Tuesday, 8 November 2016

గజల్ ......
కంటిపాపే చీకటైనది కాంతి ఏమిటి చేయగలదూ ||
కలల ఓటమి కావ్యమైనది కాల మేమిటి చేయగలదూ ||

జ్ఞాపకాలది దృశ్యకావ్యం ఉహరాల్చిన వర్ణచిత్రం
అమ్మ భాష్యం గుండెపలికెను కుంచెఏమిటి చేయగలదూ ||

మమతకోరిన హృదయఘర్షణ ఆశపడెనది ప్రేమస్పందన
స్నేహహస్తం వెంటవుండిన ఆపదేమిటి చేయగలదూ ||

కంటితడులకు కానుకిస్తూ మనసుమాలలు అల్లుతున్నది
అశ్రు వర్షం నిగ్రహించిన కలతఏమిటి చేయగలదూ ||

ఓడిపోయిన సంతసాలకు భావమేఘం తోడునిలచెను
కవనజగతిలొ సంచరిస్తే దు:ఖమేమిటి చేయగలదూ ||

చరిత్రంతా వేదనైనా గమనగతులను ఆపలేమే
ఉదయరాగం స్వాగతించిన తిమిరమేమిటి చేయగలదూ ||

చూపుతెరలకు కొత్తవేకువ శాంతి మంత్రం ఆలపించెను
మనోవ్యధలకు మురిపెమద్దిన గాయమేమిటి చేయగలదూ ||

అంతరంగం అలసిపోయెను మధురవాణిది మౌనలాస్యం
విషాదముతొ చెలిమియుద్ధం శోకమేమిటి చేయగలదూ ||
.
..........వాణి, 24 Sep 16

No comments:

Post a Comment