Monday, 25 May 2015

॥ ఉందిలే ॥ 

కురిసేటీ  వెన్నెలలో తడవాలని ఉందిలే ॥ 
నీస్పర్శల గిలిగింతతో మురవాలని ఉందిలే ॥ 

చందమామ సాక్ష్యముగా చిరునగవులు చిందిస్తూ 
నీహృదయపు సామ్రాజ్యం ఏలాలని  ఉందిలే  ॥ 

కొలనులోన పరచుకున్న వెన్నెలంత అందంగా 
పరవసించు పుష్పమునై కులకాలని ఉందిలే ॥ 

పరిశోధన పరిశీలన జరిగిందీ ఎప్పుడో 
జాబిలిపై నీజతగా నడవాలని ఉందిలే॥ 

భూమితల్లి భారాలను మోయలేక పోతోంది 
నెలరాజుని చోటిమ్మని అడగాలని ఉందిలే॥ 

నడయాడుతు వెన్నెలలో మనసుకెంత హాయిలే 
ప్రతినిత్యం వెన్నెలసిరి కురవాలని ఉందిలే॥ 

మధుర'వాణి' చంద్రకాంతి చెప్పుకునే ఊసులెన్నొ
ఊహలలో కోరికలే తీరాలని ఉందిలే॥ 

....వాణి 

No comments:

Post a Comment