Tuesday, 8 November 2016

చిరునవ్వుల పువ్వులన్ని ఏరాలని ఉన్నదీ ||
మమకారపు మధువునంత గ్రోలాలని ఉన్నదీ ||
మిన్నంటిన సంతోషం నన్ను పలుకరిస్తుంటె
సంబరమై అంబరాన ఎగరాలని ఉన్నదీ ||
వెలుగువాన జల్లుల్లో నేను తడిసి పోవాలి
వెన్నెలలో జావళీలు పాడాలని ఉన్నదీ ||
అలసిపోని ఆనందం అచ్చంగా నాదైతే
చింతలకే చిరునామా చెరపాలని ఉన్నదీ ||
కాంతివాన కుండపోత కలలెన్నో రాల్చింది
నిరాశనే నిర్దయగా తరమాలని ఉన్నదీ ||
మౌనమైన మనసుతోన మధురవాణి ముచ్చట్లు
కలముతోన కబురులెన్నొ చెప్పాలని ఉన్నదీ ||
......వాణి ,26 Sep 16

No comments:

Post a Comment