Tuesday, 8 November 2016

మౌనానికి మాటలెలా నేర్పాలో తెలియలేదు ll
కనుపాపకు కలలు ఎలా అద్దాలో తెలియలేదు ll
మదిముచ్చట వింటున్నా మౌనంగా వుండాలి
భావానికి బాధనెలా చెప్పాలో తెలియలేదు ll
అంతరంగ పయనంలో కబురులెన్నొ దాచాను
ఎదలోతుల కథలుఎలా విప్పాలో తెలియలేదు ll
కంటిలోని ప్రతిమకెన్ని గాయాలో తెలుసామరి
రెప్పలకే లాలి ఎలా పాడాలో తెలియలేదు ll
నిశీధిలో దాగుండిన వర్ణాలను వెతకాలి
రంగులలో తడిసి ఎలా మురవాలో తెలియలేదు ll
ఆనందపు ఆహ్వానం కావాలని వుంటుంది
మమకారపు దారి ఎలా వెతకాలో తెలియలేదు ll
మధురవాణి ఆలాపన మనసు పులకరిస్తున్నది
ఆ పిలుపుల దరికి ఎలా చేరాలో తెలియలేదు ll
....వాణి , 7 Oct 16

No comments:

Post a Comment