Monday, 14 December 2015

గజల్..................

కలతలే కంటిలో కురవడం హాయిలే ||
గుండెలో బాధనే తొలగడం హాయిలే ||

మాటనే మౌనమై పలుకుతూ మనసుతో
నన్ను నే చెలిమిగా తాకడం హాయిలే ||

నీ వంత దూరమై కలలనే ఓడుతూ
కొత్తగా కానుకై చేరడం హాయిలే ||

ఉదయాల ఆశేదొ తలుపునే తట్టగా
రేయిలో స్వప్నమే మెరవడం హాయిలే ||

నిన్నంతా వెన్నెలే నేటిలో నిశలులే
చూపులో వెలుగులే వెతకడం హాయిలే ||

మమతగా వాణినే నింపుతూ ఉండవా
నీ ప్రేమ గుండెల్లో నిండడం హాయిలే ||

........వాణి,14/15
నా ప్రేమ నీమదిలొ నిలిపి వచ్చేస్తాను ||
నీ గుండె దిగులంత చెరిపి వచ్చేస్తాను ||

నీ మనసు దారుల్లో నవ్వులని పరిచేసి
చూపులలొ ఆశలను గెలిచి వచ్చేస్తాను ||

ఏవేవొ కోరికలు ఊహల్లొ గిలిగింత
నేనంటె నువ్వనీ మురిసి వచ్చేస్తాను ||

అటుచూడ ఇటుచూడ ధ్యాసనే లేదాయె
చాటుగా గమనించి తడిమి వచ్చేస్తాను ||

మౌనమే అయ్యావు వాణినే మరిచావు
అరచి అరచి పిలిచేసి అలసి వచ్చేస్తాను ||

చెదరనివ్వక కలలు చూశాను వేచాను
నీ చెంత మనసంత వదిలి వచ్చేస్తాను ||

....వాణి, 10 dec 15
గజల్....................

జ్ఞాపకాల అనుభూతులు మౌనానికి తెలుసులే ||
నిదురలేని రాత్రులెన్నొ గాయానికి తెలుసులే ||

వికసించని వెతలెన్నో చీకటైన జీవతాల్లొ
వెలుగేమిటొ భంగపడ్డ బ్రతుకులకి తెలుసులే ||

తడిస్పర్శలు కరువౌతూ చిగురించని తరువులెన్నొ
ఎదురుచూపు ఆశలెన్నొ భూమాతకి తెలుసులే ||

కలతలన్ని మరవాలని కనులు మూసుకుంటాను
కలవరాల మదిలోతులు కన్నీటికి తెలుసులే ||

శ్రమఅంత దోపిడౌతు స్వార్ధమేలు రాజ్యంలొ
చెమటచుక్క విలువేమిటొ కష్టానికి తెలుసులే ||

తల్లిప్రేమ దూరమయ్యి భాసిల్లని పసితనం
మమతలవెల ఆశించే చిన్నారికి తెలుసులే ||

....................వాణి, 11dec15

Wednesday, 9 December 2015

గజల్ ...............

వెలుగువెతుకు నడకలలో నాకు తోడు వస్తావా ||
చీకటిలో చింతలలొ నాకు తోడు వస్తావా ||

కనురెప్పల నీలి నీడ దూరమాయె మెరుపుఛాయ
దారిచూపు వేలుపుగా నాకు తోడు వస్తావా ||

మాటకలుపు మనసులేక మౌనముగా మిగిలున్నా
అసహాయపు క్షణాలలో నాకు తోడు వస్తావా ||

గుండెల్లో భారమాయె మదినిండుగ వేదనాయే
చెదిరిపోని చేయూతగ నాకు తోడు వస్తావా ||

జ్ఞాపకాలు విదిల్చేటి కన్నీటి గాధలెన్నొ
తడవకుండ నీడౌతూ నాకు తోడు వస్తావా ||

చెమరింతే చిందుతోంది గమనాలే గరళమౌతు
రాళ్ళల్లో ఆధరువుగ నాకు తోడు వస్తావా ||

కమ్ముకున్న నిశలతెరలు మరుపుమెరుగు అద్డలేను
మినుగురువై బాటచూప నాకు తోడు వస్తావా ||

.................వాణి, 9 dec15
గజల్ .......

నింగిలో తారగా మిగిలి పోయాను ||
కలతనై కంటిలో నిలచి పోయాను ||

గాయమే గుండెనే తడుముతూ వున్నది ||
గేయమై పాటలో ఒదిగి పోయాను ||

కడలిలో బిందువై కలసి కదిలాను
వానలో చుక్కగా కురిసి పోయాను ||

కాటుకా కంటిలో అందమే చూపులొ
చింతతొ చెమరుతూ చెదిరి పోయాను ||

వికసించు పువ్వుతో గాలిలొ పరిమళం
సంధ్యలో వడలుతూ రాలి పోయాను ||

మౌనమే పెదవిలో మాటలే మరుగునై
విప్పలేని వాణిగా నిలచి పోయాను ||

......వాణి, 8 dec15
|| గజల్ ||

ప్రభాత వెలుగులో మంచునే కురిసిపో ||
పువ్వులో తియ్యగా మధువునే నింపిపో ||

రేయంత కలలలో సంబరం నింపుతూ
గుర్తుగా నవ్వుల స్వప్నమే ఇచ్చిపో ||

మౌనాల జ్ఞాపకం ఆశనే గెలిచినా
మాటలా పరవశం వాణినే చేర్చిపో ||

కంటిలో చెమ్మగా చూపులో వెతికినా
గుండెలో చెలిమిగా ప్రేమేనే ఒలికిపో ||

నింగిలో జాబిలీ నిత్యమై నిలిచినా
మనసులో జ్యోతివై వెలుగువై నిండిపో ||

కిరణమే రంగులా చినుకులే రాల్చగా
బతుకులో ఆశల శోభనే అద్దిపో ||

………వాణి ,7 .12. 15
|| గజల్ ||

చిన్నబోయిన చెలిమినవ్వులు చేరుకుంటే హాయికాదా ||
సర్దుమణుగుతు స్పర్ధలన్నీ పలుకుతుంటే హాయికాదా||

చెలియకన్నుల తళుకులన్నీ సంతసాలను నింపుతుంటే
నిత్యకాంతులు సఖియమోమున నిలచివుంటే హాయికాదా ||

కన్నుదోయిన కురుస్తున్నవి చెమరించిన నీళ్ళు ఎన్నో
గుండెభారము కంటితడిగా తొలగుతుంటే హాయి కాదా ||

ప్రగతి దిశలో మగువఎంతగ ప్రపంచాన్నే చుట్టుతున్నా 
తారతమ్యత లేనిజగతిలొ మసలుతుంటే హాయి కాదా ||

కరిగిపోయిన కలలుఎన్నో జ్ఞాపకాలుగ రొదలుపెడుతూ
వెన్నుతట్టేడి వేకువొక్కటి హత్తుకుంటే హాయికాదా ||

మౌనభావం మనసుగదిలో పెదవిదాటగ తపనపడుతూ
'వాణి'వాక్యం కవనభాషలో ఒలుకుతుంటే హాయికాదా ||

...........వాణి, 4 Dec 15
గజల్ ....

రెప్పవాలి బుగ్గలలొ నిలవలేని సిగ్గుకదా ||
చేయివదల వెందుకలా ఓపలేని సిగ్గుకదా ||

జాబిలిటుగ మరలివుంది చూపుమార్చు ప్రియతమా
చెంతచేర లాలనగా ఓపలేని సిగ్గుకదా ||

చూడు చూడు విరులన్నీ ముసి ముసిగా నవ్వుతుండె
కులుకుచూసి విరుపులేమో చేరలేని సిగ్గుకదా ||

నలుదిశలూ ఒక్కసారి పరికించవ నేస్తమా
గాజులసడి అలికిడివిని విడువలేని సిగ్గుకదా||

మేఘమేమొ పచ్చికపై మంచుపూలు పరచింది
చలచల్లని పుడమిపైన తాళలేని సిగ్గుకదా ||

మౌనమైన ప్రణయాలు ప్రకృతిదే సాక్ష్యమౌతు
తన్మయతలొ ప్రాణసఖుని తడమలేని సిగ్గుకదా ||

........వాణి ,1 dec 15
గుండెల్లో వేదనలను తుడిచివేయు నీగజల్ ||
కంటితడిని తన్మయముతొ చెరిపివేయు నీగజల్ ||

చిరునవ్వుగ చేరదీసి చైతన్యపు దారిచూపి
మదిలోతుల భావాలకు వెలుగునీయు నీగజల్ ||

నిశ్శబ్దంలొ ఒంటరిగా ప్రవహించే భావఝరులు
నిలిచిపోవు సంపదగా చేరదీయు నీగజల్ ||

కన్నీటీ చుక్కలేగ నా వాణీ పదములనిధి
వాక్యాలకు అందమిచ్చి ఊపిరీయు నీగజల్ ||

కమ్మనైన మాత్రుభాష అక్షరమే అమ్మగా
మనసుతడిని మధురముగా వెలికితీయు నీగజల్ ||

చింతలలొ చిరుదివ్వెగ చేయూతగ తోడునిలచి
గాయాలే గానమౌతు గెలుపునీయు నీగజల్ ||

.............వాణి , ౩౦ nov 15
!! గజల్ ...!!

మౌనంలో జ్ఞాపకాల గుర్తులొలుకుతున్నాయి
చూపులలో కంటితడుల చినుకులొలుకుతున్నాయి

తరతరాల ఆత్మీయత కధలుగానె మిగిలిపోయి
మదిలోతున ఆకాంక్షతొ తపనలొలుకుతున్నాయి

అతివృష్టి అనావృష్టి గతితప్పిన ఋతువుల్లో
భారమైన జీవితముల చింతలొలుకుతున్నాయి

మానవతే శాసించే ధనముతోనె నడుస్తూ
అడుగడుగున బడుగువెతల బాధలొలుకుతున్నాయి

వరదలలో వ్యధలెన్నొ ప్రకృతిపై నిందవేస్తు
చెరువులన్ని ఆక్రమణల ఋజువులొలుకుతున్నాయి

చదువుకునే తీరుమారె చదువుకొనే రోజులాయె
వీధిబడులు ఎదురుచూచు ఆశలొలుకుతున్నాయి

......వాణి కొరటమద్ది
!! గజల్ ...!!

తననవ్వు అందమే దోచేసి పోయింది ||
తనమెరుపు తళుకుల్లొ తడిపేసి పోయింది ||

మౌనాన్ని పలికిస్తు గిలిగింత పెడుతూ
నా మనసు చిత్రాన్ని గీసేసి పోయింది ||

ఎడారి నడకల్లొ భారమై దరిచేర
దారంత తనప్రేమ చల్లేసి పోయింది ||

అడుగడుగు ముళ్ళెన్నొ ఆటంక పెడుతుంటె
తివాచిగ తనఎదను పరిచేసి పోయింది ||

దూరంగ వుంటూనె రమ్మంటు సైగతో
ఓ గాలి తన’వాణి’ చేరేసి పోయింది ||

తనవైపు సాగాయి పాదాల పరుగులు
నా తలపు తనవలపు ముడివేసి పోయింది ||

.............వాణి, 26 nov 15
గజల్.......

ఓ కాంతి రేఖగా మెరవనీ నీ ఎదుట ||
ఓ వెలుగు పూవుగా మురవనీ నీ ఎదుట ||

నింగంత పరచున్న మేఘాల మాలగా
ఓ సలిల ధారగా కురవనీ నీ ఎదుట ||

నులివెచ్చ వేకువలొ నీ ప్రేమ పిలుపుతొ
ఓ నవ్వు తెమ్మెరగ మిగలనీ నీ ఎదుట ||

రేయంత మురిపించె స్వప్నాల సందడి
ఓ కలల రాణిగా వుండనీ నీ ఎదుట ||

వసంతం నింపిన చిగురాకు తరువుల్లొ
ఓ రాగ కోయిలగ పాడనీ నీ ఎదుట ||

మౌనంగ మెరిసేటి నీ వలపు తలపులో
ఓ మదుర ‘వాణి’గ పలుకనీ నీ ఎదుట ||

...............వాణి ,21 nov 15