Wednesday, 6 April 2016

నీటిసుడులను మనసుమడిలో దాచుకుంటిని ఇంతకాలం ||
ఙ్ఞాననేత్రం మూసుకొంటే తడుముకుంటిని ఇంతకాలం ||

మౌనవాణియ మూగబోయెను తంత్రితెగిన వీణవోలే
నొప్పిఎంత సలుపుతున్నా ఓర్చుకుంటిని ఇంతకాలం ||

పట్టుతప్పిన క్షణాలెన్నో కనులనిండిన వెతలనీరే
చమురులేని వత్తివోలే వెలుగుతుంటిని ఇంతకాలం ||

ఆశనడపిన కాలమేదో వెనుకనిలచెను బరువుగానే
మౌనకధలను హృదయతడితొ పేర్చుకుంటిని ఇంతకాలం ||

అడుగుపెట్టిన అశ్రునీడలు నిశలునింపుతు నిలచివుండెను
ఎన్నిఅనుభవరాతలో మరి చేర్చుకుంటిని ఇంతకాలం ||

తరలిపోయెను కాలగతిలో తపనపడ్డ ఆశలెన్నో
కొత్తఉదయం కొంతకోరిక గడుపుతుంటిని ఇంతకాలం ||

భావజగతిలో పరుగుపెట్టే నడకలెన్నో నేర్చుకుంటూ
గతంనిలిపిన గాధలన్నీ కూర్చుకుంటిని ఇంతకాలం ||

.......వాణి, 23 march 16

No comments:

Post a Comment