Wednesday, 6 April 2016

కనులెదురుగ నువ్వుంటే మౌననిధులు నాకెందుకు ||
స్మరదీపిక నీదయితే జ్ఞాపకాలు నాకెందుకు ||

మునుపటివే అనుభవాలు నీడలుగా మెదిలాయీ
కాలమంత చిరునవ్వైతె మనసుతడులు నాకెందుకు ||

విషాదాల నెలవులోన కాంతిలేక నడుస్తున్నా
నిశలబాట నిషిద్దమే అమావసలు నాకెందుకు ||

చూపులోన కన్నీళ్ళే దాటివెళ్ళ కున్నాయీ
నిశబ్దంలొ నిలచుంటే మౌనసడులు నాకెందుకు ||

అనునిత్యం అమ్మప్రేమ గెలుపువెలుగె నడిచొస్తుంది
బతుకంతా వాచ్చల్యం గుప్తనిధులు నాకెందుకు ||

మౌనవాణి వాక్కులన్ని అక్షరమై మాటాడెను
ఆంతర్యం తెలిసుంటే పలుకుసిరులు నాకెందుకు ||

మమతపూల వనంలోన విహరించాలనివున్నది
బంధాలు ఆనందాలె విరోధాలు నాకెందుకు ||
...............వాణి, 7 jan 16
జ్ఞాపకంలొ పదిలమైన ఘటనలెపుడు మరువలేను ||
కరుగుతున్న కాలంలో కాంతులెపుడు మరువలేను ||
చిరునవ్వులు సిరులేగా వ్యధనిండిన కధలలోన
ఆదుకున్న ఆత్మీయుల సాయమెపుడు మరువలేను ||
ప్రతిజీవికి తప్పదులే చివరాఖరి ప్రయాణాలు
మానవతను నిలబెట్టిన మనిషిననెపుడు మరువలేను ||
మగువగెలుచు అమ్మతనం మధురమైన ఆనందం
పరిపూర్ణత సాధించిన గెలుపునెపుడు మరువలేను ||
గాయపడ్డ జీవితాలు మౌనచింత మోస్తున్నవి
మౌనవాణి గుండెమోయు ఓటమెపుడు మరువలేను ||
తల్లిపమిట కొంగుతోన ఆడుకున్న బూచాటలు
అమ్మఒడిలొకమ్మదనపు స్పర్శనెపుడు మరువలేను ||
..........వాణి, 19 jan 16
గజల్.....
మనసుతోన మనసుకలిపి చూస్తున్నది రాతిరి ||
నీడలలొ కలగలుపుతు వెళుతున్నది రాతిరి ||

తడిఇంకని తలపేదో తల్లడిల్లు మనసుల్లో
వేకువలో వెలుగులకై వేచున్నది రాతిరి ||

భావాలను రంగరించి అక్షరాలు పేర్చుకుంటు
చెంపలపై కలమునాన్చి రాస్తున్నది రాతిరి ||

నిశరాల్చిన చినుకులేవొ నిదురపోని కన్నులలో
జ్ఞాపకాల చింతలనే మోస్తున్నది రాతిరి ||

గుర్తెరిగిన గాయమేదొ గుండెల్లో గుచ్చుకుంటు
స్వప్నాలను వెలివేస్తూ మెల్కొన్నది రాతిరి ||

మౌనవాణి పిలిచినట్లు నిశబ్దాన్ని హత్తుకుంటు
కీచురాళ్ళ ధ్వనులలో దాగున్నది రాతిరి ||

.......వాణి, 21 jan 16
ఎడారిలో గులాబిలు పూయడం కష్టమే ||
చింతలో చిరునవ్వు ఒలకడం కష్టమే ||
చీకటుల వెన్నెలల సంగమం జీవితం
సంసార సాగరం ఈదడం కష్టమే ||
గతమైన గాయాలు మచ్చలుగ మిగులుంటె
నొప్పితో గురుతుల్ని మరువడం కష్టమే ||
ఎండతో తేమతో చెలిమేలె మొలకలకు
తడిలేక విత్తులే మొలవడం కష్టమే ||
వేదనతొ పెదవిపై నిట్టూర్పు శబ్దాలు
వదనంలొ హాసాలు విరియడం కష్టమే ||
నిర్జలం నేలంత ఎడారిగ మారితే
మబ్బులే చినుకుల్ని రాల్చడం కష్టమే ||
రోజుల్లో భారాన్ని సహించె శక్తిలేదు
కన్నీళ్ళ కాలాన్ని దాటడం కష్టమే ||
మనసులో యుద్ధమే కలవరాల మౌనంలో
మౌనవాణి మాటల్ని వెతకడం కష్టమే ||
క్షణాలే పరీక్షగ గడచిపోతు ఉన్నాయి
నిత్యమై ఇడుముల్ని వేగడం కష్టమే ||
.....వాణి, 28 jan16

గజల్ కాన్వాస్ .......43
నా గుండె వేదనగ తలవంచు కుంటోంది ||
నీ ఒడిలొ దు:ఖాన్ని సవరించు కుంటోంది ||
గడిచింది కాలమే వెలలేని గుర్తుగా
బాదించు స్మృతులను తొలగించు కుంటోంది ||
నే కన్న కలలన్ని కన్నీట మునిగాయి
కలహాల కధనాలు యోచించు కుంటోంది ||
చిరకాల విరహాన్ని చీకటిలొ మోశాను
నీ జతలొ భారాన్ని మది దించు కుంటోంది ||
నీ చేతి లాలింపు చిరునవ్వు గెలిచింది
గాయాలు నీ స్పర్శ అలరించు కుంటోంది ||
నీ శ్వాస శబ్ధాలు భారంగ వినిపిస్తు
నీ చూపు ననుతాకి చెమరించు కుంటోంది ||
మన్నింపు మౌనంలొ నే గెలుచు కున్నాను
నీ మనసు నా వాణి వినిపించు కుంటోంది ||
.......వాణి ,1 Feb 16
మనసులోన పెల్లుబికే దు:ఖాలను ఆపలేము ||
జలనిధిలో ఎగసిపడే కెరటాలను ఆపలేము ||
గుండెలోన దిగులుమబ్బు కనులజారు చినుకులెన్నొ
కంటిలోన ఉబికివొచ్చు రోదనలను ఆపలేము ||
ఎన్నెన్నో వేదనలను ఏమార్చును సంతసాలు
తెలియకుండ ఎదురువచ్చు కష్టాలను ఆపలేము ||
మనసుతడితొ మౌనంగా జ్ఞాపకాలు మాట్లాడెను
ఊరడించి ఊతమిచ్చు కవనాలను ఆపలేము ||
అక్షరాల వనములోన విహరిస్తూ కలమునౌతు
మదిచెప్పే మౌనభాష భావాలను ఆపలేము ||
చీకటంత చిందిపడెను చిరునవ్వును తరిమేసెను
దారిచూపు ధైర్యమిచ్చు కిరాణాలను ఆపలేము ||
మౌనవాణి పెదవిమాటు వెలివేయని ఆవేదన
చెమ్మగిల్లి చూపులలో తాపాలను ఆపలేము ||
కనుపాపల కలలన్నీ కన్నీటిలొ కలగలసిన
ఆశపడే రేపటిలో వేకువలను ఆపలేము
గాయపడ్డ గుండెలే నిశబ్దంగ మిగిలిపోయి
చెమరించే కన్నులలో శోకాలను ఆపలేము
గెలుచుకున్న ఆశయాలు సంతృప్తిని సాధించెను
నిదురించే మనసుల్లో స్వప్నాలను ఆపలేము
....వాణి , 4 jan 16
గజల్ మహల్ ...
మదిదోచిన మరందాల పువ్వులెన్నొ ఆనవ్వులొ ||
అందమైన అపురూపపు కాంతులెన్నొ ఆనవ్వులొ ||
మధురభావ సంతకాలు మల్లెపూల దరహాసం
నాట్యమాడు ముంగురులతొ సోగసులెన్నొ ఆనవ్వులొ ||
వికసించే సౌందర్యం ప్రకృతినే తలదన్నెను
మాటాడని అతిశయాల కధలెన్నో ఆనవ్వులొ ||
నీలికురుల విన్యాసం నిలిచిపోయె చూపులన్ని
కనురెప్పలు కదలాడని ఆశలెన్నొ ఆనవ్వులొ ||
ప్రకృతితో మాటాడుతు తియ్యనైన పులకింతలు
ఊహలలో విహరిస్తూ సిగ్గులెన్నొ ఆనవ్వులొ ||
మురుస్తున్న మౌనంలో నడయాడే కలలెన్నో
సూర్యకాంతి స్పర్సలతో మెరుపులెన్నొ ఆనవ్వులొ ||
………..వాణి , 6 feb 16

గుండెకైన గాయాలను తొలగనివ్వు కాస్తయినా ||
మనసుతడికి మరుపుమందు అద్దనివ్వు కాస్తయినా ||
నిట్టూర్పుల నవ్వులన్ని నన్నుగేలి చేస్తున్నవి
వెలుగుపూల రంగుల్లో తడవనివ్వు కాస్తయినా ||
మౌనంతో పోరాటం మాటలెన్నొ చల్లాలని
నీ రాగం లాలనలో మురవనివ్వు కాస్తయినా ||
జ్ఞాపకమై ఉలికిపడ్డ మెలిపెట్టే దృశ్యమేదొ
ఆనవాళ్ళు చీకటిలో చుట్టనివ్వు కాస్తయినా ||
విషాదాన్ని మోస్తున్నది కలలుకన్న సామ్రాజ్యం
సంతసాల కానుకలను గెలవనివ్వు కాస్తయినా ||
ఎడారంటి మనసులోన కనులుమోయు సంద్రాలు
మౌనవాణి గుండెబరువు దించనివ్వు కాస్తయినా ||
.....వాణి, 16 feb16
అమ్శకంటే ప్రేమపంచే మనసుఎక్కడ జగతిలోన ||
అవనికన్నా వరములిచ్చే తావుఎక్కడ జగతిలోన ||
కాలదీపం వెలుగునివ్వదు విధిఆడెలే వింతనాటకం
కాంతినిండని మనసులెన్నో ప్రేమలెక్కడ జగతిలోన ||
అందమైనా ఆశలెన్నో ఆటుపోటుల బతుకులెన్నో
కలతమనసుల కలవరాలకు తోడుఎక్కడ జగతిలోన ||
ఆశలన్నీ అలసిపోయెను నవ్వులెన్నో చిన్నబోతూ
మధురస్వప్నం మనసుగెలిచే సౌఖ్యమెక్కడ జగతిలోన ||
గుండెచూపుకు దృష్టిదోషం చీకటింట్లో తడుముకుంటూ
జీవితాలే నటనలైతే వెన్నెలెక్కడ జగతిలోన ||
మానవత్వం మౌనమౌతూ లోకమంతా వట్టిపోగా
విషముచిమ్ముతు మలినమనసులు శాంతిఎక్కడ జగతిలోన ||
గాయపడ్డవి గుండెలెన్నో గతముమోసే గాధలెన్నో
వెన్నుదన్నుగ సహకరించే మమతలెక్కడ జగతిలోన ||
........వాణి, 19 feb 16
ముషాయిరా గజల్............
మనసుకైన గాయాలను మాన్పుటెంత కష్టమో ||
కలతలోన కన్నీటిని దాటుటెంత కష్టమో ||
ఇంకిపోయి కలలన్నీకరుణచూపుతున్నాయి
విరిగిపోయి మానసాన్నికూర్చుటెంత కష్టమో ||
తలరాతకు తలవంచక తప్పదులే జీవితము
విధిరాతను ఎదురురీది గెలుచుటెంత కష్టమో ||
హద్దులేని ఆశలెన్నొ మదిని పలుకరిస్తాయి
నిజములోన స్వప్నాలను నెగ్గుటెంత కష్టమో ||
నిదురించని రాత్రిలోన మౌనంతొ పోరాటం
కునుకులేక మనసుబాధ మరచుటెంత కష్టమో ||
ఊహించని ఉప్పెనలే సంద్రంలో కల్లోలం
ప్రకృతమ్మ ఆగ్రహాన్నిఎరుగుటెంత కష్టమో ||
మనసుతడికి మూగతనపు ముసుగుకప్పుకున్నాక
మౌనవాణి భావాలను పలుకుటెంత కష్టమో ||
తిమిరాలే తోడుతాయి ఙ్ఞాపకాల గాయాలు
ఊపిరిచ్చు ఉషోదయం నిలుపుటెంత కష్టమో ||
రెప్పచాటు దుఃఖంలో మోయలేని భారాలు
కంటికుండ ఒలకనీక దాచుటెంత కష్టమో ||
ఓగెలుపుల ఆనందం మౌనంగా మరలింది
తడుస్తున్న చీకటిలో మసలుటెంత కష్టమో
..........వాణి,25 feb 16
గజల్ మహల్ ....
నీటిలోన రాతలేల చెప్పవేమి నెచ్చెలి ॥
నీ ముసిముసి నవ్వులలో మర్మమేమి నెచ్చెలి ॥
నీ బుగ్గన విరబూసిన సిగ్గులెన్నొ చూస్తున్న
తొలిపరిచయ స్పందనాల వివరమేమి నెచ్చెలి ॥
కలలరాజు చూపులతో దోచుకున్న దేమిటో
కంటి ఇంటి ముచ్చటలో కధనమేమి నెచ్చెలి ॥
నీ అందం నీ చరితము మనసుదోచు కున్నాయ
మౌనంతో నీ వాణీ విప్పవేమి నెచ్చెలి ॥
నిన్నటిలో ఉత్సాహం నీ నడతలు చెపుతూ
ఏడడుగులు నడచురోజు ఎప్పుడేమి నెచ్చెలి ॥
నీ పెదవుల చిరునగవులొ పలుకులెన్ని దాచావొ
కేరింతల మౌక్తికాలు విసరవేమి నెచ్చెలి ॥
........... వాణి, 28 feb16
గజల్ కాన్వాస్.....
నింగినుండి తనచూపులు దిగివచ్చెను నా కోసం ||
కనుపాపకు ఓదార్పును అందించెను నా కోసం ||
కన్నీటి సముద్రంలొ బ్రతుకునావ మోస్తున్నా
తెరచాపగ తనప్రేమను అర్పించెను నాకోసం||
చుక్కల్లో తనజాడను ఎంచలేని దుఃఖాలే
తననీడతొ దారిచూప కదిలొచ్చెను నాకోసం||
కలతమనసు ఈదలేక ఉప్పెనలతొ వేగలేక
తనమనసే నా ఊహలొ జన్మించెను నాకోసం ||
చేరలేని దూరమౌతు భారమాయె జీవనం
కనిపించని దేవతగా తరలొచ్చెను నా కోసం ||
తనఉనికిని తెలియజేయు ప్రక్రుతిచ్చు సంకేతం
మౌనంగా తనవాణీ వినిపించెను నాకోసం||
చిరుగాలుల సందోహం తనమమతల మాధుర్యం
ఓ సమీర తరంగమై ప్రభవించెను నాకోసం||
.......వాణి ,1 march 16
తప్పిపోయి నీ జాడలు వెతుకుతూనె ఉన్నాను ||
ఎదురుచూపు కన్నీళ్ళను చల్లుతూనె ఉన్నాను ||
కంటిమీద గుండెబాధ చెరపలేని గాయమై
జ్ఞాపకాల మరకలన్ని తడుముతూనె ఉన్నాను ||
మదిలోతుల అలజడులే రెప్పలపై చప్పుడులె
చీకటిలో అక్షరాలు చెక్కుతూనె ఉన్నాను ||
మౌనమంత కవనమౌతు వికసించే కెరటమై
తడుపుతున్న కాగితాన్ని నిమురుతూనె ఉన్నాను ||
కనులకడలి పొంగుతూ కాంతి గీతి పాడనా
మదిఘోషకి మరపుమందు పులుముతూనె ఉన్నాను ||
చెమరించే మువ్వలన్ని చెక్కిలిపై చిట్లిపడ
చెంపలపై చారికలను చెరుపుతూనె ఉన్నాను ||
గుండెల్లో దిగులుముళ్ళు గుచ్చుతున్న ఆనవాళ్ళు
మౌనంతో అనునయాలు అద్దుతూనె ఉన్నాను ||
కవిత్వమే ప్రియమవుతు అక్షరమై ప్రవహిస్తు
భావంలో మాలికగా ఒదుగుతూనె ఉన్నాను ||
విసుక్కునే హృదయంతొ ఒంటరైన చూపులలొ
నటియించే నవ్వులనీ తొడుగుతూనె ఉన్నాను ||
........వాణి, 2 మార్చ్16
స్త్రీ మూర్తిని సాహసిగా నిలుపుతున్న వారెవరో ॥
పువ్వువంటె నువ్వేనని పొగడుతున్న వారెవరో ॥
అతివంటే సహనమనీ అవనివంటి ఓర్పుఅనీ
నిగ్రహాన్ని పరీక్షించి నెగ్గుతున్న వారెవరో ॥
సాటిలేని మగువఘనత రాతలకే పరిమితమా
తొలగిపోని వివక్షలతొ తొక్కుతున్న వారెవరో ॥
అమ్మఅంటె కమ్మననీ ప్రతిజీవికి తెలుసుకదా
ఆడదంటు అణచివేస్తు నలుపుతున్న వారెవరో ॥
కధనంలో ధీరత్వం వదనంలో సౌమ్యమై
తనదైన ఘనకీర్తి మెచ్చుతున్న వారెవరో ॥
ఇంటిలోన మింటిలోన శ్రమకే స్రవంతికద
విలువివ్వక నిందలెన్నొ మోపుతున్న వారెవరో ॥
అందమైన అణకువైన నీకేలే సొంతమంటు
బేలవంటు భారాలను రుద్దుతున్న వారెవరో ॥
ఏడాదికి ఒక్కరోజు ఎందుకులే ప్రత్యేకం
అంకురాల ఆత్మఘోష ఆపుతున్న వారెవరో ॥

.......... వాణి , 4 march 16
గజల్ మహల్ .......
జ్ఞాపకాల పూదోటలొ విరియాలని ఉన్నది ॥
నాటిలోకి నడచివెళ్ళి మురవాలని ఉన్నది ॥
గుర్తులలో కురుస్తున్న మెరుస్తున్న దృశ్యాలు
స్నేహమైన పునాదులను తడమాలని ఉన్నది ॥
ఆత్మీయపు ఆలింగన సంతకాల సేకరణ
అద్భుతాల అనుభూతులు చేదాలని ఉన్నది ॥
చిన్నచిన్న అలుకలతో మూతివిరుపు మౌనాలు
చిరునవ్వుల చిరునామా వెతకాలని ఉన్నది ॥
చెట్లపైన చెక్కుకున్న చెరిగిపోని గుర్తులు
విఙ్ఞానపు కోవెలలో గడపాలని ఉన్నది ॥
అనుభవాల ప్రయాణాలు భవితవెతకు బాటల్లో
నేస్తాలతొ గెలుపురుచులు పంచాలని ఉన్నది ॥
....... వాణి , 6 march 16
గజల్ కాన్వాస్ ....... 49
నింగికురవని నీటితుంపర మబ్బుతునకగ మారిపోనా  
అవనితడుపుతు వరములిచ్చే మేఘమాలగ మారిపోనా
భూమితల్లికి గుండెఎండగ పగిలిపొయెను బీడువారుతు 
ఆర్తి తీరగ తడిసిమురిసే మమతవానగ మారిపోనా
చెట్టు పుట్టలు జీవజాతులు దు:ఖనీటిని తాగుతుంటే 
తరులవిరులకు సిరులునింపే చెలిమివానగ మారిపోనా
ప్రకృతిఅంతా అలుకబూనుతు ఎండమావిగ మారిపోతే 
పలుకరించగ మట్టి మధురత నీటిచుక్కగ మారిపోనా
తల్లడిల్లెను తరువులన్నీ గ్రీష్మతాపం ఓపలేకనె 
పూలువిరియగ పుడమితల్లిపై తేనెసోనగ మారిపోనా
పండుటాకులు ఎండిరాలుతు పొగిలిఏడ్చెను తేమకోసం 
దప్పితీరగ ధరణిమాతకు మంచువానగ మారిపోనా

..........వాణి , 17 march 16
గజల్ కాన్వాస్ .... 48
మౌనాలు మదిలోకి పిలిచాయి చూడు ॥
గుండెల్లొ గురుతుల్ని తడిమాయి చూడు ॥
బాధలే నీవెంట నడిచొస్తు ఉంటే
చిరునవ్వు దీవెనలు మరిచాయి చూడు ॥
ఆశలే ఆకులై రాలుతూ ఉన్నా
నిశలన్ని నీ వెనుక తరలాయి చూడు ॥
తదిమనసు తపనతో తరలేది ఎటకో
చినుకులే నీ వెంట నడిచాయి చూడు ॥
రాలాయి కన్నీళ్ళు ఎందుకో ఏమో
జల్లుల్లొ ఆ తడులు కలిశాయి చూడు
దూరంగ ఓ తళుకు రమ్మంటు పిలిచె
దారంత మిణుకుల్ని పరిచాయి చూడు ॥
నిశబ్దం చీల్చింది ఓ చినుకు వాణి
నవ్వులే వర్షంలో రాలాయి చూడు ॥
కన్నీటి తరగలతొ చెలిమెంత సేపు
ఓప్రేమ తెమ్మెరలు వీచాయి చూడు॥
నీ నడక తడబాటు నగుబాటు కాక
పరికించు పాదాలు తడిమాయి చూడు ॥
ఎంతెంత దూరమో సాగిపోతున్నా
గమ్యాలు నీ దరికి చేరాయి చూడు ॥
.............వాణి ,8 march 16
నీ స్మృతుల సిరులతోన ముడిపడుతూ ఉంటానూ ||
అనుభవాల కాలానికి ఋణపడుతూ ఉంటానూ ||
అద్దంలో నా రూపం కలవరాలు ప్రకటిస్తె
విరిగికపోయి మనసంతా వ్యధపడుతూ ఉంటానూ ||
నవ్వుతున్న నీ రూపం స్వప్నంలో స్పర్శిస్తూ
చెంతనుంది నువ్వేనని భ్రమపడుతూ ఉంటానూ ||
చిరునవ్వుల దీవెనలకు చిందిపడ్డ భాష్పాలు
దు:ఖముతో సంతసమై తడపడుతూ ఉంటానూ ||
తడుస్తున్న చీకటిలో దారితప్పి వెతుకుతూ
ఊపిరిచ్చు వేకువకై పరిగెడుతూ ఉంటానూ ||
నీ ఊహలొ విహరిస్తూ మురవాలని ఆరాటం
మౌనంతో మానసాన్ని జోకొడుతూ ఉంటానూ ||
ఙ్ఞాపకాల గాయాలే గేయాలై ప్రవహించెను
మౌనాలతొ భావాలతొ తలపడుతూ ఉంటానూ ||
........వాణి, 11 march 16
గజల్ మహల్ ....
అతడే నా ప్రాణమనే గుట్టునెలా విప్పాలి ||
నా మదినే దోచుకున్న ప్రేమనెలా చెప్పాలి ||
అవాంతారాలెన్నో అడుగడుగున ఎదురైతే
తనుఅంటే నేనేనని మౌనమెలా వీడాలి ||
సెలయేటికి తెలుసుకదా మా మమతల స్నేహకద
అలనాటి ప్రమాణాల సాక్ష్యమెలా చూపాలి ||
ఆ తరువుల నీడలోన ఒట్టువేసి వెళ్ళెకద
బంధాలను వీడలేను ఆంక్షలెలా దాటాలి ||
ప్రణయాల కధనాలు సమీరమే మోస్తుంటె
తనఅడుగుతొ నా అడుగులు కలిపిఎలా నడవాలి ||
చినుకులే రాల్చాయట చిరునవ్వుల తలంబ్రాలు
ప్రకృతివే ఆశీస్సులు ఋరుజువునెలా గెలవాలి ||
అలవిసిరిన తుంపరలే అక్షింతలు అనుకుంటు
మూగబోయె మా మనసులు దీవెనెలా కోరాలి ||
ముషాయిరా గజల్ ....
మదినసలిపే వేదనంతా తొలగుతుంటే మేలుకాదా ॥
నవ్వుకుంటూ కాలమంతా నడుస్తుంటే మేలుకాదా ॥
మాసిపోయిన మధురస్వప్నం మనసుతడిగా మిగిలిపోతే
కంటితడిలో కలతకలలే చెమరుతుంటే మేలుకాదా ॥
కంటిముందర కదులుతున్నది గుండెనలిపే ఘటనఒక్కటి
చెరిగిపోనిది మధురమౌతూ తలచుతుంటే మేలుకాదా ॥
మౌనవాణియ పెదవిదాటక ఓర్పుగానే మిన్నకుండెను
గుండెలోతుల గాధలన్నీ విప్పుతుంటే మేలుకాదా ॥
సందిగ్దపు స్పర్దలెన్నో చంచలముగా మిగులుతుంటే
తామరాకున నీటిబొట్టుగ మసలుతుంటే మేలుకాదా ॥
కొంతప్రేమ కొన్నినవ్వులు బ్రతుకుఅంతా గడిచిపొనీ
చివరిమజిలీ భారమవ్వక ముగుస్తుంటే మేలుకాదా ॥
........వాణి ,18 march 16
గజల్ మహల్......
పరిగెట్టే పసితనాలు అందలేక పోతున్నా||
చిన్ననాటి తీపిచెలిమి చేరలేక పోతున్నా||
నా గదిలో పిచికగూడు నాకోసం వెతికిందట
ఆ కిచకిచ సవ్వడులను చూడలేక పోతున్నా||
పెరటిలోన గులాబీలు విరగపూసి ఉన్నాయట
ఆ అందం ఆనందం గెలవలేక పోతున్నా||
ప్రక్కఇంటి జామచెట్టు మాగోడపై ఒరిగిందట
కొమ్మనిండ పళ్ళెన్నో తెంపలేక పోతున్నా||
కృష్ణానది తీరంలో గవ్వలన్ని పిలిచాయట
కబురంపిన నేస్తాలను కలువలేక పోతున్నా||
పంజరంలొ చిలుకకూడ మాటలెన్నొ నేర్చిందట
ఓ వాణీ అంటున్నా పలుకలేక పోతున్నా||
కళాశాల చదువుల్లో బతుకుబాట వెలగాలీ
మాఊరిని మావీధిని మరువలేక పోతున్నా||
......వాణి, 20 march16
నిన్నల్లో ఓడుతూ మరలేటి వేదన
గాయమే గెలుపుగా మిగిలేటి వేదన ||
నేడంత చెలిమిగా మారింది చూడు
అనుభవం గురుతుల్లొ మోసేటి వేదన ||
దు:ఖమే నాడెంత నవ్విందొ తెలుసా
గతమౌతు మౌనమై మెదిలేటి వేదన ||
ఆశంత అశ్రువై భావమే సాధన
నిరాశనే నవ్వుతో తొలిచేటి వేదన ||
గుండెల్లో ఘాటుగా తాకింది బాదే
కన్నీళ్ళ అమృతం తాగేటి వేదన ||
అలకెంత కోరికో తీరాన్ని తాకగా
పొరాట పటిమతో నడిచేటి వేదన ||
భావమే బ్రతుకుగా సాగుతూ వున్నది
కన్నీటి గీతాలు పాడేటి వేదన ||
వెలుగుల్ని చీకటే దాచింది అప్పుడు
నమ్మకం నెగ్గుతూ సాగేటి వేదన ||
ఎదలోతు అలజడే అందాల గేయము
కావ్యాల పుటలలో నిలచేటి వేదన ||
చింతలో చినుకుల్ని రాల్చింది మనసే
ఓ వాణి మదిలోన తొలచేటి వేదన ||
......వాణి, 21 march 16
గజల్ కాన్వాస్ ....50
ఎదురుచూపు కన్నీళ్ళే తాగాయీ ఆ కన్నులు ||
కనురెప్పలు కదలాడక వెతికాయీ ఆ కన్నులు ||
తడితలపుల ఆనవాళ్ళు వీడిపోని జ్ఞాపకాలు
చీకటిలో వెలుతురులో తడిమాయీ ఆ కన్నులు ||
గతాలలో అనుభూతులు మదినివీడి పోకున్నవి
అవధిలేని నిరీక్షణలొ గడిపాయీ ఆ కన్నులు ||
తెరచుంచిన కనుపాపకు వేచిచూచు వేదనలే
ఎడబాటుల క్షణాలలో నిలచాయీ ఆ కన్నులు ||
నిట్టూర్పుకు ఓదార్పులు ఇంకిపోని తడిజాడలు
నిలదీసే నిమిషాలను నిలిపాయీ ఆ కన్నులు ||
కరుగుతున్న కాలముపై కన్నీటివి సంతకాలు
మౌనవాణి మనసుదోచి మిగిలాయి ఆ కన్నులు ||
........వాణి,21 March 16
నీటిసుడులను మనసుమడిలో దాచుకుంటిని ఇంతకాలం ||
ఙ్ఞాననేత్రం మూసుకొంటే తడుముకుంటిని ఇంతకాలం ||

మౌనవాణియ మూగబోయెను తంత్రితెగిన వీణవోలే
నొప్పిఎంత సలుపుతున్నా ఓర్చుకుంటిని ఇంతకాలం ||

పట్టుతప్పిన క్షణాలెన్నో కనులనిండిన వెతలనీరే
చమురులేని వత్తివోలే వెలుగుతుంటిని ఇంతకాలం ||

ఆశనడపిన కాలమేదో వెనుకనిలచెను బరువుగానే
మౌనకధలను హృదయతడితొ పేర్చుకుంటిని ఇంతకాలం ||

అడుగుపెట్టిన అశ్రునీడలు నిశలునింపుతు నిలచివుండెను
ఎన్నిఅనుభవరాతలో మరి చేర్చుకుంటిని ఇంతకాలం ||

తరలిపోయెను కాలగతిలో తపనపడ్డ ఆశలెన్నో
కొత్తఉదయం కొంతకోరిక గడుపుతుంటిని ఇంతకాలం ||

భావజగతిలో పరుగుపెట్టే నడకలెన్నో నేర్చుకుంటూ
గతంనిలిపిన గాధలన్నీ కూర్చుకుంటిని ఇంతకాలం ||

.......వాణి, 23 march 16
నీ స్వరముల లాలనలో ఒదగాలని ఉంది ||
నీ పాటలో రాగంగా ఇమడాలని ఉంది ||

నీ చూపుతొ మనసుకలిపి పరవశమై పోతూ
నీ మమతల మధువులనే గ్రోలాలని ఉంది ||

నీ నడకలొ అడుగుకలిపి శాశ్వతమై నిలిచి
నీ ప్రణయ కుసుమంలా మిగలాలని ఉంది||

నీ అనురాగ వర్షాలు చంద్రకాంతి జలపాతం
సిరివెన్నెల జల్లులలో తడవాలని ఉంది ||

తిమిరాలను తరిమేస్తూ కౌముదినే పలికిస్తు
నీ స్పర్శల తుంపరలో మురవాలని ఉంది ||

.........వాణి, 25 March 16
కాంతివిలువ తెలిసేందుకు మెరుపొక్కటి చాలదా ||
కన్నీళ్ళను తుడిచెెందుకు మమతొక్కటి చాలదా ||

చెరిగిపోయి రంగులకల ముడివేసిన నవ్వులతెర
ఆశయాలు గెలిచేందుకు ఆశొక్కటి చాలదా ||

మూసుకున్న చూపులలో వేలాడే ఊహలెన్నొ
వెన్నెలలే నింపేందుకు స్పర్శొక్కటి చాలదా ||

నిస్సహాయ క్షణాలెన్నొ మౌనాలే ఓదార్చుతు
కన్నీటికి నిందెందుకు విలువొక్కటి చాలదా ||

చీకటులే చుట్టుకుని ఆలోచన చుట్టుముట్టి
చిక్కుముడులు విప్పేందుకు తోడొక్కటి చాలదా ||

మౌనవాణి మనసుచెప్పు అందమైన ఆవేదన
మౌనాలను చీల్చెందుకు మాటొక్కటి చాలదా ||

విషాదాలు రాల్చుకున్నచుక్కలెన్నొ చెక్కిలిపై
ఆ. వేదన మరిచెందుకు ప్రేమొక్కటి చాలదా ||

రాలిపోయి పువ్వులెన్నొ గాయపడ్డ గుండెలెన్నొ
చిరునవ్వులు పంచెందుకు మనసొక్కటి చాలదా ||

యాంత్రికమే జీవితాలు నటనగానె ఆప్యాయత
అపార్ధాలు తొలగెందుకు పలుకొక్కటి చాలదా ||
పరిగెట్టే హాసాలకు గాలమెవరు వేస్తారూ ॥
సలుపుతున్న వేదనలకు సంకెలెవరు వేస్తారూ ॥

ఇంకిపోయి కునుకంతా తిమిరంలో తచ్చాడెను
పీడించే రాత్రములకు పానుపెవరు వేస్తారూ ॥

కరుగుతున్న క్షణాలన్ని కలవరాలు ప్రకటిస్తే
జ్ఞాపకాల ప్రతిమలకు ముసుగులెవరు వేస్తారూ ॥

గతమైనా కాలమంత గుండె నొదలి పోలేదు
ఆగిపోని అశ్రువులకు తాళమెవరు వేస్తారూ ॥

తపనపడ్డ ఆశలెన్నొ దు:ఖాలను మింగాయి
నలుగుతున్న స్వప్నాలకు రంగులెవరు వేస్తారూ ॥

తడిమనసుతొ తల్లడిల్లి నా వాణీ మూగబోయె
గండిపడ్డ కన్నులకు వంతెనెవరు వేస్తారూ ॥

..వాణి, 28 march 16
ఇడుములలో స్నేహముతో నడిపించుట తెలియాలీ ||
దరహాసం పెదవులపై కురిపించుట తెలియాలీ ||

తల్లడిల్లె తడిచుక్కలు తలగడనే తడుముతూ
అలజడులలొ తమకుతాము సవరించుట తెలియాలీ ||

మౌనమెంత మేలుకదా ఓపలేక జాలిచూపు
గాయపడ్డ గుండెనైన గెలిపించుట తెలియాలీ ||

స్వాగతాలు పలకాలిక కొత్తదనపు జీవితం
కలవరాల కాలాలను తొలగించుట తెలియాలీ ||

ఙ్ఞాపకాలు మరుగవనివి వేదనలో లాలనలో
మదనపడ్డ క్షణాలన్ని మరిపించుట తెలియాలీ ||

ఆవేదనొ అతిశయమో భిన్నమైన భావనమూ
నొప్పించే నిందలనే ఎదిరించుట తెలియాలీ ||

మౌనాన్ని మోస్తున్నది పెదవంచున నా వాణీ
మదిభావం అక్షరములొ ఒలికించుట తెలియాలీ ||

నిట్టూర్పుల నిరీక్షణలు వడలిన నా వదనములో
నడచివొచ్చు అద్భుతాన్ని వరియించుట తెలియాలీ ||

........వాణి, 4 march 16
గజల్ మహల్.....

చిరునవ్వులు చిరుజల్లుగ కురవాలని ఆరాటం ||
ఆహ్లాదం హరివిల్లుగ విరియాలని ఆరాటం ||

పదిలమైన నా భావం పెదవులతో చెప్పలేను
అక్షరముతొ నీ మదిలో మెరవాలని ఆరాటం ||

చూపువెతకు ఆశలెన్నొ హృదినిండిన తలపులెన్నొ
బతుకంతా నీ గుండెలొ ఒదగాలని ఆరాటం ||

నివేదించు విన్నపాలు కధలెన్నో అల్లుకుంటు
మది వేదిక నాదౌతూ నిలవాలని ఆరాటం ||

మౌనవాణి మనసుచెప్పు కనుకదలిక సందేశం
దరిచేరగ సంకోచము వీడాలని ఆరాటం ||

అలుపెరగని తపనెంతో తనజతగా నడవాలని
సంగమమే నా కోరిక తీరాలని ఆరాటం ||

...........వాణి, 4 April 16
బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షిక - Vani Venkat గారి గజల్ కి నా చిత్రం.
విరహపు పూదోటలో పూబంతివి నీవేగా
నా తలపుల మైమరపుల సీమంతివి నీవేగా
మూసివున్న కన్నులతో నీ ఊహలో నేనుంటే
కౌగిలిలో హత్తుకున్న చేమంతివి నీవేగా
ఏకాంతపు నాకలలకు ఊపిరులే పోస్తుంటే
ప్రేమలతో పరవశింపు కలహంసివి నీవేగా
మిన్నంటే నీప్రేమే ఆలంబన అవుతుంటే
నామదిలో కొలువుండే లలితాంగివి నీవేగా
తొలిచూపులో మదిచేరిన నీకోసమే పలవరింత
మధుర’వాణి’ వినిపించే కలకంఠివి నీవేగా
(వాణీ వెంకట్ గారి గజల్ – గజల్ సుమాలు పుస్తకం నుండి సేకరణ
Sketch : Ponnada Murty, Image creation : Rani Reddy)