Tuesday, 8 November 2016

........గజల్ .....,.
కలలోనూ కన్నీరే ఒలుకుతోంది అదేమిటో ||
నిదురకూడ నిన్నటినే తలుస్తోంది అదేమిటో ||
.
దూరంగా మిణుగురొకటి నన్నుపిలిచి రమ్మంటే
నిశికూడా నా వెంటే తరలుతోంది అదేమిటో ||
.
వెలుగులనే మెలకువగా ఉండమనే చెపుతున్నా
చీకటియే నా నడకను ఆపుతోంది అదెమిటో ||
.
ఎదురుచూపు ఆశలపై నిట్టూర్పుల నిందలెన్నొ
గమనమంత ఙ్ఞాపకంగ మారుతోంది అదేమిటో ||
.
అద్దంలో కనురెప్పల అందాలను చూస్తుంటే
దుఃఖమేదొ దోబూచులు ఆడుతోంది అదేమిటో ||
.
మనసులోని రాగాలను జాబిల్లికి వినిపిస్తే
విషాదామే పరవశమై పాడుతోంది అదేమిటో ||
.
మధురవాణి మౌనమంత అక్షరమై పలికిందీ
భారమైన భావాలను అల్లుతోంది అదేమిటో ||
.
.........వాణి, 26 august 16

No comments:

Post a Comment