Tuesday, 8 November 2016

.......గజల్ .........
అలసిపోని ఆనందపు కెరటముంది నీలోనే ||
దుఃఖాలకు తెరవేసే ధైర్యముంది నీలోనే ||
.
నిన్నలెంత నిశలైనా మదిలోతున వెలుగులెన్నొ
స్వప్నాలను స్వాగతించు స్వర్గముంది నీలోనే ||
.
మౌనంలో కాలమంత కవనంగా మారిందీ
అక్షరమై అల్లుకున్న కావ్యముంది నీలోనే ||
.
అదుపులేని ఆవేశం చెరిగిపోని సంతకం
అంచలమును అధిగమించు శాంతముంది నీలోనే ||
.
అంతరంగ అలజడిలో హృదయంతో సంభాషణ
నిశ్శబ్దాన్ని నిలదీసే నేస్తముంది నీలోనే ||
.
మౌనవాణి మమకారపు భావాలతొ సావాసం
కలవరాలు కరిగించే సారముంది నీలోనే ||
.
..........వాణి, 15 August 16

No comments:

Post a Comment