Tuesday, 8 November 2016

గాయమైన రేతిరెలా ముగిసిందని అడగకూ ll
కన్నీటిని వేకువెలా తుడిచిందని అడగకూ ll

నిదురించని రేయంతా నీ కోసం ఆరాటం
జ్ఞాపకాన్ని మనసుఎలా మోసిందని అడగకూ ll

నాకు నేను అర్ధమైన క్షణమొక్కటి లేదుకదా
నిన్నలలో కాలమెలా గడిచిందని అడగకూ ll

నిట్టూర్పుల గాలులలో కనిపించదు ఆవేదన
గుండెలయతొ మౌనమెలా పలికిందని అడగకూ ll

నిశీధిలో నిలచున్నా వెలుగువైపు చేరలేక
దూరంగా మిణుకువెలా మెరిసిందని అడగకూ ll

తడుస్తున్న చీకటిలో కలలు వెతుకుంటున్నా
చిరునవ్వుకు ఓటమెలా కలిగిందని అడగకూ ll

.........వాణి, 25 Oct 16

No comments:

Post a Comment