Friday, 25 November 2016

మనసుగీసే చిత్రమే అది మారనీయకు నేస్తమా ||
చెలిమి పువ్వుల పరిమళాలను వాడనీయకు నేస్తమా ||

చీకటెంతగ తరుముతున్నా వెలుగువైపుకు తరలిపో
దూరమెంతటి భారమైనా నిలువనీయకు నేస్తమా ||

మమతలద్దుకు పెనవేసుకో అందమైనది జీవితం
ప్రేమ పంచే మధురకాంక్షను చెరగనీయకు నేస్తమా ||

నిన్నలన్నీ సమసిపోవవి గుండెలోనె నిలిచిపోతు
ఆత్మపయనం నిత్యమైనా చేరనీయకు నేస్తమా ||

బ్రతుకుయానం పోరాటమైనా సాగిపోవక తప్పదు
నిందవేసే సావాసమైతె దారినీయకు నేస్తమా ||

ఘాటైనది గాయమేదో తడితలపులన్నీ నిధులుగా
మౌనవాణి మదినలోతులు విప్పనీయకు నేస్తమా ||

......వాణి, 25 Nov 16, 

Tuesday, 8 November 2016

దుఃఖాలకు తెరతీసే మౌనాలని కోరుకోను ||
కన్నీళ్ళే వర్షమైతె తడవాలని కోరుకోను ||
.
సంతోషపు సామ్రాజ్యం ఏలాలని ఉందినాకు
వేదనలకు స్వాగతాలు పలకాలని కోరుకోను ||
.
కష్టాలను ఇష్టంగా రమ్మంటూ పిలవాలా
జీవితాన్ని చీకటితో నింపాలని కోరుకోను ||
.
జాలిలేని ఆ దేవుడు శిక్షలెన్నొ వేస్తుంటే
విధిరాతకు తలవంచుతు బతకాలని కోరుకోను ||
.
మధురమైన భావాలను మౌనవాణి గెలవాలీ
శాంతిలేని అడుగులతో సాగాలని కోరుకోను ||
.
నిశ్శబ్దం బద్దలైతె మాధుర్యపు రాగాలే
స్వప్నాలకు వీడుకోలు చెప్పాలని కోరుకోను ||
.
వాణి, 6 August 16
నవ్వుల సవ్వడి మనసును తాకే వెన్నెల ధారా ||
బీడుగ మారిన మదిలో కురిసే వెన్నెల ధారా ||
.
నిలిచిన నీడలు కాంతులవైపుకు తరలే సమయం
మౌనం ఓడుతు వాణిని గెలిచే వెన్నెల ధారా ||
.
కన్నుల ముందుకు చూపులు వెతకని ఆశ్చర్యాలే
ఊహల తెమ్మెర బొమ్మై నిలిచే వెన్నెల ధారా ||
.
నడిచే దారికి వెలుగుపువ్వులే స్వాగత మన్నవి
నిశలే చేరని హాసం చిలికే వెన్నెల ధారా ||
.
వేదన మనసే సుఖాల తీరం చేరిందిపుడే
ఆశలు శిఖరం అంచున కులికే వెన్నెల ధారా ||
.
చినుకులు తడిపితె ఙ్ఞాపకమౌతు బాల్యపు తళుకులు
తియ్యని భావం కవితై ఒలికే వెన్నెల ధారా ||
.
.......వాణి, 7 August 16


గజల్ .........
.
మమతలనిధి అమ్మఒడి మెప్పించుట సులువుకదా ||
తల్లిస్పర్శ తాకగానె నిదురించుట సులువుకదా ||
.
గుండెలోతు గాయమొకటి మౌనానికి భారమైతె
ఆత్మీయత హత్తుకుంటె ఓదార్చుట సులువుకదా ||
.
చీకటిలో చెరపలేని చిందించే కన్నీళ్ళు
వేకువిచ్చు వెలుగులతో తొలగించుట సులువుకదా ||
.
మమకారం వర్షిస్తే అలవికాని ఆనందం
తన్నుకొచ్చు దుఃఖాలను తరలించుట సులువుకదా ||
.
పెదవిదాటి రానిమాట ప్రకటించే భావమేమి
నిశ్శబ్దం నిగ్గుతేల్చి పలికించుట సులవుకదా ||
.
తీరాలను తాకాలని అలలకెంత ఆరాటం
సాధననే స్వాగతించి సాగుతుంటె సులువుకదా
.
దయలేనిది కాలమైన దాటిపోక తప్పదుగా
నమ్మకాన్ని నమ్ముకుంటె సాధించుట సులువుకదా ||
.
......వాణి, 13 August 16
||సైనికులు ||
.
మౌనంలో ఆవేశం సైనికునికి సొంతము ||
గాయమైన గాంభీర్యం సైనికునికి సాధ్యము ||
.
నియంత్రణ రేఖదాటి దాడిచేయు ముష్కరులు
గాయపడ్డ గురిపెట్టుట సైనికునికి శౌర్యము ||
.
తలనిమిరే కన్నప్రేమ కావాలనిపించినా
అదుపుచేయు నిబ్బరమే సైనికునికి శక్యము ||
.
నాన్నంటే ప్రేమపంచు నిరూపించ ఆరాటం
దేశాన్నీ రక్షించుట సైనికునికి సంభవము ||
.
మమకారము ఒలకలేని పేదమనసు వారిదిలే
బలవంతపు కఠినత్వం సైనికునికి అవశ్యము ||
.
పగలైనా రేతిరైనా ఓకటేగా వారికీ
మేల్కొల్పుల జాగ్రత్తలు సైనికునికి అవసరము||
.
జైహిందని అంటూన్న సిసలు దేశభక్తుడవు
దేశమునే గౌరవించు సైనికునికి సలాము ||
.
..................వాణి కొరటమద్ది ,
.......గజల్ .........
అలసిపోని ఆనందపు కెరటముంది నీలోనే ||
దుఃఖాలకు తెరవేసే ధైర్యముంది నీలోనే ||
.
నిన్నలెంత నిశలైనా మదిలోతున వెలుగులెన్నొ
స్వప్నాలను స్వాగతించు స్వర్గముంది నీలోనే ||
.
మౌనంలో కాలమంత కవనంగా మారిందీ
అక్షరమై అల్లుకున్న కావ్యముంది నీలోనే ||
.
అదుపులేని ఆవేశం చెరిగిపోని సంతకం
అంచలమును అధిగమించు శాంతముంది నీలోనే ||
.
అంతరంగ అలజడిలో హృదయంతో సంభాషణ
నిశ్శబ్దాన్ని నిలదీసే నేస్తముంది నీలోనే ||
.
మౌనవాణి మమకారపు భావాలతొ సావాసం
కలవరాలు కరిగించే సారముంది నీలోనే ||
.
..........వాణి, 15 August 16
నిశలలోన నిలుచుంటే నీడేదీ లేదుకదా ||
వెన్నెలనే దాచేందుకు తెరఏదీ లేదుకదా ||
.
మధురవాణి మదిలోపల నడుస్తున్న చరిత్రలే
నలుగుతున్న మనసులోన మెరుపేదీ లేదుకదా ||
.
రోజులెంత భారమైన కాలమాగి పోదుకదా
పగటిలోన రేయిలోన మార్పేదీ లేదుకదా ||
.
మౌనంలో మేల్కొంటూ ఙ్ఞాపకాల గాయాలే
చెమరించే చీకటులకు ఋజువేదీ లేదుకదా ||
.
అనుభూతుల గుర్తులెన్నొ అవసరాల మార్పులెన్నొ
చివరాకరి పయనానికి గడువేదీ లేదుకదా ||
.
దుఃఖాలను కానుకిచ్చి కరుగుతున్న కాలాలే
కన్నీరో పన్నీరో తలపేదీ లేదుకదా ||
.
......వాణి, 18 August 6

గజల్ ....
.
మౌనపుతెర వీడాలని మాటెందుకు అనుకోదు ||
భావంగా వెలగాలని భాషెందుకు అనుకోదు ||
.
అడుగడుగున కంటకాలు కలతపెడుతు ఉన్నాయే
నవ్వుపూలు రాల్చాలని మనసెందుకు అనుకోదు ||
.
కన్నీటిని కనుపాపలో నిలపాలని అనుకోకు
దీపంగా వెలగాలని ప్రమిదెందుకు అనుకోదు ||
.
భంగపడ్డ మనసులకే బ్రతుకువిలువ తెలుయునులే
కాంతిధార కురియాలని గతిఎందుకు అనుకోదు ||
.
చినుకుతోడు మరిచిందని బీడైనది నేలంతా
పుడమితపన తీర్చాలని మబ్బెందుకు అనుకోదు ||
.
మధురవాణి మనసంతా మమకారపు వాహినులె
మమతస్పర్శ కావాలని తనువెందుకు అనుకోదు ||
.
.....వాణి, 19 August 16
( పిక్ మెరాజ్ గారి వాల్ నుంచి తీసుకున్నాను థ్యాంక్యూ అక్కా)


గజల్ .......
.
ప్రతీక్షణం మధురమైన మౌనాలను అడిగింది ||
కాలమంత యాంత్రికమై కన్నీళ్ళను ఒలికింది ||
.
విషాదాలు వెంటుంటే వెన్నెలెలా చూడనూ
చీకటి మది చిరునవ్వుల దీవెనలను కోరింది ||
.
కలతలతో నిదురలేని రాత్రులనే గడిపాను
ఙ్ఞాపకమే కలవరాల భావాలను రాల్చింది ||
.
ఊహకూడ ఉరకలేయు అవసరంగ మారింది
విజయానికి వెంటాడే ఓటములను వెతికింది ||
.
అశ్రువులకు అందాలను అద్దలేక పోతున్నా
ఆశలతో కనుపాపే స్వప్నాలను వేడింది ||
.
మధురవాణి మాటాడే మనసుభాష ఏమిటది
చెరపమంటు గాయమైన చరిత్రలను చూపింది ||
.
.......వాణి ,24 August 16
........గజల్ .....,.
కలలోనూ కన్నీరే ఒలుకుతోంది అదేమిటో ||
నిదురకూడ నిన్నటినే తలుస్తోంది అదేమిటో ||
.
దూరంగా మిణుగురొకటి నన్నుపిలిచి రమ్మంటే
నిశికూడా నా వెంటే తరలుతోంది అదేమిటో ||
.
వెలుగులనే మెలకువగా ఉండమనే చెపుతున్నా
చీకటియే నా నడకను ఆపుతోంది అదెమిటో ||
.
ఎదురుచూపు ఆశలపై నిట్టూర్పుల నిందలెన్నొ
గమనమంత ఙ్ఞాపకంగ మారుతోంది అదేమిటో ||
.
అద్దంలో కనురెప్పల అందాలను చూస్తుంటే
దుఃఖమేదొ దోబూచులు ఆడుతోంది అదేమిటో ||
.
మనసులోని రాగాలను జాబిల్లికి వినిపిస్తే
విషాదామే పరవశమై పాడుతోంది అదేమిటో ||
.
మధురవాణి మౌనమంత అక్షరమై పలికిందీ
భారమైన భావాలను అల్లుతోంది అదేమిటో ||
.
.........వాణి, 26 august 16
ఈ పిక్ చూశాక ....భావాలు ఇలా అక్షరాలై...
గజల్ గా...
ఆకలిగా అమ్మస్పర్శ సవరించే మనసేది ||
స్వార్ధమేమి లేకుండా ప్రేమించే మనసేది ||
రహదారిన తచ్చాడే ఎదగలేని శోకమది
సర్కారును నిలదీస్తూ ప్రశ్నించే మనసేది ||
నిర్లక్ష్యపు సాక్ష్యమైన భారమైన బ్రతుకుఅది
నిర్జీవపు ఆశలనే వెలిగించే మనసేది ||
చురకత్తుల చూపులవి ధైన్యాన్నే ధిక్కరిస్తు
భావిగెలుచు సారధిగా గుర్తించే మనసేది ||
కఠినమైన జీవయాత్ర కరుణలేని మనుష్యుల్లొ
వెతలులేని కలలతోన నడిపించే మనసేది ||
తడికన్నుల ఆత్మఘోష తల్లిఒడిని చేరాలని
పసితనాన్ని పదిలంగా రక్షించే మనసేది ||
......వాణి , 27 August 16
నిదురలేని రాత్రులన్ని మౌనంగా గడిచాయి ||
నిలదీస్తూ చీకటులను భారంగా గడిపాయి ||
చూపులన్ని శూన్యానికి అంకితమై పోతుంటె
ఊహలన్ని ఉప్పెనలై దు:ఖంగా కదిలాయి ||
కునుకులేక కనుపాపలు నిరాశతో నలిగితే
స్వప్నాలను రమ్మంటూ సాయంగా అడిగాయి ||
ఓదార్పుల తీరంలో నిట్టూర్పుల రాగాలె
సానుభూతి సమీరాలు గాయంగా మారాయి ||
తీరలేని కోరికలే కన్నీటిలొ ఈదుతూ
మదినిండిన భావాలే కావ్యంగా మిగిలాయి ||
మౌనంలో అలజడులు మధురవాణి నిశ్శబ్దమె
పెదవెనుకన పలుకులన్ని ప్రాణంగా మారాయి ||
.....వాణి , 29 August 16
కోరుకున్న వరమునిచ్చి రాల్చేస్తే ఏంచెయ్యను
ఎదగకుండ చిదిమేస్తూ ఓడిస్తే ఏంచెయ్యను
వెలుగువాన కోరలేదు భోగాలను అడగలేదు
చీకటితెర కప్పేస్తూ దాచేస్తే ఏంచెయ్యను
అడుగడుగున ఓటములే చెమరింతల కానుకలే
కష్టానికి ఫలమివ్వక దోచేస్తే ఏంచెయ్యను
నమ్మకాన్ని నమ్ముకుని సాగుతున్న పయనమే
ఊహించని వేదనలో ముంచేస్తే ఏంచెయ్యను
మధురవాణి మనసులోన మౌనాలే తోడున్నవి
అలనాటివి అలజడులే తడిపేస్తే ఏంచెయ్యను

.....vaani, august 31 2016
గజల్ .......
ధనముకాంక్షకు దప్పికైతే నీతిఎక్కడ నిలువగలదూ ||
మానవతకే మరకలైతే మంచిఎక్కడ నిలువగలదూ ||
.
అందమైనది ఆర్తిగీతం ఙ్ఞాపకాలను విప్పుతున్నది
మధురభావం పలుకుతుంటే గాయమెక్కడ నిలువగలదూ ||
.
కంటిపాపకు చింతలెన్నో దయేలేనివి చూపులన్నీ
వెండివెన్నెల పలుకరిస్తే చీకటెక్కడ నిలువగలదూ ||
.
విప్పలేనివి పెదవిముడులే అక్షరాలలో దుఃఖచరితలు
మధురవాణీ మౌనసంపద భావమెక్కడ నిలువగలదూ ||
.
మాటలన్నీ మనసుమాటున నిశ్శబ్దమే ఏలుతున్నది
సంతసాలే స్వాగతిస్తే శోకమెక్కడ నిలువగలదూ ||
.
తరచిచూచే తప్పులెన్నో ఎత్తిపొడుపుల నిందలెన్నో
ప్రహసనాలే నిత్యమైతే చెలిమిఎక్కడ నిలువగలదూ ||
.
ఇంకిపోవవి కంటితడులే ఆశచూపులు ఓడిపోతూ
అంతులేనిది వేదనైతే హాసమెక్కడ నిలువగలదూ ||
.
విజయతీరం చేరుకోవా సంకల్పమే చెంత వుంటే
సాధనే ఒక ధ్యేయమైతే ఓటమెక్కడ నిలువగలదూ ||
.
........వాణి, 2 Sep 16
గజల్ .....
వేదనలో మధురమైన మౌనభాషయే గజల్ ||
అక్షరాల వెలుగునింపు కాంతిబాటయే గజల్ ||
చీకటిలో దీపమౌతు చెరిపివేయు దుఃఖాలు
కన్నీటికి రాగమద్దు మనసుమాటయే గజల్ ||
ఎదలోతుల దీనగాధ దిగులుపొరను దాచలేక
చూపులకే మెరుపులద్దు తళుకుతారయే గజల్ ||
కనుపాపల సంద్రంలో ఙ్ఞాపకాల జల్లుల్లో
చలచల్లని మమతపంచు మంచువానయే గజల్ ||
శిధిలమైన చిరునవ్వులు రాలిపోయి స్వప్నాలు
పల్లవించు చైతన్యపు స్నేహధారయే గజల్ ||
మౌనవాణి భావనలో గేయమైన గాయాలు
కలలెన్నో నింపుకున్న వెలుగురేఖయే గజల్ ||
కునుకులేని రేయిలోన శూన్యంతో సంభాషణ
రెప్పలకే మమకారపు జోలపాటయే గజల్ ||
......వాణి , 3 Sep 16
"ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"
తొలి అడుగుల గురువైన అమ్మకిదే వందనం
వేలుపట్టి నడిపించిన నాన్నకిదే వందనం
అక్షరాల అభ్యాసం శారదమ్మ సామీప్యం
విజ్ఞానపు వరములిచ్చు ‘వాణి’కిదే వందనం
దారిచూపు విధాతవే దివ్యమైన దీవెనలు
జీవితాన్ని వెలిగించే గురువుకిదే వందనం
కీర్తులనే కాంక్షిస్తూ ప్రశంసలే అందిస్తూ
ఓటములకు వెన్నుతట్టు జ్యోతికిదే వందనం
జ్ఞానాన్ని భోదిస్తూ చీకటులను తొలగించి
క్రమశిక్షణ బాటచూపు బ్రహ్మకిదే వందనం
పరవశించు ప్రకృతిలో పాఠమెంత నేర్చామో
సహజశక్తి సృష్టించిన కర్తకిదే వందనం
వాణి,
గజల్ ..
.
మౌనానికి మరుపులద్దు భావంలా ఉన్నానా?
మదిపాడే గీతానికి రాగంలా ఉన్నానా?
.
దుఃఖాన్నే కాలానికి కానుకగా ఇచ్చేస్తూ
హసితాలను హత్తుకున్న కెరటంలా ఉన్నానా?
.
జ్ఞాపకాల గాలితాకి తలపు తల్లడిల్లుతోంది
చిరుననవ్వుల చెలిమిలేని మౌనంలా ఉన్నానా?
.
కలలలోన రంగులెన్నొ కనులుగెలుచు కోవాలని
శూన్యమైన వీధుల్లో స్వప్నంలా ఉన్నానా ?
.
ఓటమినే స్వాగతించు అలసిపోని గెలుపునేను
సింధువులో మెరుస్తున్న ముత్యంలా ఉన్నానా ?
.
మధురవాణి హృదయంలో పల్లవించు అనురాగం
మమకారపు మధువనిలో భ్రమరంలా ఉన్నానా ?
.
.......వాణి, 5 Sep 16
గతమైన శోకం నాతోనె ఉంది ||
మౌనంపు కవనం నాతోనె ఉంది ||

చెమరించు నీటిలో చెదిరేటి తలపు
గుండెల్లొ ధైర్యం నాతోనె ఉంది ||

నిశలన్ని కమ్మేసి నేనోడి పోతె
ఓదార్చు విజయం నాతోనె ఉంది ||

శూన్యాల చూపుల్లొ చెలరేగు అలజడి
కన్నీటి కావ్యం నాతోనె ఉంది ||

రగిలేటి గాయం గుండెల్లొ తడిగా
ఆనంద తీరం నాతోనె ఉంది ||

తాకేటి గాలిలో ఓ నవ్వు శబ్ధం
అనుభూతి అద్దం నాతోనె ఉంది ||

మౌనంగ ఓ వాణి హృదయాన్ని తడిమి
ఓ కాంతి కిరణం నాతోనె ఉంది ||

.......వాణి , 8 Sep 16
గజల్ .......
.
ఓ నవ్వు చీకటిని చెరుపుతూ ఉంటుంది ||
ఓ వెలుగు దీవెనగ సాగుతూ ఉంటుంది ||
.
తరలింది కాలమే వేకువల సాక్ష్యంగ
ఆశలను చినుకులుగ రాల్చుతూ ఉంటుంది ||
.
ఏమార్చె నిన్నలే వేదనలు మరుగౌతు
కథలన్ని కన్నీట జార్చుతూ ఉంటుంది ||
.
అలజడే మనసంత చెమరించి జ్ఞాపకం
మౌనమే చెలిమిగా చెరుపుతూ ఉంటుంది ||
.
ఓ ధ్యాస ఓ వాణి పొత్తిళ్ళ స్పర్శగా
గుండెల్లొ తచ్చాడి తడుముతూ ఉంటుంది ||
.
రేయంత నిట్టూర్పు నిలదీసి అడిగింది
కనుపాప ఓదార్పు నేర్పుతూ ఉంటుంది ||
.
.........వాణి, 12 Sep 16
గజల్ ...
ఆవేదన అశ్రువులుగ ఒలికించిన సుఖము శాంతి ||
చింతలేని చిరునవ్వులు చిగురించిన సుఖము శాంతి ||
మధురవాణి మదిలోతున మౌనమైన దుఃఖాలు
ఙ్ఞాపకాలు గేయాలుగ పలికించిన సుఖము శాంతి ||
చూపులలో చిక్కుకున్న చెరిగిపోని దృశ్యాలు
కనులభాష కవనంలో కదిలించిన సుఖము శాంతి ||
నాటిలోనె నిలచిపోయి అభిమానపు సంపదలే
నటియించని ఆత్మీయత ప్రకటించిన సుఖము శాంతి ||
సాంకేతిక ప్రగతెంతో మాటలన్ని మాయమౌతు
మనసుమాట లేఖలలో అందించిన సుఖము శాంతి ||
అవసరాలు ఆగిపోవు కొలవలేని కాలంలో
చీకటెనుక వెలుగుందని గ్రహించిన సుఖము శాంతి ||
.......వాణి, 14 Sep 16


గజల్ .....
కన్నీళ్ళను వర్షించక కావ్యాలను చూపలేవు ||
తడితగలని కనుపాపలు గమనాలను చూపలేవు ||
శిధిలమైన చిరకాలపు బంధాలను చూస్తున్నా
చీకటిలో చిరునవ్వుల అందాలను చూపలేవు ||
ఙ్ఞాపకాల కాలానికి రంగులద్దు కోవాలని
గతములోకి తరలివెళ్ళు మార్గాలను చూపలేవు ||
తిమిరాలలో తడబాటులు ఎదలోతున అలజడులే
మధురవాణి మదిభావపు మర్మాలను చూపలేవు ||
కనురెప్పకు జోలపాట కరుగుతున్న చీకటిలో
మదిఘర్షణ గెలవలేని గాయాలను చూపలేవు ||
మందస్మిత అందాలను మనసుగెలుచు కుంటోంది
బెట్టుచేసి చిరునవ్వుకు దుఃఖాలను చూపలేవు ||
చెమరించిన భావాలవి మాధుర్యపు రాగంలో
గుండెతడిని ఏమార్చుతు హసితాలను చూపలేవు ||
..........వాణి, 16 Sep 16
గజల్ ......
ఙ్ఞాపకాల చరితలోకి తరలుతూనె ఉండాలా..
పెదవులపై నిట్టూర్పులు పలుకుతూనె ఉండాలా..
ఆరిపోని ఆవేదన హత్తుకునే ఉంటోంది
నిశలనిధిని నిరసించక దాచుతూనె ఉండాలా..
మమతస్పర్శ ఓడిపోక నాదిగానె మిగిలిందీ
మాటలన్ని మౌనంగా మింగుతూనె ఉండాలా...
ఛీత్కరించు చూపులనే సునితంగా దాటేస్తూ
కాలమంత కన్నీటిని తాగుతూనె ఉండాలా...
ఆత్మీయత మనసుల్లో అరుదుగానె మారింది
నటనలతో జీవితాలు గడుపుతూనె ఉండాలా
ప్రకృతితో పలుకరింపు అందమైన ఆనందం
సృష్టిలోని సంపదంత చెరుపుతూనె ఉండాలా...
మధురవాణి భావాలే మనసుతాకు గేయాలూ
ఓదార్పుకు అనురాగం పంచుతూనె ఉండాలా....
.........వాణి, 19 Sep 16
గజల్ ......
కంటిపాపే చీకటైనది కాంతి ఏమిటి చేయగలదూ ||
కలల ఓటమి కావ్యమైనది కాల మేమిటి చేయగలదూ ||

జ్ఞాపకాలది దృశ్యకావ్యం ఉహరాల్చిన వర్ణచిత్రం
అమ్మ భాష్యం గుండెపలికెను కుంచెఏమిటి చేయగలదూ ||

మమతకోరిన హృదయఘర్షణ ఆశపడెనది ప్రేమస్పందన
స్నేహహస్తం వెంటవుండిన ఆపదేమిటి చేయగలదూ ||

కంటితడులకు కానుకిస్తూ మనసుమాలలు అల్లుతున్నది
అశ్రు వర్షం నిగ్రహించిన కలతఏమిటి చేయగలదూ ||

ఓడిపోయిన సంతసాలకు భావమేఘం తోడునిలచెను
కవనజగతిలొ సంచరిస్తే దు:ఖమేమిటి చేయగలదూ ||

చరిత్రంతా వేదనైనా గమనగతులను ఆపలేమే
ఉదయరాగం స్వాగతించిన తిమిరమేమిటి చేయగలదూ ||

చూపుతెరలకు కొత్తవేకువ శాంతి మంత్రం ఆలపించెను
మనోవ్యధలకు మురిపెమద్దిన గాయమేమిటి చేయగలదూ ||

అంతరంగం అలసిపోయెను మధురవాణిది మౌనలాస్యం
విషాదముతొ చెలిమియుద్ధం శోకమేమిటి చేయగలదూ ||
.
..........వాణి, 24 Sep 16
చిరునవ్వుల పువ్వులన్ని ఏరాలని ఉన్నదీ ||
మమకారపు మధువునంత గ్రోలాలని ఉన్నదీ ||
మిన్నంటిన సంతోషం నన్ను పలుకరిస్తుంటె
సంబరమై అంబరాన ఎగరాలని ఉన్నదీ ||
వెలుగువాన జల్లుల్లో నేను తడిసి పోవాలి
వెన్నెలలో జావళీలు పాడాలని ఉన్నదీ ||
అలసిపోని ఆనందం అచ్చంగా నాదైతే
చింతలకే చిరునామా చెరపాలని ఉన్నదీ ||
కాంతివాన కుండపోత కలలెన్నో రాల్చింది
నిరాశనే నిర్దయగా తరమాలని ఉన్నదీ ||
మౌనమైన మనసుతోన మధురవాణి ముచ్చట్లు
కలముతోన కబురులెన్నొ చెప్పాలని ఉన్నదీ ||
......వాణి ,26 Sep 16
చీకటిలో కన్నీళ్లను దాచాలని ఉన్నదోయి !!
సంతసాల మెరుపుల్లో మురవాలని ఉన్నదోయి !!
వెలుగుపూల వనమంతా తుమ్మెదనై తచ్చాడుతు
మరందాల కొలనులోన ఈదాలని ఉన్నదోయి !!
అనుభూతుల అలకలతో మనసు మురిసి పోతోంది
మధురూహల పరిమళాలు చల్లాలని ఉన్నదోయి !!
అందమైన భావాలకు రాగాలను అల్లుకుంటు
మెలుకువకే జోలపాట పాడాలని ఉన్నదోయి !!
జ్ఞాపకాల ఘర్షణలకు ఉద్వాసన చెప్పేస్తూ
చెక్కిళ్లకు చిరునగవును అద్దాలని ఉన్నదోయి !!
మధురవాణి ఆలాపన మౌనగాన మధురితో
వేదనకే సంకెళ్ళను వేయాలని ఉన్నదోయి !!
నరకాలను నిషేదించి కష్టాలకు వీడ్కోలే
స్వర్గానికి స్వాగతాలు పలకాలని ఉన్నదోయి !!
........వాణి ,29 SEP 16


గజల్ ........
మదిలోతుల ఆంతర్యం విప్పెందుకు వీలుకాదు ||
తిమిరాలలో కిరణాలను దాచెందుకు వీలుకాదు ||
సలుపుతున్న వేదనతో సంబరాలు సాధ్యమౌన
చిందిపడే కన్నీళ్ళను నిలిపెందుకు వీలుకాదు ||
ఙ్ఞాపకాల ప్రయాణాన్ని ఆపలేని అసహాయత
మనసుతడిని చిరునవ్వుతొ చుట్టెందుకు వీలు కాదు ||
అలసిపొయి క్షణాలన్ని నిన్నలలో నిలచిపోతె
కరిగిపోయి కాలమంత తెచ్చెందుకు వీలుకాదు ||
ఆనందమె జీవితంలో నిశ్చలంగ ఉంటుందా
వెంటాడే దు:ఖాలను చెరిపెందుకు వీలుకాదు ||
చీకటెంత వర్షించిన వేకువతెర నాపలేము
కలిమోమరి లేమి కాని ఆపెందుకు వీలుకాదు ||
తడిఇంకని భావాలే మధురవాణి గేయాలూ
నిస్సహాయ నిందలనే మోసెందుకు వీలుకాదు ||
.....వాణి, 30 Sep 16
నిశీధిలో వెలుతురుకై తడిమినాను వింతకదా ||
ఎడారిలో చిగురాకులు వెతికినాను వింతకదా ||
నిర్వేదన నిర్లక్ష్యం చూపుకెన్ని గాయాలో
మనసులోకి మౌనంగా నడచినాను వింత కదా ||
భారమైన ఘడియలెన్నొ గుండెసర్ధుకుంటుంన్నది
మధురవాణి భావాలను అల్లినాను వింతకదా ||
చిరునవ్వును తాకుతున్న చెలిమిమంత్రమేమిటది
కలలలోన కోరికలను దాచినాను వింతకదా ||
ఊహఅనే రెక్కలతో మనసునడక మొదలైనది
ఆనందం అర్ణవమై ఎగిరినాను వింత కదా ||
విరక్తినే మదిలోతున నిషేదించ ప్రయత్నమే
అక్షరాల చెలిమితోన సాగినాను వింతకదా||
వెలగలేని ఓటమది నిర్జీవపు చిహ్నమది
మండుతున్న వేదనలో మరలినాను వింతకదా ll
రగులుతున్న గాయానికి చిరునవ్వులు సాధ్యమా
దుఖ:మునకు హసితాలను అద్దినాను వింతకదా ll
.....వాణి, 3 Oct 16

.
మనసుభాషకు రూపం ఇస్తూ చెక్కిలితడిపె అశ్రువులు ||
అవధిలేనిది సంబరమైతె హాసం చిలికె అశ్రువులు ||
.
నిర్జీవంగా నిన్నటిలోనె జ్ఞాపకమే ఒక అపురూపం
గుండెచెమ్మగా మిగిలిపోయిన ఓటమికురిసె అశ్రువులు ||
.
కాలంతుడిచె గాయాలెన్నొ ఆశైనడిచే జీవితము
జ్ఞాపకమౌతు ఆలాపనగా కలలాకరిగె అశ్రువులు ||
.
విరిగిన కలలె కబురులుచెపితె మూగగానె వుంటుంన్నా
భావప్రయాణం బ్రతుకుబాటగా మౌనంపలికే అశ్రువులు ||
.
రగిలే దుఖ:ం కలము కదుపుతూ అక్షరవనమున విరిసింది
హృదయ తడులతొ అందమద్దుతు స్పందన గెలిచె అశ్రువులు ||
.
సునితంగానే సాగుతున్నది మధురవాణిది నిశ్శబ్దం
ఆలోచనకు అర్థంచెపుతు తలపులు ఒలికె అశ్రువులు ||

.........వాణి , 6 Oct 16
మౌనానికి మాటలెలా నేర్పాలో తెలియలేదు ll
కనుపాపకు కలలు ఎలా అద్దాలో తెలియలేదు ll
మదిముచ్చట వింటున్నా మౌనంగా వుండాలి
భావానికి బాధనెలా చెప్పాలో తెలియలేదు ll
అంతరంగ పయనంలో కబురులెన్నొ దాచాను
ఎదలోతుల కథలుఎలా విప్పాలో తెలియలేదు ll
కంటిలోని ప్రతిమకెన్ని గాయాలో తెలుసామరి
రెప్పలకే లాలి ఎలా పాడాలో తెలియలేదు ll
నిశీధిలో దాగుండిన వర్ణాలను వెతకాలి
రంగులలో తడిసి ఎలా మురవాలో తెలియలేదు ll
ఆనందపు ఆహ్వానం కావాలని వుంటుంది
మమకారపు దారి ఎలా వెతకాలో తెలియలేదు ll
మధురవాణి ఆలాపన మనసు పులకరిస్తున్నది
ఆ పిలుపుల దరికి ఎలా చేరాలో తెలియలేదు ll
....వాణి , 7 Oct 16
కునుకులేని రేయిపైన కినుకెందుకు రాదో మరి ll
స్వప్నాలే బ్రతుకువేట విసుగెందుకు రాదో మరి ll
.
అవసరాల ఆందోళన నటనగానె సంతోషం
ధనకాంక్షకు దాసోహం మార్పెందుకు రాదోమరి ll
.
అడుగడుగున ఆశలేన సేవకు విలువేలేదా
భోషాణం నిండివున్న స్ఫూర్తెందుకు రాదోమరి ll
.
ఆనందపు అన్వేషణ అలుపెరుగక సాగాలా
చీకటెనుక వెన్నెలని ధ్యాసెందుకు రాదోమరి ll
.
మదిగాయం మౌనవించి మాసిపోకున్నదేమి
నిశ్శబ్దపు నిరీక్షణకు కరువెందుకు రాదో మరి ll
.
తడిఆరని తలపుల్లో తరిగిపోని ఆనవాళ్లు
మధుర వాణి మౌనానికి మాటెందుకు రాదో మరి ll
.......వాణి , 8 Oct 16
జ్ఞాపకాల కన్నీళ్లలొ కదలాడే కథలెన్నో ||
విప్పలేని మదిమాటున వేలాడే కథలెన్నో ||

చిరునగవులు అలిగాయని చెక్కిలిపై యుద్ధమా
పెదవెనుకన దాగుంటూ వసివాడే కథలెన్నో ||

గుండెలోని గుర్తులవీ తొంగి చూడకుంటాయా
తడబాటుల గమనంలో తచ్చాడే కథలెన్నో ||

ఉదయించే ఊహలెన్నో కలతలతో కరిగిపోతూ
కలవరాలు మోసున్నవి మెదలాడే కథలెన్నో ||

చిందిపడే చీకటిలో కమ్ముకున్న దుఖా లు
కాలాన్నీ మోయలేక జోగాడే కథలెన్నో ||

మధురవాణి అక్షరాలు మౌన యుద్ద గేయాలూ
భావానికి భారమౌతు వెంటాడే కథలెన్నో ||

పరిహసించు లోకానికి నిశ్శబ్దమె జవాబుగా
నమ్మకాన్ని నెగ్గుకుంటు పారాడే కథలెన్నో ||

.......వాణి , 9 Oct 16


మాటాడని ప్రతిమలాగ మిగిలినావు నా మనసున ||
గుండెతడిలొ గేయముగా చేరినావు నా మనసున ||
నిశినిండిన రహదారిన నిన్ను వెతుకుతున్నాను
కలలలోన కదలాడుతు మెదిలినావు నా మనసున ||
చీకటింట మరచినాను చిరునవ్వుల అందాలను
చెలమిస్పర్శ మిణుగురువై తాకినావు నా మనసున ||
కడలిలోని కెరటంలా అలసిపోని ఓటమినే
ఓ భావపు గీతికవై మిగిలినావు నా మనసున ||
నిన్నలన్ని వేదనకే కానుకిచ్చి పంపానా
కన్నీటితొ కావ్యంగా చేరినావు నా మనసున ||
మౌనవాణి అక్షరాలు మధురమనె అనుకున్నా
నిశ్శబ్దపు పయనంలో నిలచినావు నా మనసున ||

......vaani , 13 oct 16
వెన్నెలకే తలవంచని తిమిరమెచట ఉంటుందీ ll
నిశిజాడలు చెరపలేని వెలుగుఎచట ఉంటుందీ ll

పురివిప్పిన నెమలి నాట్యమాడకనే ఉంటుందా
సంతోషపు సందడిలో మౌనమెచట ఉంటుందీ ll

గుండెలయను గుర్తెరిగిన మనసుతాకు దృశ్యాలు
ఙ్ఞాపకాన్ని చెరిపేసే ఙ్ఞానమెచట ఉంటుందీ ll

భావాలను ప్రోదిచేసి పరవశించు రాగాలు
కన్నీళ్ళే లేకుండా కవనమెచట ఉంటుందీ ll

కాలాన్నే సంకెలేసి ప్రశ్నించుట సాధ్యమా
దుఃఖానికి స్పందించని హృదయమెచట ఉంటుందీ ll

మౌనవాణి సంతసాలు నిన్నలలో నిలిచాయి
రేపటినే రచియించే కలముఎచట ఉంటుందీ ll

నిద్రించని రేయినేల నిందించుట నేస్తమా
భవిష్యత్తు చిత్రించే కుంచెఎచట ఉంటుందీ ll

........వాణి , 14 Oct 16
కునుకుతాకి కనుపాపకు స్వప్నమేదొ దొరికింది ll
నిశ్శబ్దం బద్దలౌతు పలుకేదో దొరికిందీ ll
మనసుమాలల్లల్లుతోంది మౌనవాణి ఙ్ఞాపకాలు
అక్షరాల లాలనలో శాంతేదో దొరికిందీ ll
ఓ నవ్వుల శబ్ధమేదొ నన్నుతాకి వెళుతోంది
చూపులకే వెలుగునిచ్చు కాంతేదో దొరికిందీ ll
దూరంగా వుంటోంది దగ్గరగా రమ్మంటూ
కలనుకూడ స్పర్శించని వరమేదో దొరికిందీ ll
అభిమానపు సంపదలే అడుగంటెను నేస్తమా
భావాలకు ప్రాణమిచ్చు కలమేదో దొరికిందీ ll
కాలానికి పరదాలను కప్పివుంచ లేముకదా
ఎదురుచూపు మౌనానికి ఆశేదో దొరికిందీ ll
.........వాణి , 16 OCT 16
అంతరంగ ఆంతర్యం అద్దమెలా చెప్పగలదు ||
ఆవేదన హేతువేదొ కాలమెలా చెప్పగలదు ||

గమనాలను ఆపలేవు ఉప్పెనలే ఎదురయినా
మరునిమిషపు మార్పులనే జీవమెలా చెప్పగలదు ||

వెన్నెలలను వేదనలను బంధించుట సాధ్యమౌన
కల్లోలపు మదిలోతులు లోకమెలా చెప్పగలదు ||

అక్షరమే ప్రపంచమై భావానికి బానిసనే
చిరునవ్వుల భాష్యాలను గాయమెలా చెప్పగలదు ||

ప్రమిదలోని వత్తికూడ వెలుగుకొరకు వెతుకుకదా
దాగుండిన ఆనందపు మార్గమెలా చెప్పగలదు ||

తలగడకే తలపోతలు మనసుకెన్ని మర్మాలో
నలుగుతున్న కథలెన్నో తిమిరమెలా చెప్పగలదు ||

మౌనవాణి మాధుర్యం కవనానికి తెలియునులే
రెప్పచాటు దృశ్యాలకు మూలమెలా చెప్పగలదు ||

...........వాణి, 18 Oc t 16
ఉదయించే రాగాలకు ఊపిరెవరు నేస్తమా ||
మౌనవాణి భావాలకు ఊతమెవరు నేస్తమా ||

ఊహలలో విహరించని హృదయమసలు ఉంటుందా
అంతరంగ పయనానికి సాక్ష్యమెవరు నేస్తమా ||

అనుభూతుల కావ్యానికి మూలమేమిటో మరి
మనసులోని మౌనానికి తోడెవ్వరు నేస్తమా ||

చూపుతాకు దృశ్యాలు నిట్టూర్పుకు గాయాలు
జ్ఞాపకాల యాత్రలోన సాయమెవరు నేస్తమా ||

అందమైన ఆశయాలు అలవికాని దుఃఖాలు
స్వార్ధమైన లోకంలో బాసటెవరు నేస్తమా ||

హసితాలే అలిగాయా ఆనందం వెలివేస్తూ
సంతోషపు స్వర్గానికి జోడెవ్వరు నేస్తమా ||

.......వాణి, 19 Oct 16
మౌనంలో పయనించే మనసెరిగిన ఊహలూ ll
కన్నీటిని ఊరడించు కలలెరిగిన ఊహలూ ll

మూసివున్న కన్నుల్లో మధురమైన దృశ్యాలు
భావానికి రూపమిచ్చు గుర్తెరిగిన ఊహలూ ll

కలవరాల హృదయంలో ఆత్మీయపు సంతకాలు
గుండెగుచ్చు ఙ్ఞాపకాల కలతెరిగిన ఊహలూ ll

అలనాటివి అనుభూతులు అలకలలో సరదాలు
మదితాకే గిలిగింతల స్పర్శెరిగిన ఊహలూ ll

తలపంతా పులకింతలు పెదవులపై చిరునవ్వులు
చిలిపితనం చిగురించే మమతెరిగిన ఊహలూ ll

కడతేరిన స్వప్నాలే మౌనవాణి కవనాలు
తడిఆరని అక్షరాల చరితెరిగిన ఊహలూ ll

చీకటితో మాటాడే చూపుల్లో మెరుపులవి
శూన్యంలో తచ్చాడే గెలుపెరిగిన ఊహలూ ll

..........వాణి , 21 Oct 16
కలలన్ని నెరవేర్చె వరమొకటి కావాలి ||
కలతలను కడిగేటి గెలుపొకటి కావాలి ||

ఊహలో ఉనికిలో జ్ఞాపకం కదిలిస్తె
గాయాన్ని ఏమార్చు నిదురొకటి కావాలి ||

కోరికలె ఓటమై నిరాశలె నిధులయితె
మోవిపై నర్తించు నవ్వొకటి కావాలి ||

వేకువకు నిర్దయే నిన్నలలొ నిలుపుతూ
కన్నుల్లొ వెన్నెలగ ఆశొకటి కావాలి ||

చీకటిలొ వర్ణాలె తోడైయ్యె ధైర్యాలు
నీడలో తోడైన వెలుగొకటి కావాలి ||

మౌనాలు శూన్యాలు తోడుండె నేస్తాలు
భావాల్ని ప్రకటించు పలుకొకటి కావాలి ||

...,...వాణి, 23 Oct 16
గాయమైన రేతిరెలా ముగిసిందని అడగకూ ll
కన్నీటిని వేకువెలా తుడిచిందని అడగకూ ll

నిదురించని రేయంతా నీ కోసం ఆరాటం
జ్ఞాపకాన్ని మనసుఎలా మోసిందని అడగకూ ll

నాకు నేను అర్ధమైన క్షణమొక్కటి లేదుకదా
నిన్నలలో కాలమెలా గడిచిందని అడగకూ ll

నిట్టూర్పుల గాలులలో కనిపించదు ఆవేదన
గుండెలయతొ మౌనమెలా పలికిందని అడగకూ ll

నిశీధిలో నిలచున్నా వెలుగువైపు చేరలేక
దూరంగా మిణుకువెలా మెరిసిందని అడగకూ ll

తడుస్తున్న చీకటిలో కలలు వెతుకుంటున్నా
చిరునవ్వుకు ఓటమెలా కలిగిందని అడగకూ ll

.........వాణి, 25 Oct 16