్చిన ఘటనలన్ని రగులుతూనే ఉన్నవీ ॥
.....వాణి, 20 Aug 15
ఇది అశోక్ బోగ గారు గీసిన పిక్

Thursday, 13 August 2015

గజల్...........
తెరమాటున పలుకరించు మౌనమెంత బాగుంది ||
సైగలతో ననుతాకే చూపుఎంత బాగుంది ||
లేలేతపు వెలుగులలో సఖునికై ఎదురుచూపు
పలుకరింపు వేకువలో ఆశ ఎంత బాగుంది ||
కదలాడే పెదవులలో పలుకులేవొ తెలియదూ
వణుకుతున్న పెదవులలో కులుకుఎంత బాగుంది ||
నిన్నరేయి అలసటలే నీవదనం చెపుతోంది
కంటికింద నీడలలో అందమెంత బాగుంది ||
పైటచాటు నీమోమున పసిడికాంతి చూస్తున్నా
కనులతోన కనులుకలుపు కబురుఎంత బాగుంది ||
మూసివున్న రెప్పలలో కధలెన్నో దాచావు
నిశ్శబ్దపు నీమౌనం 'వాణి'ఎంత బాగుంది ||
............వాణి కొరటమద్ది , 3 August 15
గజల్ ......
మదినసలుపు గాయాలను మాన్పించుట సాధ్యమా ||
వేదనలో గుండెలయను ఓదార్చుట సాధ్యమా ||
సాధించని విజయమొకటి వెంటాడుతు ఉన్నది
తిరిగిరాని ఓటమినీ గెలిపించుట సాధ్యమా ||
ఆశలెన్నొ మనసుదోచి ఆహ్వానం పలుకుతాయి
తీరలేని కోరికలను అందించుట సాధ్యమా ||
సాహిత్యపు ప్రపంచమె సేదదీర్చు మనసులెన్నొ
నిత్యమైన అక్షరాన్నినిలిపుంచుట సాధ్యమా ||
కొదవలేదు కష్టాలకు నిత్యమౌతు నిజమేగా
నటియించే నవ్వులనే పూయించుట సాధ్యమా ||
మౌనమైన నీ'వాణీ' వింటూనే ఉన్నాను
కానరాని నీతనువును స్పర్శించుట సాధ్యమా ||
మరలరాని నీ రూపం మరుగైనవి చిరునవ్వులు
మనసంతా నిండివున్న రప్పించుట సాధ్యమా||
.......వాణి, 6 August 15


గజల్ ....
చిరు చీకటి మేఘాలలో నీ మెరుపులు చూశాను ||
నిశినిండిన మదిలోతున నీ వెలుగులు చూశాను ||
ముత్యాలే సంద్రంలో చినుకులుగా రాలిపడె
తీరంలో తారాడుతు నీ నవ్వులు చూశాను ||
నిన్నలన్ని అమాసలై నిన్నుతలచు కున్నాయి
నేడు ఇలా జాబిలిలో నీ కాంతులు చూశాను ||
గగనంలో నీ వదనం ప్రకాశించె జలనిధిలో
కడలితోన స్నేహంగా నీ పలుకులు చూశాను ||
మౌనంలో నీ'వాణీ' చూపులతో వింటునే
ప్రేమపంచు కనులలోన నీ మమతలు చూశాను ||
............వాణి , 10 August 15


గజల్ .......
కడలితోన ఊసులతో కలతలన్ని తుడిచాను ॥
మదిదాచిన మౌనంలో పలుకులన్ని విప్పాను ॥
గతమేదో గుర్తొస్తూ నిన్నుచూడ మనసాయెను
గుండెగదిలొ నిలిచివున్న గురుతులన్ని చెప్పాను ॥
సేదదీర్చె సంద్రమెంతొ నేస్తంగా పలుకరిస్తూ
మనసువిప్పి చెప్పగానే బాధలన్ని మరిచాను ॥
తీరాన్నీ తాకగానె గగనమంత ఉత్సాహం
కనులలోన ప్రవహించె చూపులన్ని చేర్చాను ॥
మధురవాణి హృదిలోన దాగుండిన స్పందనలు
ఉత్సాహం వెలికివచ్చి నవ్వులన్ని గెలిచాను ॥
....వాణి ,11 August 15
గజల్ ........... 

మదిదాచిన పలుకులన్నిమౌనానికి నివేదనం   ॥ 
మాటలన్ని నిశబ్దించి భావానికి నివేదనం  ॥ 

చిరునవ్వుతొ  వికసించీ విరబూసిన పువ్వులన్ని 
కోవెలలో వరములిచ్చు దైవానికి  నివేదనం  ॥ 

నిదురరాని రేయంతా మదినఎంత దిగులున్నా 
కొత్తఆశ  నింపుతున్న ఉదయానికి  నివేదనం  ॥ 

మరుగైనది గుండెదిగులు ప్రేమపంచు నేస్తంతో 
వెలికొచ్చిన నవ్వులన్ని స్నేహానికి నివేదనం  ॥ 

మమతపంచు అక్షరాలు పలుకుతున్న భావాలు 
నిర్మలమై మనసంతా కవనానికి  నివేదనం  ॥ 
గుండెనొదలి పోలేనీ మదినదాగి కలతలన్ని
మౌన 'వాణి'  బాధలన్ని కాలానికి నివేదనం ॥ 

పరిమళించు  సాహిత్యం సమకూర్చిన సంగీతం 
గళాలలో ప్రభవించి గానానికి నివేదనం 
.....వాణి