Tuesday, 24 March 2015

॥  వెళ్ళావు ॥ గజల్ 


మదిచాటున మమతలన్ని దాచుకుంటు వెళ్ళావు 
మరువలేని జ్ఞాపకాలు  ఒంపుకుంటు  వెళ్ళావు !!

మనసులోన దాగుంటూ దోబూచులె  ఆడేవూ
అలుకలేవొ  వెలిబుచ్చుతు దాటుకుంటు వెళ్ళావు!!   

గుండెతలుపు తెరుచుంచీ ఆహ్వానం నాకంటూ 
హృదిలోకి రారమ్మని వేడుకుంటు వెళ్ళావు !!

వెలుగుపంచు దేవుడవని నీపైననె ఆరాధన 
కారణమే చెప్పకుండ  కోపమంటు వెళ్ళావు!!  

పగలనకా  రాత్రనకా నీకోసమే ఎదురుచూపు 
మెరుపులాగ కనులముందు నవ్వుకుంటు వెళ్ళావు!! 
  
నానవ్వుల పువ్వులన్ని నీముంగిట  పరిచానూ 
వేకువనే  ఒక్కొక్కటి ఏరుకుంటు   వెళ్ళావు!! 

మయూరంల  నానర్తన తన్మయమే అన్నావూ 
మధుర 'వాణి' మాటలతో మెచ్చుకుంటు వెళ్ళావు!!
....వాణి ,25 march 15
||ఉంది చూడు|| గజల్ కాన్వాస్..2

ఒంటరిగా నేనులేను ఆకాశము ఉంది చూడు
చిరునగవులు చిందించుచు కలుహారము ఉందిచూడు!!

జడనిండా జాజిపూలు ఎదురుచూపు నీకోసమే
ఆశపడుతు గుండెలోన సౌజన్యము ఉంది చూడు!!

ఏటివడ్డున ఎదురుచూచు నీ నెచ్చెలి నీకోసం
నిరసనతో నీమీదే తామసము ఉంది చూడు!!

ఎదలోతున నీపైనే తమకమునే దాచుకుని
వన్నెలనే కురిపిస్తూ వ్యామోహము ఉంది చూడు!!

జలపుష్పము కన్నులతో కోమలాంగి ఎదురుచూపు
సఖునిరాక తలపిస్తూ సంకల్పము ఉంది చూడు!!

మధుర 'వాణి' పలుకులనే వినాలనీ తపియిస్తూ
అనుక్షణము నీరాకకై నిరీక్షణము ఉందిచూడు!!

......వాణి, 

Sunday, 22 March 2015

॥ ఒక్కసారి ॥ 


కలతకేది  కారణమో తెలుసుకో  ఒక్కసారి    
మమతపంచి నిన్నునీవు మార్చుకో ఒక్కసారి   

మదినసలుపు గాయమేది  మాసిపోదు సహజమే  
సవరణలతొ  నీమనసుతొ  సర్దుకుపో ఒక్కసారి 

చేరదీయు చైతన్యమె  చెంతచేరును ఎప్పుడో    
కాలానికి వేచివుండి సాధించుకొ ఒక్కసారి  

దూరమైన క్షణాలేవి  తిరిగిదరికి చేరవులే 
సాధించే  ఆశయాలె  పేర్చుకో  ఒక్కసారి 

సాధనలో గెలవలేని విషయమేమీ ఉండదు 
అవమానపు  గాయమైన ఓదార్చుకొ ఒక్కసారి  


...వాణి

Thursday, 19 March 2015

॥ నీవేగా ॥

నా విరహపు పూదోటలొ పూబంతివి నీవేగా
నా తలపుల మైమరపుల సీమంతివి నీవేగా

మూసివున్న కన్నులతో నీఊహలొ నేనుంటే
కౌగిలిలో హత్తుకున్న చేమంతివి నీవేగా

ఏకాంతపు నాకలలకు ఊపిరులే పోస్తుంటే
ప్రేమలతో పరవశింపు కలహంసివి నీవేగా

మిన్నంటే నీప్రేమే ఆలంబన అవుతుంటే
నా మదిలో కొలువుండే లలితాంగివి నీవేగా

తొలిచూపులొ మదిచేరిన నీకోసమె పలవరింత
మధుర'వాణి' వినిపించే కలకంఠివి నీవేగా...||

........వాణి,
||నింపాను|| గజల్ 

నా హృదిలో నీ ప్రేమతో పరిమళాలు నింపాను
మనసంతా నీ ఊహల పరవశాలు నింపాను

తరచి తరచి నీకోసమె వేచివుంటు అనుక్షణం
తలపంతా నీ స్పర్శల సంతకాలు నింపాను

మధురమైన నీ ఊహలు మౌనంలో వెలికివొస్తు
నాముసిముసి నవ్వులలో మైమరపులు నింపాను

నీప్రణయపు గుర్తులెన్నో తనువంతా గిలిగింతలు
నీరాకకు పరితపిస్తు ఆకాంక్షలు నింపాను

ఎదసవ్వడి నీపేరే జపియించును ప్రతిసారి
ఆలకించి చెక్కిలిపై చిరునవ్వులు నింపాను

నామదిలోతిరునాళ్ళే నీ నామమే జపియిస్తూ
మధుర'వాణి' పలుకులలో మయూఖాలు నింపాను

....వాణి, 20 March 15
||ఆమని సొగసులు || తెలుగు గజల్...

తరువులన్నీ కొత్తచిగురు తొడుగుతాయి ఆమనిలో
ప్రతిమదిలొ పులకింతలు రేపుతాయి ఆమనిలో

విరబూసిన విరికన్నెలు మకరందం నింపుకుంటు
వసంతుడీ ఆగమనము కోరుతాయి ఆమనిలో

మధురమైన అనుభూతితొ మనసుకెంత ఉల్లాసమో
మధువునిండి పుష్పములే నవ్వుతాయి ఆమనిలో

మధుమాసపు సొబగులన్ని ఆహ్వానము ప్రకటిస్తూ
చిగురాశలు చిలుకరిస్తు వచ్చినాయి ఆమనిలో

ఆకురాలి ప్రతిచెట్టూ చివురాకులు అలవరించి
కోయిలలకు స్వాగతాలు పలుకుతాయి ఆమనిలో

విరిసివున్న పువ్వులపై నవ్వుకుంటు భ్రమరాలు
మధువునంత జుర్రుకోగ వాలుతాయి ఆమనిలో

సిరిమల్లెలు పరిమళాలు వెదజల్లును వనమంతా
మగువసిగన మురవాలని కులుకుతాయి ఆమనిలో

వేపపువ్వు పచ్చడితో షడ్రుచులూ మేళవించి
ఆరుఋతువుల అర్ధాలనే చాటుతాయి ఆమనిలో

భావాలే పూయిస్తూ వసంతాల సొగసులన్ని
మధుర 'వాణి' కవనంలో నిండినాయి ఆమనిలో

......వాణి,20 March 15

Sunday, 15 March 2015

॥ నీకోసం॥ 
తెలుగు గజల్.........

మది తలుపులు నీకోసం  తెరుస్తూ ఉన్నానూ 
నీవలపుల తలపులలో  తడుస్తూ ఉన్నానూ 

నింగిలోన విహరించే జాబిలిని  నేనౌతూ 
హృదయములొ వెలుగునింపి మురుస్తూ ఉన్నానూ 

మనసంతా మౌనాలే  శూన్యంగ మారుతుంటె 
నీస్పర్శలు కావాలని తలుస్తూ ఉన్నానూ 

దోసిలిలో నీనవ్వులు చినుకుల్లా రాలుతుంటె 
గగనంలో నీకోసం గాలిస్తూ ఉన్నానూ 

నా భావపు   దొంతరల్లో ప్రతికదలిక నీదేలే 
గుర్తులన్నీఅక్షరాల్లో లిఖిస్తూ ఉన్నానూ 
పరవసించు నీమదిలో సంబరాలు  నావేలే 
నా పెదవుల 'వాణి'లోన స్తుతిస్తూ ఉన్నానూ 

....వాణి 
... గడపాలని ఉంది......

తెలుగు గజల్.....

నీమమతల జల్లులలో తడవాలని ఉంది నాకు 
కొత్తపూల దారులలో నడవాలని ఉంది నాకు

చిగురించే కొమ్మలలో కోయిలనై దాగుంటూ
మురిపించే రాగాలతొ కూయాలని ఉంది నాకు

పరిగెత్తే పసితననాలు మరల నాకు మొదలైతే
జన్మంతా బాల్యంలో గడపాలని ఉంది నాకు

కనిపించని ఆశేదో మిణుగురులా మెరుస్తుంటె
కోరికలే వెల్లువలై కురవాలని ఉంది నాకు

జాబిలమ్మ కప్పుకున్న నిశి దుప్పటి తొలగిస్తూ
వెన్నెలంత హత్తుకుంటు మెరవాలని ఉంది నాకు

అరమూసిన కన్నులతో కలవరింత నాదేలే
నీ స్వరముల 'వాణి' లాగ మురవాలని ఉంది నాకు

...... వాణి
..... అడుగుతోంది.......

తెలుగు గజల్....

ఆకశాన్ని స్వాతిచిప్ప చినుకిమ్మని అడుగుతోంది 
ఎండుతున్న నేలతల్లి జల్లిమ్మని అడుగుతోంది

మురుస్తున్న అమ్మతనం వడినేలే పాపాయితొ
బోసినవ్వు చిన్నారినే ముద్దిమ్మని అడుగుతోంది

మేల్కొల్పే ఉషోదయం పరవశించు ప్రతికుసుమం
ప్రతిపువ్వు భానుడినే స్పర్శిమ్మని అడుగుతోంది

నిశీధిలో నడుస్తుంటే మనసంతా మౌనాలే
ఆశలనే అరువిమ్మని వెలుగమ్మని అడుగుతోంది

నీపాదం పలికించే సిరిమువ్వల సవ్వడులే
ఆఅడుగుల అలరింపే జతులిమ్మని అడుగుతోంది

భావాలే మూటలయ్యి మనసులోన దాగుంటే
అక్షరమై ప్రవహించు వరమిమ్మని అడుగుతోంది

వేకువనే పలకరించ నీ ధ్యాసలొ మేల్కొంటు
నిన్నరాత్రి స్వప్నాలను గుర్తిమ్మని అడుగుతోంది

మౌనంగా మారివున్న మానసాన్ని మేల్కొపుతూ
మధుర"వాణి" ప్రేమనింపు మాటిమ్మని అడుగుతోంది

..........వాణి 
......నీవేలే.........

తెలుగు గజల్ .....

జీవితంని వెలిగించిన హితైషిణివి నీవేలే 
వెలుగులోకి నడిపించే మధుభాషిణి నీవేలే

మంచుతోన వాకిలినే తడిపిందీ ఆకాశం
హరివిల్లునె ముగ్గులుగా దిద్దిందీ నీవేలే

మనసులోని భావాలే జడివానగ కురుస్తుంటె
ఊహలలో తడుపుతున్న నెచ్చెలివి నీవేలే

రెప్పలపై తచ్చాడుతు మనసంతా నీరాగమె
హృదయవీణ మీటుతున్నకలలరాణి నీవేలే

చీకటినే పారద్రోలు వెలుగురేఖ నేనైతే
రాలుతున్న నవ్వులతో మురుస్తుంది నీవేలే

మూసుకున్న కనులతోన నీ రూపం చూస్తానూ
మనసంతా అల్లుకున్న సుభాషిణివి నీవేలే

నీ పదాల పదనిసలో పరవశించు హృదయాలు
అక్షరాల మాలలల్లు కవిత 'వాణి' నీవేలే

....... వాణి 
......... అంకితం..........

తెలుగు గజల్ ...

ఎగసి పడే కెరటాలే తీరానికి అంకితం
మౌనమైన అక్షరాలు భావానికి అంకితం

మేఘాలే కురిపించే చిరుజల్లులు అవనిపై
ఆ చినుకుల తడి అంతా ధరణికే అంకితం

చీకటినే తరిమేస్తూ ఉషోదయం వెలుగులు
ఆ కిరణపు స్పర్శంతా కుసుమాలకి అంకితం

నింగి అంత పరచుకున్న నిండుపున్నమి చంద్రుడు
పంచుతున్న వెన్నెలంత అంబరానికి  అంకితం

చెలిమోమున పరచుకున్న ముంగురులే అందంగా
తనచెంపలు ముద్దాడే నీలాలకి అంకితం

............ వాణి 
..........ఎందులకో............

.
తెలుగు గజల్...

వెన్నెలంత నీటిలోకి ఒలుకుతోంది ఎందులకో
చెరువులోన కలువభామ కులుకుతోంది ఎందులకో

చెలి చెక్కిట సిగ్గులతో పరవశించు నామనసే
అందమంత నాదేనని మురుస్తోంది ఎందులకో

నీ స్పర్శల సంతకాలు పులకరింతె నామనసుకి
నునుసిగ్గే చిరునగవుల రాలుతోంది ఎందులకో

నిదురరాని రేయంతా నీఊహల సందడులే
చిరునవ్వులు చిరుజల్లుగ కురుస్తోంది ఎందులకో

ముత్యాల్లా రాలుతున్న నీ నవ్వులు సంపదలే
ప్రతి ముత్యం నీ రూపం చూపుతోంది ఎందులకో

జ్ఞాపకాల భావాలే అక్షరాలై ప్రవహిస్తే
గాయాలే గేయాలై మారుతోంది ఎందులకో

...........వాణి
.....అలా వచ్చి వెళ్ళింది......
గజల్ 

స్వప్నంలో చెలి నవ్వే అలా వచ్చి వెళ్ళింది
తను తాకిన విరి గాలే అలా వచ్చి వెళ్ళింది

తలపంతా నీ ఊహలు సందడులే చేస్తుంటే
మెరుపులాగ నీ రూపే అలా వచ్చివెళ్ళింది

సుమాలన్ని విరబూసి మకరందం నింపుకుంటె
దోచుకొనే తుమ్మెదయే అలా వచ్చి వెళ్ళింది

మనసులోకి నడుస్తూ నీ కోసం గాలిస్తూ
తలపులలో నీ కలయే అలా వచ్చి వెళ్ళింది

నిశలులేని రాత్రులకై నే ఎదురు చూస్తుంటే
సంబరాల వెండి వెలుగే అలా వచ్చి వెళ్ళింది

......వాణి కొరటమద్ది
తెలుగు గజల్.....


తూ ర్పులోన గున్నమావి పూసినట్లు ఉందిలె
సింధూరపు గంధమేదొ పూసినట్లు ఉందిలె

పొద్దుపొడుపు కిరణస్పర్స విచ్చుకుంటు సుమాలూ
వికసించిన కుసుమాన్నై మురిసినట్లు ఉందిలె

మౌనించిన మనసులోన భావాలు సందడి చేస్తే
కవనంలో అక్షరమై ఇమిడినట్లు ఉందిలె

చిరుజల్లులో చిన్నారుల చిందులాట సంబరమే
మనసంతా బాల్యంలో మెరిసినట్లు ఉందిలె

పసిపాపడి బోసినవ్వు ముచ్చటగా చూస్తుంటే
అమ్మవడిన చిన్నారినై ఆడినట్లు ఉందిలె...!!

.... వాణి
Unlike · 
 గజల్.....

అక్షరాలు ఒలికించే అర్ధమెంత బాగున్నది
కవనంలా మారుతున్న భావమెంత బాగున్నది


తొలిస్పర్శ మురిపించే తల్లిప్రేమ మధురంగా
అమ్మఒడిని చేరుకున్న అందమెంత బాగున్నది


వాడ్చేసిన ముసలితనం కన్నప్రేమ తోడుండగ
వార్ధక్యం కానరాని ఆశ ఎంత బాగున్నది


గుండెలోతు గాయాలకు తొలగిపోని దు:ఖాలకు
ఆత్మీయుల ఓదార్పు పలకరింత బాగున్నది


వెతుకుతున్న ఆశేదో వర్ణమాలగ కనిపించెను 
మధుర'వాణి' లిఖిస్తున్న కవనమెంత బాగున్నది   

....వాణి 
/తెలుగు గజల్/

తొలకరిలో తడిసి మట్టి వాసనెంత బాగుందీ
చిరుజల్లుకు పులకించే వదనమెంత బాగుందీ

హరివిల్లును చూస్తుంటే మనసు తృళ్ళి పడుతుంది
రంగుల్లో మెరవాలని కోరికెంత బాగుందీ

చిరువెచ్చని ఉషోదయం అనుభూతీ హాయిగా 
విరబూసిన కుసుమాలలొ అందమెంత బాగుంది

పసిపాపలు  అమ్మఒడిసామ్రాజ్యపు రాజులేగ 
అమ్మస్పర్శ కురిపించే ప్రేమఎంత బాగుందీ

అక్షరాల అమరికలో మానాలను ఏలుతూ
మధుర'వాణి' పదాలతో అల్లికెంత బాగుందీ