Wednesday, 8 July 2015

॥ పోతున్నా ॥ గజల్ 

జ్ఞాపకాల గాయాలను చెరపలేక పోతున్నా ॥ 
చిట్టితండ్రి నీజాడలు వెతకలేక పోతున్నా॥ 

రెప్పలపై తచ్చాడుతు  నీ అలికిడి జ్ఞాపకాలు 
తనువుకూడ గాయమౌతు కదలలేక పోతున్నా ॥ 

కనిపించే దూరములో రూపమేది కనపడినా 
నీవేనని తలపించీ నిలువలేక పోతున్నా॥  

చీకటులూ వెన్నెలలూ ఒకటిగానె కనిపిస్తూ 
తడపడుతూ గమ్యాలనె  చేరలేక పోతున్నా॥ 

చిగురించక ఆశలేవి చతికిలపడి పోయాను 
మదిలోపలి అలజడులను గెలవలేక పోతున్నా॥   

వెల్లువెత్తి  చిరునవ్వులు ఒక్కసారె  నిష్క్రమించె 
విరిగిపోయి మనసునింక  అతకలేక పోతున్నా ॥ 

కదలాడక కనిపించక చేజారే పోయావూ 
కలువరించు నీరూపం తాకలేక పోతున్నా॥  

నిదురలేని రాత్రులలో మౌనంతో పోరాటం 
మనసుకైన గాయాలను మాన్పలేక పోతున్నా 


చెమరించే బిందువులను భావాలుగ మార్చుకుంటు 
అమ్మఇచ్చు  ఈకానుక చేర్చలేక   పోతున్నా ॥ 


దిక్కులన్ని వెతికినాను దక్కలేదు ఆనవాలు 
పెల్లుబికే దు:ఖాన్ని ఆపలేక పోతున్నా ॥ 


అదిగదిగో అకడంటూ ఇదిగో ఇటువైపంటూ 
మనసులోన ఆరాటం నిలువలేక పోతున్నా ॥ 


గాలించని చోటేదీ లేనేలేదని తెలుసూ 
మదిలోతును తడమకుండ  ఉండలేక పోతున్నా ॥ 


గాయాలను స్పర్శిస్తూ గమనాలే ప్రశ్నిస్తూ 
తడబాటుల అడుగులతో నడవలేక పోతున్నా ॥ 


పాదాలే భారంగా పలుకులేని మౌనంగా 
సానుభూతి చూపునసలు గెలవలేక పోతున్నా ॥ 


నిదురలేని రాత్రులలొ మౌనముతో పోరాటం 
మనసుకైన గాయాలను మాన్పలేక  పోతున్నా ॥ 


కోరికలే తీరాలని ఆరాటం లేదసలే 
బాధ్యతలను బంధాలను వీడలేక పోతున్నా ॥ 


చెమరించే బిందువులను భావాలుగ పలికిస్తూ 
ప్రణయమునె కవిత్వంగ రాయలేక పోతున్నా ॥ 

మదిలోతున వినపడుతూ బోసినవ్వు  తియ్యదనం 
స్పర్శించే 'వాణి'యలుగ అందలేక పోతున్నా ॥ 

స్వప్నములే హిమముగా కరిగిపోతు వున్నాయి 
ఆశించిన శిఖరాలను చేరలేక  పోతున్నా 

ఒడిఏలిన నీరాజ్యం ఖాళీగా మిగిలింది 
రాలేవని నీరాకను తలవలేక పోతున్నా  

......వాణి 

No comments:

Post a Comment