వెన్నెలకే తలవంచని తిమిరమెచట ఉంటుందీ ll
నిశిజాడలు చెరపలేని వెలుగుఎచట ఉంటుందీ ll
నిశిజాడలు చెరపలేని వెలుగుఎచట ఉంటుందీ ll
పురివిప్పిన నెమలి నాట్యమాడకనే ఉంటుందా
సంతోషపు సందడిలో మౌనమెచట ఉంటుందీ ll
సంతోషపు సందడిలో మౌనమెచట ఉంటుందీ ll
గుండెలయను గుర్తెరిగిన మనసుతాకు దృశ్యాలు
ఙ్ఞాపకాన్ని చెరిపేసే ఙ్ఞానమెచట ఉంటుందీ ll
ఙ్ఞాపకాన్ని చెరిపేసే ఙ్ఞానమెచట ఉంటుందీ ll
భావాలను ప్రోదిచేసి పరవశించు రాగాలు
కన్నీళ్ళే లేకుండా కవనమెచట ఉంటుందీ ll
కన్నీళ్ళే లేకుండా కవనమెచట ఉంటుందీ ll
కాలాన్నే సంకెలేసి ప్రశ్నించుట సాధ్యమా
దుఃఖానికి స్పందించని హృదయమెచట ఉంటుందీ ll
దుఃఖానికి స్పందించని హృదయమెచట ఉంటుందీ ll
మౌనవాణి సంతసాలు నిన్నలలో నిలిచాయి
రేపటినే రచియించే కలముఎచట ఉంటుందీ ll
రేపటినే రచియించే కలముఎచట ఉంటుందీ ll
నిద్రించని రేయినేల నిందించుట నేస్తమా
భవిష్యత్తు చిత్రించే కుంచెఎచట ఉంటుందీ ll
భవిష్యత్తు చిత్రించే కుంచెఎచట ఉంటుందీ ll
........వాణి , 14 Oct 16
No comments:
Post a Comment