Tuesday, 2 February 2016

గజల్...................
కనులెదురుగ నువ్వుంటే మౌననిధులు నాకెందుకు ||
స్మరదీపిక నీదయితే జ్ఞాపకాలు నాకెందుకు ||
మునుపటివే అనుభవాలు నీడలుగా మెదిలాయీ
కాలమంత చిరునవ్వైతె మనసుతడులు నాకెందుకు ||
విషాదాల నెలవులోన కాంతిలేక నడుస్తున్నా
నిశలబాట నిషిద్దమే అమావసలు నాకెందుకు ||
చూపులోన కన్నీళ్ళే దాటివెళ్ళ కున్నాయీ
నిశబ్దంలొ నిలచుంటే మౌనసడులు నాకెందుకు ||
అనునిత్యం అమ్మప్రేమ గెలుపువెలుగె నడిచొస్తుంది
బతుకంతా వాచ్చల్యం గుప్తనిధులు నాకెందుకు ||
మౌనవాణి వాక్కులన్ని అక్షరమై మాటాడెను
ఆంతర్యం తెలిసుంటే పలుకుసిరులు నాకెందుకు ||
మమతపూల వనంలోన విహరించాలనివున్నది
బంధాలు ఆనందాలె విరోధాలు నాకెందుకు ||
...............వాణి, 7 jan 16
గజల్ ...............
మనసునెపుడూ గాయమేదో పలుకరిస్తుంది ||
చూపుతాకని దృశ్యమేదో గుర్తుకొస్తుంది ||
ఆశలెన్నో చెదిరినా నడక ఆగలేదు
కొత్త వేకువ వెలుగుఏదో తీసుకొస్తుంది ||
చిలిపినవ్వులు జ్ఞాపకాలతొ సర్దుకుంటు
నిజములోనే నవ్వుఏదో చేరవస్తుంది ||
తీరానికెపుడూ అలల దెబ్బల తాకిడే
ప్రోత్సహించే పాఠమేదో ధైర్యమిస్తుంది ||
గెలవలేని గురుతులేగా వేదనౌతాయీ
తరలిపోయిన నడకఏదో నడచివస్తుంది ||
మౌన'వాణీ' మనసునంతా నిశబ్దమౌతు
గుండెతడితో భావమేదో వెలికివస్తుంది ||
....వాణి ,13 jan 16
గజల్.........
జ్ఞాపకంలొ పదిలమైన ఘటనలెపుడు మరువలేను ||
కరుగుతున్న కాలంలో కాంతులెపుడు మరువలేను ||
చిరునవ్వులు సిరులేగా వ్యధనిండిన కధలలోన
ఆదుకున్న ఆత్మీయుల సాయమెపుడు మరువలేను ||
ప్రతిజీవికి తప్పదులే చివరాఖరి ప్రయాణాలు
మానవతను నిలబెట్టిన మనిషినెపుడు మరువలేను ||
మగువగెలుచు అమ్మతనం మధురమైన ఆనందం
పరిపూర్ణత సాధించిన గెలుపునెపుడు మరువలేను ||
గాయపడ్డ జీవితాలు మౌనచింత మోస్తున్నవి
మౌనవాణి గుండెమోయు ఓటమెపుడు మరువలేను ||
తల్లిపమిట కొంగుతోన ఆడుకున్న బూచాటలు
అమ్మఒడిలొకమ్మదనపు స్పర్శనెపుడు మరువలేను ||
..........వాణి, 20 jan 16
గజల్............
పెల్లుబికే దు:ఖాలను ఆపలేరు ఎవరైనా
కన్నీటికి చిరునవ్వును అద్దలేరు ఎవరైనా ||
చీకటింటి మౌనభాష తలగడనే వింటున్నది
అంతులేని ఆత్మబాధ మోయలేరు ఎవరైనా ||
చెక్కుకుంటు నవ్వులనే స్వచ్చతనే గెలవలేక
జ్ఞాపకాల ఆనవాళ్ళు చెరపలేరు ఎవరైనా ||
గాయాలే అనుభవమై కన్నీటితొ పోరాటం
సానుభూతి చూపులనే ఓపలేరు ఎవరైనా ||
వేదనలూ వెన్నెలలూ పూర్తవునా బతుకుబాట
కంటిపాప తడవకుండా దాటలేరు ఎవరైనా ||
నిదురలోన ఒలుకుతాయి ఎన్నెన్నో స్వప్నాలూ
నిజములోన కలలన్నీగెలవలేరు ఎవరైనా ||
చివరాఖరి గమ్యమేమో మట్టిఅనీ తెలిసినా
ధనముపైన వ్యామోహం వీడలేరు ఎవరైనా ||
...........వాణి, 22 jan 16
గజల్......
నింగిలోన నీకోసం వెన్నెలనై వేచాను ||
నాజాడలు తెలపాలని వెలుతురునై ఒలికాను ||
మబ్బులలో దాగుంటూ మౌన గీతం పాడుతూ
చిరునవ్వుగ చిరుజల్లుల వర్షమునై తడిమాను||
పరిమళాల ప్రకృతిలో వసంతాల ఆకృతిగ
ఓ నవ్వుల సవ్వడిగా సమీరమై వీచాను ||
మధురూహల మౌనంతో దోబూచులు ఆడుతూ
నీ కన్నుల కాంక్షలలొ కాంతినై వెలిగాను ||
నీ తలపుల విరహాలకు ఆలంబన అవుతూ
నీ మనసున మరందాల కుసుమమునై విరిశాను ||
మౌనవాణి అనురాగం ఒలుకుతోంది ఓరాగం
మధురూహల కెరంటంలా కావ్యమునై పలికాను ||
...........వాణి, 26 jan 16
గజల్.................
కడలితోన ఊసులెన్నొ కలతలన్ని తుడుచుకుంటు ॥
మదిదాచిన మౌనంతో మాటలన్ని చెప్పుకుంటు ॥
గతమేదో గుర్తొస్తూ నిన్నుచూడ మనసాయెను
గుండెగదిన గుమిగూడిన గురుతులన్ని విప్పుకుంటు ॥
సేదదీర్చె సంద్రమెంతొ నేస్తంగా పలుకరిస్తూ
మనసువిప్పి చెప్పగానె బాధలన్ని దించుకుంటు ॥
తీరాన్నీ తాకగానె గగనమంత ఉత్సాహం
కనులలోన ప్రవహించె చూపులన్ని హత్తుకుంటు ॥
మౌనవాణి హృదిలోన దాగుండిన భారాలే
భావములై వెలికివచ్చు పదములన్ని కూర్చుకుంటు ॥
కన్నీటిని కలుపుకొని అలలతోన ఓదార్చెను
ఆవేదన ఆలాపన రాగాలన్ని అల్లుకుంటు ||
..............వాణి, 26 jan 16
గజల్........
నీరదములొ తేజమునే వెలిగించే తీరాలి ||
ఓ కాంతి కిరణంలా ప్రవహించే తీరాలి ||
విషాదాల నీలి నీడ చీకటిలో కలిపేస్తూ
వెలివేసిన నవ్వులన్ని వికసించే తీరాలి ||
నిట్టూర్పుల సడులెన్నో వెంటాడుతు ఉన్నకాని
ఆశపడ్డ ఆశయాలు గెలిపించే తీరాలి ||
అసహాయత ఆవేదన నిండిపోయి జీవితాల్లొ
ఉత్సాహపు ఉషోదయం జ్వలియించె తీరాలి ||
చివరాఖరి మజిలీల వార్ధక్యపు నిరాసక్తి
నిర్వేదం బతుకుల్లో తొలగించే తీరాలి ||
మౌనవాణి మనసులోన సడిచేయని ఆనందం
కన్నీటితొ వేదననే ఒలికించే తీరాలి ||
..........వాణి, 27 jan 16
గజల్.....
ఎడారిలొ గులాబిలు పూయడం కష్టమే ||
చింతలో చిరునవ్వు ఒలకడం కష్టమే ||
చీకటుల వెన్నెలల సంగమం జీవితం
సంసార సాగరం ఈదడం కష్టమే ||
గతమైన గాయాలు మచ్చలుగ మిగులుంటె
నొప్పితో గురుతుల్ని మరువడం కష్టమే ||
ఎండతో తేమతో చెలిమేలె మొలకలకు
తడిలేక విత్తులే మొలవడం కష్టమే ||
వేదనతొ పెదవిపై నిట్టూర్పు శబ్దాలు
వదనంలొ హాసాలు విరియడం కష్టమే ||
నిర్జలం నేలంత ఎడారిగ మారితే
మబ్బులే చినుకుల్ని రాల్చడం కష్టమే ||
రోజుల్లో భారాన్ని సహించె శక్తిలేదు
కన్నీళ్ళ కాలాన్ని దాటడం కష్టమే ||
మనసులో యుద్ధమే కలవరాల మౌనంలో
మౌనవాణి మాటల్ని వెతకడం కష్టమే ||
క్షణాలే పరీక్షగ గడచిపోతు ఉన్నాయి
నిత్యమై ఇడుముల్ని వేగడం కష్టమే ||
కనురెప్పలు నిదురనె వెలివేస్తు ఉన్నాయి
కనుపాపకు దప్పికే తీరడం కష్టమే
.....వాణి, 28 jan16
గజల్ కాన్వాస్ ......
నా గుండె వేదనగ తలవంచు కుంటోంది ||
నీ ఒడిలొ దు:ఖాన్ని సవరించు కుంటోంది ||
గడిచింది కాలమే వెలలేని గుర్తుగా
బాదించు స్మృతులను తొలగించు కుంటోంది ||
నే కన్న కలలన్ని కన్నీట మునిగాయి
కలహాల కధనాలు యోచించు కుంటోంది ||
చిరకాల విరహాన్ని చీకటిలొ మోశాను
నీ జతలొ భారాన్ని మది దించు కుంటోంది ||
నీ చేతి లాలింపు చిరునవ్వు గెలిచింది
గాయాలు నీ స్పర్శ అలరించు కుంటోంది ||
నీ శ్వాస శబ్ధాలు భారంగ వినిపిస్తు
నీ చూపు ననుతాకి చెమరించు కుంటోంది ||
మన్నింపు మౌనంలొ నే గెలుచు కున్నాను
నీ మనసు నా వాణి వినిపించు కుంటోంది ||
.......వాణి ,1 Feb 16