Wednesday, 6 April 2016

కాంతివిలువ తెలిసేందుకు మెరుపొక్కటి చాలదా ||
కన్నీళ్ళను తుడిచెెందుకు మమతొక్కటి చాలదా ||

చెరిగిపోయి రంగులకల ముడివేసిన నవ్వులతెర
ఆశయాలు గెలిచేందుకు ఆశొక్కటి చాలదా ||

మూసుకున్న చూపులలో వేలాడే ఊహలెన్నొ
వెన్నెలలే నింపేందుకు స్పర్శొక్కటి చాలదా ||

నిస్సహాయ క్షణాలెన్నొ మౌనాలే ఓదార్చుతు
కన్నీటికి నిందెందుకు విలువొక్కటి చాలదా ||

చీకటులే చుట్టుకుని ఆలోచన చుట్టుముట్టి
చిక్కుముడులు విప్పేందుకు తోడొక్కటి చాలదా ||

మౌనవాణి మనసుచెప్పు అందమైన ఆవేదన
మౌనాలను చీల్చెందుకు మాటొక్కటి చాలదా ||

విషాదాలు రాల్చుకున్నచుక్కలెన్నొ చెక్కిలిపై
ఆ. వేదన మరిచెందుకు ప్రేమొక్కటి చాలదా ||

రాలిపోయి పువ్వులెన్నొ గాయపడ్డ గుండెలెన్నొ
చిరునవ్వులు పంచెందుకు మనసొక్కటి చాలదా ||

యాంత్రికమే జీవితాలు నటనగానె ఆప్యాయత
అపార్ధాలు తొలగెందుకు పలుకొక్కటి చాలదా ||

No comments:

Post a Comment