Friday, 31 July 2015



గజల్ .....
శంఖములే తేలియాడె నిన్నుచూసి పరవసించి ॥
అలలహోరు ఆగిపోయె తరచి చూసి విస్మరించి ॥
ఏలోకం ఈకన్యది సముద్రుడే కుసలమడిగె
తననితానె పానుపుగా మార్పుచేసి స్వాగతించి ॥
పువ్వులన్ని ఎచ్చోటివొ నీహృదిపై చేరుకుంటు
పరిమళమే మరచిపోయె సొగసుచూసి మైమరచి ॥
కలలలోన చిరునవ్వులు ప్రవహించె రాగాలు
సాగరుడే విస్మయమై నవ్వుచూసి నిశబ్దించి ॥
నత్తకూడ నడకనాపె తన అందం పలకరింప
తన్మయమై స్పర్సలేక రెప్పమూసి దు:ఖించి ॥
కనులుతెరచి చూడాలని వేచివున్న పరిసరాలు
తన'వాణి'ని వినాలనీ వేచి చూసి తొందరించి ॥
......వాణి,21 july 15
|| గజల్ ||
తరతరాల తలరాతను తుడిచేస్తూ సాగిపో
అబల అనే నీ ముద్రను చెరిపేస్తూ సాగిపో
అహంకార హుకూంలకు తలవంచకు ఇకమీదట
సర్ధుబాట్లు ఓటములను అణిచేస్తూ సాగిపో
సుకుమారం సహనత్వం నీదేనని ఒప్పించిన
నీధైర్యం సడలనీక గెలిపిస్తూ సాగిపో
అమ్మతనం ఆడతనం నీదేగా గొప్పతనం
అవరోధా లెన్నైనా తొలగిస్తూ సాగిపో
రోదసిలో నీఆడుగులు సైన్యంలో నీకదలిక
నీధీరత గుర్తులన్ని చూపిస్తూ సాగిపో
కొత్తేమీ కాదు కదా చరిత్రలో మగువ ఘనత
నీ'వాణీ' యువజగతికి వినిపిస్తూ సాగిపో
పులిపైననె నీస్వారీ నీధైర్యం గెలవాలి
నీచూపుతొ ప్రపంచాన్ని పలికిస్తూ సాగిపో
.......వాణి, 


|| గజల్ ||

ఎంత మౌనం ఒలికితే ఒక భావమౌతుందీ ||
మదిని ఎంతగ చిలికితే ఒక గేయమౌతుందీ ||
దాగివుండె గుండె నిండా చెరిగిపోని వేదనె
ఎన్ని గురుతులు చేర్చితే కత కధనమౌతుందీ ||
కనులు మూయలేదు కాని రెప్పలపై అలికిడౌతు
కన్నీరెంత కార్చితే ఎద గాయమౌతుందీ ||
వెనుదిరిగి తరచి చూస్తే ముళ్ళకంపల ఛాయలె
ఎన్ని స్మృతులు పేర్చితే మది కావ్యమౌతుందీ ||
గతపుస్తకం తెరిచి చూస్తే కన్నీటి కధలుఎన్నొ
ఎన్ని బాధలు కూర్చితే అది గ్రంధమౌతుంది ||
బతుకు అంతా ప్రశాంత చిత్తము ఆవరిస్తే
కనులు కూడా ఓడితే కల సాధ్యమౌతుందీ ||
మధుర'వాణీ' అంతరంగము మౌనమనసై పలుకుతూ
దిగులు గుండెను గుచ్చితే కద కవనమౌతుందీ||
........వాణి, 29 july 1
పుడమి పచ్చటి తరువుహారం నింపుకుంటే ఎంత హాయి 
చెట్లప్రగతికి మనుష్యులంతా పూనుకుంటే ఎంత హాయి 

మౌనఘోషే మట్టికణంకి  మధురవాసన మూసిపెడుతూ 
తడిసిమురిసే వానచినుకును గెలుచుకుంటే ఎంత హాయి 

పరిమితిదాటి ఎండవానలు మనుగడకూడ పెనుభారమె 
సహజవనరులే ధ్వంశమవక నిలుపుకుంటే ఎంత హాయి 

అవనితల్లిని ఆవహించెను ప్లాష్టికనే పెనుభూతము 
మట్టిపాత్రకు ప్రాధాన్యమిస్తూ వాడుకుంటే ఎంత హాయి  

వాహనాలే పెరిగిపోయెను కలుషితమై గాలిసైతం 
ఒకరికొకరుగ సహకరిస్తూసాగుతుంటే ఎంత హాయి 

........వాణి

Tuesday, 21 July 2015

గజల్ ........ 

తూర్పులోన మందారం పూసినట్లు ఉందిలే ॥ 
రవితేజం ఆకశాన మెరిసినట్లు  ఉందిలే ॥ 

సుప్రభాత సుమాలన్ని వికసిస్తూ చిరునవ్వుతో 
మనసంతా ఉల్లాసం పంచినట్లు  ఉందిలే ॥ 

తారాడుతు భ్రమరాలే విరితేనెకు వెదుకుతూ 
పువ్వులపై వాలగానె మురిసినట్లు  ఉందిలే ॥ 

జ్ఞాపకాల వనములోన విహరించెను మనసేమో 
గురుతులన్నీ గేయాలుగా మారినట్లు  ఉందిలే ॥ 

మధుర'వాణి' మౌనపలుకు కవనంలో పంచుతోంది 
అనుభవమే భావంగా ఒలికినట్లు ఉందిలే ॥ 


....వాణీ 
గజల్.........

తేలియాడె శంఖములే నిన్నుచూసి పరవసించి  ॥ 
అలలహోరు ఆగిపోయె తరచి చూసి విస్మరించి  ॥ 

ఏలోకం ఈకన్యది సముద్రుడే కుసలమడిగె 
తననితానె పానుపుగా మార్పుచేసి స్వాగతించి  ॥ 

పువ్వులన్ని ఎచ్చోటివొ  నీహృదిపై చేరుకుంటు 
పరిమళమే మరచిపోయె సొగసుచూసి మైమరచి ॥ 

కలలలోన చిరునవ్వులు ప్రవహించె రాగాలు 
సాగరుడే విస్మయమై నవ్వుచూసి నిశబ్దించి ॥ 

నత్తకూడ నడకనాపె తన అందం పలకరింప 
తన్మయమై స్పర్సలేక రెప్పమూసి దు:ఖించి ॥ 

కనులుతెరచి చూడాలని వేచివున్న పరిసరాలు 
తన'వాణి'ని  వినాలనీ వేచి చూసి తొందరించి ॥ 
 
......వాణి 

Thursday, 16 July 2015

గజల్ .... 


నింగిలోన చంచలమై మెరిసి వెళ్ళి పోతావు ॥ 
జ్ఞాపకాల బాసలన్నీ కురిసి వెళ్ళి పోతావు  ॥ 

నన్నువదలి వెళ్ళావుగ మోడుగానె మిగిలాను 
నా ప్రేమల ధ్యాసలలో తడిసి వెళ్ళి పోతావు ॥ 

ఏలోకం నీదైనా నాలోకం నీ దేనని 
ఊహలలో తొంగిచూసి మురిసి వెళ్ళిపోతావు  ॥ 

కంటి ముందు నీరూపం కదిలినట్లు ఉంటుంది 
తాకాలని  తడమగానె ఎగసి వెళ్ళిపోతావు ॥ 

పలుకరించు  పరిసరాల సడులేమీ వినపడవు 
ఎదలోతును తట్టిలేపి కలిసి వెళ్ళిపోతావు  ॥ 

జాబిలిలో చుక్కలలో నీ రూపం కనిపిస్తే 
కనులార్పక చూస్తుంటే మెరిసి వెళ్ళిపోతావు  ॥ 

మధురమైన నీ 'వాణీ'  ఎదలోతున వినపడుతూ 
గుండె గుచ్చు గాయంగా తడిసి వెళ్ళిపోతావు ॥ 


........... వాణి 
గుండెకైన గాయాలను  తొలగించుట తెలియదులే  ॥ 
మాటాడే స్వరాలకు మౌనించుట తెలియదులే ॥ 

మదినిండిన  వేదనంత ఒలుకుతుంది భావనగా 
బాధనిండి పెదవులతో పలికించుట తెలియదులే  ॥ 

నిదురించక కనులముందు కదలాడే నీరూపం  
రెప్పమూసి గుండెదిగులు మరిపించుట తెలియదులే ॥ 

పెదవివిప్పి  చెప్పాలని మనసుకెంతొ ఉబలాటం 
గద్గదమై గొంతుదాటి  ఒలికించుట తెలియదులే ॥ 

చిందించిన చిరునవ్వులు వెంటాడే జ్ఞాపకాలు 
చివురించని ఆనవ్వులు తెప్పించుట తెలియదులే ॥ 

మరువలేని ఓటములే అనుక్షణం గుర్తొస్తూ 
తిరిగిరాని విజయాన్ని గెలిపించుట తెలియదులే ॥ 

ఏదేదో ఆలోచన మధుర'వాణి' మదిదిగులుతో 
గుండెల్లో గుర్తులన్ని సడలించుట తెలియదులే  ॥ 

.......వాణి  

Wednesday, 8 July 2015

॥ జీవితం ॥ 


తప్పుఒప్పుల సవరణలతో సాగిపోవుటె జీవితం ॥ 
ఎదురుదెబ్బలు అనుభవాలుగ మార్చుకొనుటె జీవితం ॥ 

గతంనిలిపిన గాయాలన్ని చెరపలేనీ గురుతులే 
మనసునేదో వ్యాపకంతో సర్ధిచెప్పుటె జీవితం ॥ 

మారుతున్నది మనుషులేగా మంచితనమే మరచిపోతూ  
తమనితామే మలచుకుంటూ మేలుకొనుటే జీవితం॥ 

కుటుంబాలలొ కలతలెన్నో డబ్బుమయమై మనసులన్ని 
కల్మషాలే లేకుండగా ప్రేమపంచుటె జీవితం॥ 

ఈర్షలు ద్వేషాలు  పెరుగుతు స్నేహ హస్తం మాయమై 
మనిషితనమే నిలుపుకుందుకు సహకరించుటె జీవితం॥ 

కష్టాలలో ఎదుటివారికి చెలిమిహస్తము ఇవ్వవోయీ 
మానవత్వం సాటివారిపై చూపగలుగుటె  జీవితం॥ 

మధుర'వాణి'  అంతరంగం కరిగిపోనీ  కంటకాలే 
కలతమనసును గట్టిపరచుట నేర్చుకొనుటే  జీవితం॥ 

.....వాణి 
॥ గజల్॥
నిశబ్దమై పోతున్నా నీవులేని లోకంలో ॥
చేష్టలుడిగి మిగులున్నా నీవులేని గమనంలో ॥

నిరాశలతో మనసంతా అడవిలాగ మారుతోంది
ఆశలెన్నో చూస్తున్నా నీవులేని ప్రశ్నలలో ॥

గాయాలని చెరపలేక గమనాన్ని ఆపలేక
దిక్కులన్ని వెతుకుతున్నా నీవులేని యామినిలో॥

కనురెప్పల అలికిడిలో నీస్మరణే వినిపిస్తూ
వెతకలేక పోతున్నా నీవులేని చూపులలో ॥

నిట్టూర్పుల తడులలోన స్పర్శించే నీపేరే
తాకలేక తడుముతున్నా నీవులేని జాడలలో ॥

మధుర'వాణి' అక్షరంలొ ప్రతిపదము నీదేలే
భావాలనె ఒలుకుతున్నా నీవులేని ధ్యాసలలో॥

... ...వాణి
॥ పోతున్నా ॥ గజల్ 

జ్ఞాపకాల గాయాలను చెరపలేక పోతున్నా ॥ 
చిట్టితండ్రి నీజాడలు వెతకలేక పోతున్నా॥ 

రెప్పలపై తచ్చాడుతు  నీ అలికిడి జ్ఞాపకాలు 
తనువుకూడ గాయమౌతు కదలలేక పోతున్నా ॥ 

కనిపించే దూరములో రూపమేది కనపడినా 
నీవేనని తలపించీ నిలువలేక పోతున్నా॥  

చీకటులూ వెన్నెలలూ ఒకటిగానె కనిపిస్తూ 
తడపడుతూ గమ్యాలనె  చేరలేక పోతున్నా॥ 

చిగురించక ఆశలేవి చతికిలపడి పోయాను 
మదిలోపలి అలజడులను గెలవలేక పోతున్నా॥   

వెల్లువెత్తి  చిరునవ్వులు ఒక్కసారె  నిష్క్రమించె 
విరిగిపోయి మనసునింక  అతకలేక పోతున్నా ॥ 

కదలాడక కనిపించక చేజారే పోయావూ 
కలువరించు నీరూపం తాకలేక పోతున్నా॥  

నిదురలేని రాత్రులలో మౌనంతో పోరాటం 
మనసుకైన గాయాలను మాన్పలేక పోతున్నా 


చెమరించే బిందువులను భావాలుగ మార్చుకుంటు 
అమ్మఇచ్చు  ఈకానుక చేర్చలేక   పోతున్నా ॥ 


దిక్కులన్ని వెతికినాను దక్కలేదు ఆనవాలు 
పెల్లుబికే దు:ఖాన్ని ఆపలేక పోతున్నా ॥ 


అదిగదిగో అకడంటూ ఇదిగో ఇటువైపంటూ 
మనసులోన ఆరాటం నిలువలేక పోతున్నా ॥ 


గాలించని చోటేదీ లేనేలేదని తెలుసూ 
మదిలోతును తడమకుండ  ఉండలేక పోతున్నా ॥ 


గాయాలను స్పర్శిస్తూ గమనాలే ప్రశ్నిస్తూ 
తడబాటుల అడుగులతో నడవలేక పోతున్నా ॥ 


పాదాలే భారంగా పలుకులేని మౌనంగా 
సానుభూతి చూపునసలు గెలవలేక పోతున్నా ॥ 


నిదురలేని రాత్రులలొ మౌనముతో పోరాటం 
మనసుకైన గాయాలను మాన్పలేక  పోతున్నా ॥ 


కోరికలే తీరాలని ఆరాటం లేదసలే 
బాధ్యతలను బంధాలను వీడలేక పోతున్నా ॥ 


చెమరించే బిందువులను భావాలుగ పలికిస్తూ 
ప్రణయమునె కవిత్వంగ రాయలేక పోతున్నా ॥ 

మదిలోతున వినపడుతూ బోసినవ్వు  తియ్యదనం 
స్పర్శించే 'వాణి'యలుగ అందలేక పోతున్నా ॥ 

స్వప్నములే హిమముగా కరిగిపోతు వున్నాయి 
ఆశించిన శిఖరాలను చేరలేక  పోతున్నా 

ఒడిఏలిన నీరాజ్యం ఖాళీగా మిగిలింది 
రాలేవని నీరాకను తలవలేక పోతున్నా  

......వాణి 

Tuesday, 7 July 2015

 ॥ గజల్ ॥ 

నీవులేక గగనంలొ ఒంటరిగా వెతికాను ॥ 
నీజాడకు తారాడుతూ మౌనంగా వెతికాను ॥ 

మనసంతా శూన్యంగా అంబరాన్ని గాలిస్తూ 
కలతచెంది  కన్నీటితొ  గాయంగా వెతికాను ॥ 

ఏడేడూ లోకాలలొ నీ ఉనికే తెలియకుంది 
తనువంతా కనులు చేసి కలవరంగ వెతికాను ॥ 

అందమంత నీదేగా అలంకరణ  నీకేగా 
అలసిసొలసి సొమ్మసిల్లి భారంగా వెతికాను॥  

మనసులోన నీరూపం నింగిలోన నిశబ్దాలు 
మబ్బులనూ తొలగిస్తూ వేదనగా  వెతికాను ॥ 

గుండెఎంతొ బరువౌతూ నీవులేని వెలితౌతూ 
ఆదేవుని ప్రార్ధిస్తూ గానంగా వెతికాను ॥ 

చీకటినీ చూపిస్తూ మబ్బులన్ని కమ్ముకుంటు 
మనసంతా ముంచుతున్న దు:ఖంగా వెతికాను ॥ 

మధురవాణి మౌనప్రేమ నీదేనని చెప్పాలని 
మనసులోన మమతనింపి కోరికగా వెతికాను ॥ 

  ....వాణి 
గజల్ కాన్వాస్ ............
నీరాకల ఎదురుచూపు నాకనులలో ఆశలెన్నొ||
నీ రాతలు ప్రకటించిన భావాలలో ఊహలెన్నొ||
తన్మయమున మనసంతా సంబరమై ఎగసింది
నీ అక్షర పూలు రాలి నామదిలో కలలెన్నో||
నీ రాకకు వేచి వేచి కోరికెంతొ చెప్పలేను
నీ పదాలు అనుభవించి పరవశంలొ వలపులెన్నొ||
నాముసిముసి నవ్వులలొ కనిపించే నీ రూపం
మదిలోతున వెలిబుచ్చని ఊహలలో హొయలెన్నొ||
భావాలలొ సౌందర్యం వర్ణనెంత బాగుందో
నీమనసే ఒలికించిన లేఖలలొ ఊసులెన్నొ ||
మధుర'వాణి' నిదురమరచి నీధ్యాసలే క్షణక్షణం
ఉలికిపాటు తడబాటులు కదికలలో ఎన్నెన్నో ||
...........వాణి
గజల్................
జ్ఞాపకాల వానలలో మదివనం తడుస్తుంది||
చిన్ననాటి కొంటెతనం ఊహలలో మెరుస్తుంది||
మనసునేదొ అలజడిలే వెలికిరాక చిరునవ్వులు
ఆశలన్ని భావాలలొ పలికిస్తూ మురుస్తుంది||
ముత్యాలే మాలలుగా నీకోసం అల్లుతున్న
నీనవ్వులు మరికాసిని అందిస్తే ముగుస్తుంది||
అంతరాన్ని ఏలుతున్న నీరూపమె మురిపిస్తూ
మరోధ్యాస లేకుండా దప్పికనే మరుస్తుంది||
గుండెనిండ ఆలోచన తడుపుతున్న గురుతులెన్నొ
నీమాటల ఆలాపన మనసు ఆగి నిలుస్తుంది||
నిత్యపూజ కోసమేగ పువ్వులేరి తెచ్చాను
మాలగుచ్చి దేవునిమెడ అలరిస్తే తరిస్తుంది||
నీకనులే పలికించే భావాలలో ప్రేమలెన్నొ
మధుర'వాణి' మనసంత అనురాగమె కురుస్తుంది||
......... వాణి , 3 july 15