Thursday, 30 April 2015

॥ నీవే అయితే చాలు ॥ గజల్

సాంతం తోడుగ స్నేహం నీవే అయితే చాలు ॥
మమతగ మెదిలే నేస్తం నీవే అయితే చాలు ॥

మౌనపు తెరలో మాటలు మరచా నీ ఊహలలో
మనసున మెరిసే లాస్యం నీవే అయితే చాలు॥

కోరిన ప్రేమే గెలుపుల శిఖరం చేరిందిపుడే
తలపుల వలపుల తీరం నీవే అయితే చాలు॥

మనసున నిన్నే నిత్యం పిలిచే వరమే ఇవ్వు
అభిలాషించిన రాగం నీవే అయితే చాలు ॥

మదియుహలలో ప్రియతమ కదలిక మధురం కాదా
తలచిన మెదిలే రూపం నీవే అయితే చాలు ॥

హృదయంలోనె కోవెల కట్టీ నిన్నే నిలిపా
వెలిగే దీపపు తేజం నీవే అయితే చాలు॥

పెదవుల 'వాణీ' నామం నాదం నీదే అవుతూ
కవితలొ ఒలికే భావం నీవే అయితే చాలు॥

......వాణి 
॥ మాయమై॥ గజల్ 


సమాజమే చిన్నబోతు మానవత్వం మాయమై ॥ 
దూరమవుతు బంధాలే ప్రేమతత్వం మాయమై॥  

వయసుతేడా లేనె లేదు వావి వరుస లేనె లేవు 
మృగాలుగ మారిపోతు మనిషితత్వం మాయమై ॥  

ప్రజాసేవ పేరుకేగ వారిధనం దోచుకుంటు 
రాజ్యమేలె స్వార్ధపరుల త్యాగతత్వం మాయమై॥   

కోవెలలో  అయినగాని  నేతలకే దండమంటు 
సామాన్యులు మౌనమాయె దైవతత్వం మాయమై ॥   

మధుర'వాణి'అక్షరాలే అల్లుతోంది మార్పుకై 
కోరుకుంటు పాలకులలొఆశతత్వం మాయమై ॥   
 

......వాణి 

Wednesday, 29 April 2015

॥ అనుకున్నా॥

నిజముగనే  నువ్వునాకు ఊపిరివని  అనుకున్నా!!
బ్రతుకంత నీతోనే నడవాలని అనుకున్నా!!

సుకుమారపు పాదాలను కష్టపెట్ట కుండానే
భుజములపై భారమైన మోయాలని అనుకున్నా !!

నీకన్నులు తడువకుండ కలతలేవీ దరిచేరక
నొప్పించే  సంగతులను దాచాలని అనుకున్నా!!

వేకువలో రేతిరిలో ఇడుములెన్ని  పడినగాని
వికసింపుతొ నారూపం చూపాలని అనుకున్నా!!

గుండెలోని బాధలన్ని నానీడతొ చెప్పుకుంటు
నీవదనము వెలుగులతో  చూడాలని అనుకున్నా !!

మధురమైన 'వాణి'యలను నిద్దురలో మెలకువలో
అనుక్షణం ఆలకిస్తు గడపాలని అనుకున్నా!!

...... వాణి,  29 April 15

Monday, 27 April 2015

 ॥ ఉన్నవిలే ॥ 

నీమాటల ముత్యములే  తలపులలో  ఉన్నవిలే !!
నీ స్పర్శల గిలిగింతలు ఊహలలో ఉన్నవిలే !!

నీ ఎడబాటు  వేదనతో బేజారే మనసంతా 
నీ అనుసృతి జ్ఞాపకాలు తపనలలో ఉన్నవిలే !!

మనసంతా హాయి హాయి నీ ప్రేమల గురుతులతో 
చెప్పలేని దూరాలూ విరహంలో ఉన్నవిలే !!

గెలవలేక పోతున్నాను దూరాలే భారమౌతు 
ప్రతీక్షణం మెలుకువలే వియోగంలో ఉన్నవిలే !!

మదినిండా కోరుకున్న మధుర'వాణి' ఆగమనం 
హృదిగెలిచే సంతసాలు తనరాకలో ఉన్నవిలే !!

........ వాణి 
  
|| ఉన్నానూ|| గజల్.........


నీ నవ్వుల ముత్యాలను ఏరుకుంటు ఉన్నానూ
నీ మాటల మల్లెలన్ని దాచుకుంటు ఉన్నానూ


నా మదిలో భావాలే కవనంలో ప్రవహిస్తూ
మనసంతా నీప్రేమే నింపుకుంటు ఉన్నానూ


జ్ఞాపకాల తోటలోన బాల్యానికి మరలవెళ్ళి
మురుస్తున్న నామనసులొనవ్వుకుంటు ఉన్నానూ


వేకువలో విరబూసే పువ్వులన్నీ నవ్వుతుంటె
పూవ్వునయ్యి మురవాలని వేడుకుంటు ఉన్నానూ


ఇల అంతా వణికించే చలిదుప్పటి నీడలో
నులివెచ్చని కిరణాలను కోరుకుంటు ఉన్నాను


మౌనంలో మధుర'వాణి'  అక్షరాల్లో ప్రకటిస్తూ
భావాల పరంపరలో ఒంపుకుంటు ఉన్నానూ

......వాణి
21 jan 15
||ఉంది నాకు|| గజల్.....


నీమమతల జల్లులలో తడవాలని ఉంది నాకు 
కొత్తపూల దారులలో నడవాలని ఉంది నాకు


చిగురించే కొమ్మలలో కోయిలనై దాగుంటూ
మురిపించే రాగాలతొ కూయాలని ఉంది నాకు


పరిగెత్తే పసితననాలు మరల నాకు మొదలైతే
జన్మంతా బాల్యంలో గడపాలని ఉంది నాకు


కనిపించని ఆశేదో మిణుగురులా మెరుస్తుంటె
కోరికలే వెల్లువలై కురవాలని ఉంది నాకు


జాబిలమ్మ కప్పుకున్న నిశి దుప్పటి తొలగిస్తూ
వెన్నెలంత హత్తుకుంటు మెరవాలని ఉంది నాకు


అరమూసిన కన్నులతో కలవరింత నాదేలే
నీ స్వరముల 'వాణి' లాగ మురవాలని ఉంది నాకు

...... వాణి 

॥ మధురమే ॥ గజల్
అమ్మగర్భాన అంకురమైన ఆక్షణాలు మధురమే
ఉమ్మనీటిలొ ఈదులాడిన ఆరోజులు మధురమే

కేర్ కేరు మని ఏడుపుతో ప్రపంచాన్నీ చూశాము
తొట్టతొలీ ఆకలి తీర్చిన ముర్రుపాలు మధురమే

ఎన్ని ఊయలలుఊగిన తనివి తీరదు ఎప్పటికీ
ఇప్పటికీ ఆఅమ్మఒడీ ఊయలలూ మధురమే

చిలిపితనాలు అల్లరిపనులు అమ్మ మందలింపులూ
మరువలేనీ ఆఅనుభుతుల కసరింపులు మధురమే

లేని బూచాడిని చూపిస్తూ ఆకలినీ తీరుస్తూ
చందమామను రమ్మంటు ఆపాటలు మధురమే

ఊట్టుట్టీ పడంటూ అమ్మమోకాళ్ళపై ఊగాము
తిరిగిరాలేని ఆబాల్యపు సంతసాలు మధురమే

మధుర'వాణి' పలుకులతో అమ్మ మురిసిందప్పుడూ
ఇప్పటికీ అమ్మ చెప్పే ఆకబురులు మధురమే

......వాణి వెంకట్ 
॥ భావించా ॥ గజల్

నీపైననే ప్రేమనింపి మురవాలని భావించా !!
మదిదాచిన వేదనలే మరవాలని భావించా !!

అక్షరాల మాలలలో భావాలను అల్లుకుంటు
మౌనంగా మనసువెంట నడవాలని భావించా !!

మదివేదన మాన్పించే మంత్రమేదో కావాలని
అడుగడుగున నీస్నేహమే పొందాలని భావించా !!

చిన్ననాటి జ్ఞాపకాలు మనసంతా మెరుపులులే
వెనుకకెళ్ళి వెలుగులలో గడపాలని భావించా !!

నీ చెక్కిలి ముద్దాడుతూ ముంగురులే విర్రవీగు
ఒకకేశము నేనౌతూ గెలవాలని భావించా !!

ఊహలలో స్వప్నంలో ప్రతిక్షణము నాహృదిలో
నీతలపులొ సౌజన్యము ఉండాలని భావించా !!

తీరములో కెరటాలే మనసులోన కేరింతలు
హుషారుతొ మానసాన్ని తడపాలని భావించా !!

నింగిలోన వెన్నెలంత కొలనులోకి ఒలుకుతుంటె
నీటిలోన పుష్పమునై విరియాలని భావించా !!

తన రాకను తలపించీ చెలిచెక్కిట సిగ్గులులే
సిరిమల్లెల పరిమళాలు నింపాలని భావించా!!

మధుర'వాణి' భావాలు అనుభవాల పాఠాలు
మనసులోన తడిఅంతా ఒలకాలని భావించా !!

............వాణి  

Sunday, 26 April 2015

1. ॥ కడలి॥ 

అలసి పోని ఆకెరటం ఆరాటం చూస్తున్నా!!
మునుముందుకు సాగాలని పోరాటం చూస్తున్నా!!


ఓటమెంత ఎదురైనా ప్రయత్నం మాననంటూ
తీరాన్ని చేరాలనె ఉబలాటం చూస్తున్నా!!

అడుగులను తుడిచేస్తూ  గతం మరచి నడవమనే
తరంగాలు నేర్పుతున్న  గుణపాఠం చూస్తున్నా!!

కడలి నీరు కంటనీరు వ్యర్ధమనీ  చెపుతున్న  
ఊరడించు సాగరపూ సంస్కారం  చూస్తున్నా!!

సముద్రపు సాంగత్యం కెరటాలే తోడుగా
ఓదారిన మనసుల్లో ఉత్కంఠం  చూస్తున్నా!!

మధుర'వాణి' కవనంలో తీరము నేర్పినపాఠం 
భావాలలొ  పలికించిన  అనుభవం చూస్తున్నా!!


........వాణి
॥ అపురూపం ॥ 

మదివనాన్నిమురిపించే నీనవ్వులే అపురూపం ॥
మెరిసేటీ నీవదనపు హర్షాలే అపురూపం॥

చిన్నారుల మురిపాలను తీర్చాలని ఆరాటం
ఆఆశలు తీరినపుడు వేడుకలే అపురూపం॥

నిదురించే మనసులోన సంతోషం నీ ఊహలు
మురుసేటీ మానసంకి నీస్పర్శలే అపురూపం ॥

సడిచేయని ఎదలోతున యోచించే భావమే
మౌనంలో వెలికివచ్చు మర్మాలే అపురూపం ॥

నీ అడుగులు పలుకుతున్న జతులన్నీ నాకోసమె
నవరసాలు ఒలుకుతున్న జావళీలే అపురూపం!!

మౌనములో ఊసులన్ని దాచుంచా నీకొరకే
నీచెవిలో విప్పుతున్న గుసగుసలే అపురూపం!!

సముద్రంలో నీటితోన ప్రయోజనము లేకున్నా
జలనిధిలో దాగుండే ముత్యాలే అపురూపం ॥

కడలిలోన కల్లోల్లం ఎప్పుడైన అనివార్యం
ఓటమెరుగని తరంగాల పాఠాలే అపురూపం ॥

జ్ఞాపకంగ మిగిలాయీ బాల్యాలే పదిలంగా
చిన్ననాటి అనుభూతుల మధురాలే అపురూపం ॥

మధుర 'వాణి' ఒలికించిన భావాలే చిత్రమౌతు
మదిదోచిన నాప్రియతమ చెలియేలే అపురూపం॥

....వాణి , 
॥ దాచింది॥ గజల్

ఆకాశం ఎత్తులోన ఆశేదో దాగుంది !!
లోతంటూ మనసులోన దిగులేదో దాగుంది !!

వినువీదిన వెతుకుతున్న మదినలేని ప్రకాశమె 
మేఘంలో చందమామ వెలుగేదో దాగుంది!!

చిరునవ్వులు పండించిన బాల్యాన్నే తలపిస్తూ
నేస్తాలతో ఆడుకున్న గురుతేదో దాగుంది!!

వెలికిరాని గాయాలే మనసులోన సంఘర్షణ
మౌనంగా హృదయాన తడియేదో దాగుంది !!

మధుర 'వాణి' తలపులలో చెరిగిపోని గురుతులెన్నొ
గుండెగది లోలోతున వేదనేదొ దాగుంది !!

.......వాణి,27 April 15

Monday, 20 April 2015

॥ నీవేగా ॥ గజల్ 


ప్రియమార నాహృదిలో మెదులుతోంది నీవేగా!! 

ఊపిరిలో శబ్దాలుగా ఇముడుతోంది నీవేగా!!




నీప్రేమంత కురిసె నాలో తడుపుతున్న జడివానగ
సంతోషపు సవ్వడిలో ఒలుకుతొంది నీవేగా!!




నా కనులలొ కురిసేటీ ఆశలన్ని తీర్చాలని 
నా మనసును గెలవాలని తపిస్తోంది నీవేగా!! 




మీనాలే నాకన్నులు నీ ఊహల మెరుపులతో 
రేయిపగలూ నాధ్యాసలో ప్రేమిస్తోంది నీవేగా !!




మధుర 'వాణి' మౌనంలో కలవరింత నీదేలే 
నిశ్శబ్దపు ఊహలనీ దాస్తోంది నీవేగా !!




....వాణి



Friday, 17 April 2015

॥ ఒకటొకటిగ॥గజల్ 

అనుభవాల జ్ఞాపకాలే ఏరుతున్నా ఒకటొకటిగ!!
కాగితంలో అక్షరాలుగ పేర్చుతున్నా ఒకటొకటిగ!!

అమ్మనైన తియ్యదనం మరువలేని అద్భుతం
అలనాటి మురిపాలను లిఖిస్తున్నా ఒకటొకటిగ!!

గాయపడిన సందర్భమె మేల్కొలిపెను మనసునూ
గతంనేర్పిన పాఠాలను కూర్చుతున్నా ఒకటొకటిగ!!

గతకాలపు సంఘటనలో మదిదాచిన గుర్తులెన్నో
గెలుపోటమి అనుభూతులు చేర్చుతున్నా ఒకటొకటిగ!!

ఏకాకిగ మిగిలిపోతు బంధాలే దూరమౌతు
అన్యోన్యత ముచ్చటలే రచిస్తున్నా ఒకటొకటిగ!!

మానవత్వం మాసిపోయిన సమాజంలొ మసలుతున్నా
స్పందించే మనసులనూ కలుపుతున్నా ఒకటొకటిగ!!

.....వాణి, 
॥ కనిపిస్తూ ॥ గజల్ 


అరమూసిన నీమోమున మెరుపేదో కనిపిస్తూ !!
నీకనులలొ నాపైననే ప్రేమేదో కనిపిస్తూ !!


నాజతనే కావాలని చూపేదో ఒలికిస్తూ
మదిచాటున మౌనంలోవిరహమేదో కనిపిస్తూ !!


ఎరుపెక్కిన నీచెక్కిట ఒలుకుతున్న నునుసిగ్గులు
నాఉహలొ అంతరంగ దృశ్య మేదో కనిపిస్తూ!!


అలశానని నాకోసం చిరునవ్వుల ఆహ్వానం
ఎదురుచూచు నీ తలపున బాధ్యతేదో కనిపిస్తూ !!


మధుర'వాణి' సందేశం వెలికిరాని సంకేతం
నిదురలేక వేచివున్న సూచనేదో కనిపిస్తూ !!


........వాణి
॥ దాచింది ॥ గజల్ 

నా నెచ్చెలి కురులనిండ మరుమల్లెలు దాచింది
గులాబీల బుగ్గలలొ నునుసిగ్గులు దాచింది!!


ఎదురుచూచు కన్నులలో ఆశలేవొ నింపుకుని
గమ్మత్తుగ నాకొరకే మైమరపులు దాచింది!!


ఊహకాదు కలకాదు కంటి ముందు కదలాడుతు
నిరీక్షణలో తన అందపు పులకింతలు దాచింది!!


నాహృదయపు స్పర్శలతొ తనుమురిసి పోవాలని
వేచివుంటు నారాకకు ప్రేమసుధలు దాచింది !!


మధుర'వాణి' పలకరింపు మురిపాలనే పంచాలని
నాచెలిమే  కోరుకుంటు నిశ్శబ్దాలు దాచింది !!


........వాణి

Wednesday, 1 April 2015

॥ ఉంటుందని ॥ గజల్ 

భావించా తనకన్నుల విరహమేదో ఉంటుందని॥
తలపించా తనమనసున తమకమేదో ఉంటుందని॥

అడుగడుగున తనధ్యాసన అక్షరాలే లిఖించా
మదినిండా నాపైననే ప్రేమేదో ఉంటుందని॥

తనచేతుల ముద్రలలో నాపైనే మెచ్చుకోలు
శబ్ధించే పాదాల్లో వర్ణనేదో ఉంటుందని ॥

మదిలోపల తనరూపం చిరునవ్వులు చిందించును
ముసుగులోన నాకోసం మెరుపేదో ఉంటుందని ॥

నింగిలోన జాబిల్లిలొ తనకోసం చూస్తుంటే
ముసిముసిగా నావెనుకే వెలుగేదో ఉంటుందని ॥

మధుర'వాణి' మాటలలో అమృతమే కురుస్తుంటే
తనపలుకుకు ఎదురుచూచు గడియేదో ఉంటుందని॥

....వాణి
॥ నీకోసం ॥ గజల్ 
నామదిలో వలపంతా నింపుకున్నా నీకోసం
నాదరికే చేరెదవని వేచివున్నా నీకోసం

నీధ్యాసనె తలపంతా నీతపనే మనసంతా
ఊహల్లోను వయ్యారమె ఒలుకుతున్నా నీకోసం

సొమ్ములెన్నొ ధరియించి సొగసంత నింపుకునీ
హృదయంలొ మైమరపులు దాచుకున్నా నీకోసం

నాసొగసులు నీకన్నులు కొసరికొసరి చూస్తుంటే
నీఅడుగులు నావైపుగ కోరుకున్నా నీకోసం

ఎదమీటు రాగాలే నాపలుకుల పదనిసలే
పరితపించి కొత్తరాగం పాడుతున్నా నీకోసం

స్వప్నంలో నీస్పర్శలు మనసంతా సందడులే
మధుర'వాణి' పలుకులకై కాచుకున్నా నీకోసం

......... వాణి,