Tuesday, 8 November 2016

జ్ఞాపకాల కన్నీళ్లలొ కదలాడే కథలెన్నో ||
విప్పలేని మదిమాటున వేలాడే కథలెన్నో ||

చిరునగవులు అలిగాయని చెక్కిలిపై యుద్ధమా
పెదవెనుకన దాగుంటూ వసివాడే కథలెన్నో ||

గుండెలోని గుర్తులవీ తొంగి చూడకుంటాయా
తడబాటుల గమనంలో తచ్చాడే కథలెన్నో ||

ఉదయించే ఊహలెన్నో కలతలతో కరిగిపోతూ
కలవరాలు మోసున్నవి మెదలాడే కథలెన్నో ||

చిందిపడే చీకటిలో కమ్ముకున్న దుఖా లు
కాలాన్నీ మోయలేక జోగాడే కథలెన్నో ||

మధురవాణి అక్షరాలు మౌన యుద్ద గేయాలూ
భావానికి భారమౌతు వెంటాడే కథలెన్నో ||

పరిహసించు లోకానికి నిశ్శబ్దమె జవాబుగా
నమ్మకాన్ని నెగ్గుకుంటు పారాడే కథలెన్నో ||

.......వాణి , 9 Oct 16

No comments:

Post a Comment