Thursday, 3 November 2016

శూన్యంలో నీ జాడలు వెతకలేక పోతున్నా ll
గమనంలో నీ ఉనికిని గెలవలేక పోతున్నా ll

ఓటమిగా మిగిలానని నిశ్శబ్దాల దండయాత్ర
నీవులేని లోకంలో నిలువలేక పోతున్నా ll

హాసానికి బదులిమ్మని సమాజమే బాధిస్తే
నటియించే నవ్వులతో మసలలేక పోతున్నా ll

నా ముందరి ఆనవాళ్ళు ప్రశ్నిస్తూ వున్నాయి
మదిలోతుల భావాలను ఒంపలేక పోతున్నా ll

కరిగిపోయి ఆశవే కలగా మిగిలిపోయావె
నైరాశ్యపు నీడలోన బ్రతకలేక పోతున్నా ll

కాలమిలా మోస్తున్నా కన్నీటిని ఒలికిస్తూ
ఆనందపు ఆచూకిని అందలేక పోతున్నా ll

పొత్తిళ్ళ పాపడిగా పొదుముకుని మురిశానే
మాయమైన నీ స్పర్శను మరువలేక పోతున్నా ll

ఏటేటా సంబరాలు అంబరాన్నంటేవే
మిన్నలలో నీవుంటే ఓపలేక పోతున్నా ll

కాలమెంత కరిగినా దుఃఖానికి బానిసనే
నీ ధ్యాసే ప్రతిక్షణం చూడలేక పోతున్నా ll

ప్రతిరాత్రీ జాగారం నీ ఉహతో ముచ్చట్లూ
ఉదయానికి ఆహ్వానం పలుకలేక పోతున్నా ll

అలనాటిది ఆనందం చరిత్రగా మిగిలెకదా
చిరునవ్వుకు బాసటగా నిలువలేక పోతున్నా ll

ఎదురుచూపుకు ఆశలెన్నొ క్షణాలన్ని లెక్కిస్తూ
నీ రూపం అపురూపం కాంచలేక పోతున్నా ll

తప్పటడుగుల తప్పిదాలు ఏమార్చిన నిర్లక్ష్యం
తరలిపోయె నీ తనువే తాకలేక పోతున్నా ll

గాయమైన గుండెనాది అర్ధాంతర ముగింపునీది
గమనాలను భారంగా గడపలేక పోతున్నా ll

అద్భుతమే జరగాలని ఆరాటం నాదికదా
అన్వేషణ మార్గాలను తెలియలేక పోతున్నా ll

రెక్కలెక్క డుంటాయి నీవుండే దరిచేరాలి
బాధ్యతలే బరువులైన దించలేక పోతున్నా ll

తడితలపుల్లొ నువ్వెపుడూ తచ్చాడుతు వుంటావు
ఙ్ఞాపకాన్ని వద్దంటూ వీడలేక పోతున్నా ll

గుండెలోని గుర్తులవి ఇంకిపోవు కన్నీళ్ళు
అలసటగా నా పయనం ఆపలేక పోతున్నా ll

ఇరవైలో అడుగిడావు ఎక్కడనీ వెతకాలీ
అడుగడుగున అవాంతరం కలవలేక పోతున్నా ll

ఏ లోకం నీదైనా నీ లోకం నాదేలే
ప్రతి భావం నీ కోసం మారలేక పోతున్నా ll

.........వాణి, Vaddamani Avinash 26 Oct 16

No comments:

Post a Comment