Thursday, 3 November 2016

మనసంతా శూన్యమైతె మౌనమేమి చెపుతుంది ||
కనుపాపే భారమైతె కాంతి ఏమి చెపుతుంది ||

కాలమింత కఠినమా క్షణాలన్ని భారమౌతు
పెదవెనుకన దాగుండిన పలుకుఏమి చెపుతుంది ||

వసంతమే రావాలని చిగురుకెంత ఆరాటం
పండుటాకు రాలిపోతె శిశిరమేమి చెపుతుంది ||

గుండెతడిగ మిగిలుండెను రెప్పవెనుక అశ్రువులు
నిశ్శబ్దంపై నిందవేస్తె గాయమేమి చెపుతుంది ||

ఓ వెన్నెల కిరణమేదొ ప్రేమస్పర్శ ఇచ్చింది
వెలుగంతా బంధిస్తే చీకటేమి చెపుతుంది ||

మనసంతా ఎండమావి అనురాగం ఆశిస్తూ
మమకారం కలుషితమే ఆత్మఏమి చెపుతుంది ||

జాడలేవు బంధాలే అలసిపోయి అనుబంధం
ప్రగతివైపు పరుగులటగ బ్రతుకుఏమి చెపుతుంది ||

..........వాణి, 30 Oct 16

No comments:

Post a Comment