Tuesday, 8 November 2016

చీకటిలో కన్నీళ్లను దాచాలని ఉన్నదోయి !!
సంతసాల మెరుపుల్లో మురవాలని ఉన్నదోయి !!
వెలుగుపూల వనమంతా తుమ్మెదనై తచ్చాడుతు
మరందాల కొలనులోన ఈదాలని ఉన్నదోయి !!
అనుభూతుల అలకలతో మనసు మురిసి పోతోంది
మధురూహల పరిమళాలు చల్లాలని ఉన్నదోయి !!
అందమైన భావాలకు రాగాలను అల్లుకుంటు
మెలుకువకే జోలపాట పాడాలని ఉన్నదోయి !!
జ్ఞాపకాల ఘర్షణలకు ఉద్వాసన చెప్పేస్తూ
చెక్కిళ్లకు చిరునగవును అద్దాలని ఉన్నదోయి !!
మధురవాణి ఆలాపన మౌనగాన మధురితో
వేదనకే సంకెళ్ళను వేయాలని ఉన్నదోయి !!
నరకాలను నిషేదించి కష్టాలకు వీడ్కోలే
స్వర్గానికి స్వాగతాలు పలకాలని ఉన్నదోయి !!
........వాణి ,29 SEP 16

No comments:

Post a Comment