Thursday, 28 May 2015

॥ రారమ్మని పిలుస్తోంది ॥ 


సిరిమల్లియ విచ్చుకునీ రారమ్మని పిలుస్తోంది  ॥
కురులలోన చేరుకునీ రారమ్మని పిలుస్తోంది॥ 

ప్రతీక్షించు.వియోగాలు చెలిమోమున కనిపిస్తూ 
ప్రణయమునే నింపుకునీ రారమ్మని పిలుస్తోంది  ॥ 

సహచరునీ  రాకకొరకు వికసించిన నేత్రాలే 
బిడియాలే దాచుకునీ రారమ్మని పిలుస్తోంది ॥  

కనులనిండ తనరూపము చెప్పలేని సంకోచం 
మరుమల్లెలు తురుముకునీ రారమ్మని పిలుస్తోంది  ॥ 

విప్పలేక పెదవులనే వెలిబుచ్చని 'వాణి'యలే 
నివేదించ భావాలని రారమ్మని పిలుస్తోంది  ॥ 

....వాణి 
॥ లోటులేదు॥


ఆశవిత్తులు మొలకలెత్తితె  ఆనందానికి లోటులేదు॥    
మొలకలన్నీ చిగురుతొడిగితె జీవితానికి లోటులేదు॥    

నేలమురిసెను చినుకుతడులతొ పల్లవించెను తరువులన్నీ 
పంటపొలాల పచ్చదనంతొ ధాన్యరాశికి లోటులేదు ॥   

ఆత్మశోధన అవసరములే ప్రతిమనిషికి సమాజములో 
పరిమళించని ప్రకృతి శక్తుల నిరాదరణకి లోటులేదు ॥   

దగ్గరితనం దూరమయ్యీ స్పర్శలవర్షం కావాలని 
మనసులోగిలి కోరుకుంటూ వియోగాలకి లోటులేదు ॥   

నిశలుతడుపుతు హృదయమంత భారమాయెను జీవితములో 
తట్టిలేపెడి జ్ఞాపకాలలో విషాదాలకి లోటులేదు॥    

ఎదురొచ్చేటి దారులన్నీ ఆశలతివాచీలు పరచీ 
మనసుఎంతో తుళ్ళిపడుతూ సంతసానికి లోటులేదు॥   

మధుర'వాణీ' అంతరంగం విహరించేను స్వప్నలోకం 
గెలుచుకుంటే కలలజగమే సంబరానికి లోటులేదు॥    

 ..... వాణి 

Monday, 25 May 2015

॥ అలజడి॥ గజల్

స్పర్సించే మనసులోన జ్ఞాపకాల అలజడిలే ॥
దాచలేక మనసులోన కలవరముల అలజడిలే॥

అంతరమున మానసాన్ని మెలిపెట్టే దు:ఖాలే
కడలిలాగ మనసులోన లోలోపల అలజడిలే ॥

పలుకులన్ని కరువౌతూ పెదవులనే కదపలేక
వెలిబుచ్చక మనసులోన పలవరముల అలజడిలే ॥

గెలవలేని సంగ్రామం మెలిపెట్టును గురుతులతో
ఆగాయం మనసులోన నిశబ్దాల అలజడిలే ॥

మధుర'వాణి' ఆశయాలే కుప్పకూలి పోయాయి
రేపెడుతూ మనసులోన చెమరింతల అలజడిలే॥

నీ భవితను దిద్దలేక వెలితిగానె మిగిలాను
ఈఅమ్మకి మనసులోన దు:ఖాల అలజడిలే॥

.....వాణి ,
॥ ఉందిలే ॥ 

కురిసేటీ  వెన్నెలలో తడవాలని ఉందిలే ॥ 
నీస్పర్శల గిలిగింతతో మురవాలని ఉందిలే ॥ 

చందమామ సాక్ష్యముగా చిరునగవులు చిందిస్తూ 
నీహృదయపు సామ్రాజ్యం ఏలాలని  ఉందిలే  ॥ 

కొలనులోన పరచుకున్న వెన్నెలంత అందంగా 
పరవసించు పుష్పమునై కులకాలని ఉందిలే ॥ 

పరిశోధన పరిశీలన జరిగిందీ ఎప్పుడో 
జాబిలిపై నీజతగా నడవాలని ఉందిలే॥ 

భూమితల్లి భారాలను మోయలేక పోతోంది 
నెలరాజుని చోటిమ్మని అడగాలని ఉందిలే॥ 

నడయాడుతు వెన్నెలలో మనసుకెంత హాయిలే 
ప్రతినిత్యం వెన్నెలసిరి కురవాలని ఉందిలే॥ 

మధుర'వాణి' చంద్రకాంతి చెప్పుకునే ఊసులెన్నొ
ఊహలలో కోరికలే తీరాలని ఉందిలే॥ 

....వాణి 

Thursday, 21 May 2015

॥ పోతున్నా ॥ గజల్ 

జ్ఞాపకాల గాయాలను చెరపలేక పోతున్నా ॥ 
దూరమైన నీజాడలు వెతకలేక పోతున్నా॥ 

రెప్పలపై తచ్చాడుతు నీ అలికిడి జ్ఞాపకాలు
తనువుకూడ గాయమౌతు కదలలేక పోతున్నా ॥

కనిపించే దూరములో రూపమేది కనపడినా
నీవేనని తలపించీ నిలువలేక పోతున్నా॥

చీకటులూ వెన్నెలలూ ఒకటిగానె కనిపిస్తూ
తడపడుతూ గమ్యాలనె చేరలేక పోతున్నా॥

చిగురించక ఆశలేవి చతికిలపడి పోయాను
మదిలోపలి అలజడులను గెలవలేక పోతున్నా॥

వెల్లువెత్తి చిరునవ్వులు ఒక్కసారె నిష్క్రమించె
విరిగిపోయి మనసునింక అతకలేక పోతున్నా ॥

కదలాడక కనిపించక చేజారే పోయావూ
కలువరించు నీరూపం తాకలేక పోతున్నా॥

నిదురలేని రాత్రులలో మౌనంతో పోరాటం
మనసుకైన గాయాలను మాన్పలేక పోతున్నా ॥

చెమరించే బిందువులను భావాలుగ మార్చుకుంటు
ప్రణయాలను కవిత్వముగ రాయలేక పోతున్నా ॥

మదిలోతున వినపడుతూ నీ మాటల తియ్యదనం
స్పర్శించే 'వాణి'యలుగ అందలేక పోతున్నా ॥

స్వప్నములే హిమముగా కరిగిపోతు వున్నాయి
ఆశించిన శిఖరాలను చేరలేక పోతున్నా ॥

......వాణి,22 may 15

Tuesday, 19 May 2015

॥ ఎన్నటికీ ॥ గజల్


తన్మయములొ నీ మెరుపులు మరువలేను ఎన్నటికీ ||
కులుకులలో హొయలన్నీ మరువలేను ఎన్నటికీ ||


మయూరoలా నీనర్తన సొగసులతో కలబోత
రమ్యమైన నీ అడుగులు మరువలేను ఎన్నటికీ||


ప్రత్యూషపు కిరణంలా కోమలమే నీ చూపులు
నీ నవ్వుల మౌక్తికాలు మరువలేను ఎన్నటికీ||


చిరుతెమ్మెర తాకిడికీ కదలాడే ముంగురులే
ననుతాకిన ఆస్పర్శలు మరువలేను ఎన్నటికీ||


నీ భావపు నవ్వులతో నర్తించే వెలుగుబొమ్మ
నడయాడే నాట్యాలను మరువలేను ఎన్నటికీ||


ఆనందపు వరమాలలే నీ పెదవుల విరినవ్వులు
మధుర'వాణి' భాషితములు మరువలేను ఎన్నటికీ||

..............వాణి,20 may 15

Thursday, 14 May 2015

॥ కన్నీరు ॥

గుండెలోని వేదనంత ఒలుకుతోంది అశ్రువుగ
హృదిలోపలి చెమరింతే తడుపుతోంది ఖేదనగ ॥

విప్పలేని పెదవులతో చెప్పలేని బాధలే
మౌనమొకటి మనసంతా తడుముతోంది రోదనగ ॥

నీశీధులు నిరాశలతొ కనిపించని వెలుగులులే
మది గాయం జ్ఞాపకమై త్రవ్వుతోంది కన్నీరుగ ॥

దూరమైన బంధమేదొ దరికిరాని ప్రేమలతో
ఊహలతో తలపులతో పలుకుతోంది లాలనగ॥

మధుర'వాణి' నిశబ్దమే రచియించే భావాలే
కన్నీటిని కవనాలుగ మార్చుతోంది ఓదార్పుగ॥

....వాణి ,
॥ ఎపుడో ॥ 

వేదన మనసుకు తిమిరపు జాడలు తొలగేదెపుడో ॥
దిగులే పోవుచు మిణుకుల జ్యోతులు చేరేదెపుడో ॥

నింగిలొ కనులకు విందును చేసే పున్నమివెన్నెల
చీకటి తొలగుతు మనసుకు వెలుగులు పంచేదెపుడో ॥

అందెలు పలికే రవళులు వీనుల విందే కాదా
నాదరి చేరుత శబ్దపు అడుగులు మురిసేదెపుడో ॥

విరిసే పెదవులు దరహాసంతో మౌనము మాయం
వీడిన బంధం 'వాణి'ని చేరుతు మాటలు పలికేదెపుడో ॥

గెలుపోటములకు అలలే చెప్పెడి పాఠం చూడు
విజయం వరమే అవుతూ ఆశలు తీరేదెపుడో ॥

కలలో ఇలలో కలతలు లేనీ జీవన యానం కావాలి
నిత్యం హసితం పంచుతు నవ్వులు కురిసేదెపుడో ॥

....వాణి , 15 May 15

Sunday, 10 May 2015

॥ ఎదురుచూపు॥ గజల్ 

మాపటేళ అవుతుంటే నీకొరకని ఎదురుచూపు ॥
దాచుంచిన ఊసులన్ని చెప్పాలని ఎదురుచూపు ॥

పదే పదే సవరింపులు చెదరకుండ అందాలను
కురులలోని విరులేవీ వాడిపోని ఎదురుచూపు ॥

తడి ఆరని పెదవులతో నీపేరే స్మరియిస్తూ
వెలికిరాక నిట్టూర్పులు దాచుకొని ఎదురుచూపు ॥

నును సిగ్గులు చిరునగవులు చెప్పలేని భావాలు
వలపునింపి ఫలాలనీ చేతబూని ఎదురుచూపు ॥

నిరీక్షించు కన్నులలో వెలిబుచ్చని 'వాణి'యలే
శీఘ్రముగా నీరాకలు కావాలని ఎదురుచూపు ॥

....వాణి ,11 May 15

Friday, 8 May 2015

॥ ఎవ్వరో॥ 


కాన్వాసుపై ఆ అందం దిద్దిందీ  ఎవ్వరో  ॥  
నా మదిలో సౌందర్యం మలచిందీ ఎవ్వరో  ॥  

నిన్నునేను పూర్తిగా గెలవలేక పోయాను 
నీవునాకు కాకుండా దోచిందీ  ఎవ్వరో  ॥  

నన్నునీలో నిలుపలేక  భ్రాంతితోనె  మిగిలాను
వేదనలో రోదనలో తోసిందీ ఎవ్వరో  ॥  

శ్వాశ్వితముగ  నీ హృదిలో నిలవాలని భావించా 
నా బాటకు అంతరాయం చేసిందీ  ఎవ్వరో  ॥  

ప్రియసఖియ మనోరధము నాదేనని తెలుసులే
నిర్బంధపు బంధనాన్ని గెలిచింది ఎవ్వరో ॥  


.....వాణి 
॥ ఉన్నవి ॥ 


(౩6)
ఎదురు చూపులు నవ్వు కోసం వెదుకుతూనే ఉన్నవి 
గాయ మనసులు మౌన గీతం పాడుతూనే  ఉన్నవి

మదిసముద్రం దాచుకున్నప్రకటించని భావాలె   
నిత్యజీవన స్రవంతిలోన తగులుతూనే ఉన్నవి 

ప్రకాసించు నీ కనులలో నాచూపుకు ఆశలె  
గుండెలోతున కోరికలేవొ  రేగుతూనె ఉన్నవి

మౌనించిన మనసులలో మాటలన్ని మూటలె 
వెలుగుపంచు కవనాలుగ మారుతూనే ఉన్నవి

నింగికురిసి జలధభాష్పం పులకరించి మట్టికణం
హరితవర్ణపు తరువులన్నీ కులుకుతూనె  ఉన్నవి  

మమకారము మధుర'వాణి' ఒంపావుగ హృదిలొ
చైతన్యపు ఆకాంక్షలె  పొంగుతూనే ఉన్నవి 

......... వాణి కొరటమద్ది 

Wednesday, 6 May 2015

॥ చేశాను॥

పొత్తిళ్ళలొ ఎత్తులన్ని నేర్వడమే చేశాను॥
నావేలును నీపిడికిట పట్టడమే చేశాను॥

నీ బుడి బుడి అడుగులలో గెలుపులెంత సంబరమో
నీ నడకల విజయాలకు సన్నాహమే చేశాను॥

రోజు రోజు నీ మార్పుకు చెప్పలేని సంతోషం
నీ భవితకు నాబాధ్యత యోచనమే చేశాను॥

నీనాన్నగ నన్నేంతో గర్వముతో చూడాలని
ఆదిశగా నావంతుగ ప్రయత్నమే చేశాను॥

బంగారపు బాటలలో నీనడకలు వెలగాలని
రాళ్ళబాట ఎదురైనా సాహసమే చేశాను॥

గెలుపు'వాణి' నేస్తాలకు వినిపించాలనుకుంటూ
అడుగడుగున శ్రమపడుతూ ఫలితమే చూశాను॥

......వాణి ,7 May 15
|| వెళ్ళావు || గజల్

నీ ప్రతిభకు గుర్తింపని రెక్కలొచ్చి వెళ్ళావు ||
నా మనసుకు ఎడబాటును కానుకిచ్చి వెళ్ళావు||

విదేశీయ చదువులంటు ప్రగల్బాలు పలికావు
నమ్ముకున్న ఇల్లుకాస్త విక్రయించి వెళ్ళావు ||

కంటనీరు చాచుకుంటు భారంగా బ్రతకమని
నామాటను కాదంటూ బాదించి వెళ్ళావు||

అందరికీ అందలేని అదృష్టమె నాదంటూ
నాదారిన నన్నొదిలి నిరసించి వెళ్ళావు ||

అర్ధరాత్రి హాయ్ అంటూ అంతర్జాల పలకరింపు
ఒక్కక్షణం నీ చిత్రం చూపించి వెళ్ళావు||

ఈతండ్రికి చివరాఖరి వీడ్కోలే అడిగితే
అందరికది సహజమని వివరించి వెళ్ళావు||

.........వాణి, 5 may 15