Monday, 27 April 2015

॥ భావించా ॥ గజల్

నీపైననే ప్రేమనింపి మురవాలని భావించా !!
మదిదాచిన వేదనలే మరవాలని భావించా !!

అక్షరాల మాలలలో భావాలను అల్లుకుంటు
మౌనంగా మనసువెంట నడవాలని భావించా !!

మదివేదన మాన్పించే మంత్రమేదో కావాలని
అడుగడుగున నీస్నేహమే పొందాలని భావించా !!

చిన్ననాటి జ్ఞాపకాలు మనసంతా మెరుపులులే
వెనుకకెళ్ళి వెలుగులలో గడపాలని భావించా !!

నీ చెక్కిలి ముద్దాడుతూ ముంగురులే విర్రవీగు
ఒకకేశము నేనౌతూ గెలవాలని భావించా !!

ఊహలలో స్వప్నంలో ప్రతిక్షణము నాహృదిలో
నీతలపులొ సౌజన్యము ఉండాలని భావించా !!

తీరములో కెరటాలే మనసులోన కేరింతలు
హుషారుతొ మానసాన్ని తడపాలని భావించా !!

నింగిలోన వెన్నెలంత కొలనులోకి ఒలుకుతుంటె
నీటిలోన పుష్పమునై విరియాలని భావించా !!

తన రాకను తలపించీ చెలిచెక్కిట సిగ్గులులే
సిరిమల్లెల పరిమళాలు నింపాలని భావించా!!

మధుర'వాణి' భావాలు అనుభవాల పాఠాలు
మనసులోన తడిఅంతా ఒలకాలని భావించా !!

............వాణి  

No comments:

Post a Comment