Thursday, 3 November 2016

గజల్ .....

కంటితడుల రుచితెలియని మనసెక్కడ దొరుకుతుంది ||
ఙ్ఞాపకాన్ని నిలువరించు శక్తెక్కడ దొరుకుతుంది ||

సమీరమే ఓదార్చెను ఏకాంతపు వేదననే
మౌనంతో మాటాడని హృదిఎక్కడ దొరుకుతుంది ||

వెలుగెంత పరిచున్నా చీకటులే మస్తకంలో
మదిఓడిన తేజానికి  తోవెక్కడ దొరుకుతుంది ||

వెన్నెలలో నడవాలని తిమిరాలను వెలివేస్తూ
నీడలనే చెరిపేసే వెలుగెక్కడ దొరుకుతుంది ||

తలపుల్లో తడబాటులు రెప్పచాటు దృశ్యాలూ
తడితరగలు తుడిచేసే మమతెక్కడ దొరుకుతుంది

నిన్నటిదే ఆవేదన నా ముందర   ప్రశ్నేగా
గుండెగదిలొ అనుభూతికి చోటెక్కడ దొరుకుంది ||

పెదవులపై నిట్టూర్పులు చెమరించిన చెక్కిళ్ళే
అలజడులను దాచేసే తెరఎక్కడ దొరుకుతుంది ||

కలవరాలు కడిగేసే స్వప్నాలే కావాలి
చింతలన్ని తొలగించే నిదురెక్కడ దొరుకుతుంది ||

మౌనవాణి పదనిధులే సవరించని దుఃఖాలు
రగులుతున్న గాయాలకు మరుపెక్కడ దొరుకుతుంది ||

.......వాణి,

No comments:

Post a Comment